మా షెట్టి, రాంప్రసాద్లు కొండంత ప్రోత్సాహాన్నిచ్చాక వ్రాయడానికి భలే ఉత్సాహమొచ్చిందంటే నమ్మండి! ప్రోత్సహించారుగా, ఇక భరించండి! ఈనాటి అంశం- “పరుషం మాటలూ, పాడు జపాలూ”. ఎందుకంటారా? మీరే చూద్దురుగాని!
ఈ రోజుల్లో
పాడు జపాలూ, పరుషం మాటలూ, సర్వసాధారణమైపోయాయి. ఎందుకో తెలియలేదుగానీ, అలాగ మాట్లాడేవళ్ళకది
గొప్పేమో అనిపించింది. ఆంగ్లంలో మాటాడేవళ్ళైతే మరీను. ఈ మధ్యనే మాకు తెలిసినవాళ్ళమ్మాయిని
అనుకోకుండా కలిశాను. మహా అయితే ఐదు నిముషాలు మాట్లాడామేమో కానీ, అంతలో ఆ అమ్మాయి నరకాన్నీ,
అశుధ్ధాన్నీ, ఇంకా చాలా చాలా చెప్పలేని మాటల్ని ప్రస్తావించింది. 'టైడ్' వాడకపోయినా
అవాక్కయ్యాను. స్నేహితులని బండభాషతో సంబోధిస్తే, అది సాన్నిహిత్యమట! ముక్కుమీద వేలేసుకున్నాను.
హతవిధీ, అని బాధపడ్డాను. కాలం మారిందో, నాకు వార్ధక్యం వచ్చిందో తెలియదుగానీ, నా చిన్నప్పుడు
ఇలా వుండేది కాదు అని, అనకుండా ఉండలేకపోతున్నాను.
*******