ఈ కథ
శృంగార రసానికి సంబంధించినది కాదు. మనోబలానికి సంబంధించినది. ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న
వాళ్ళు కూడా మానసిక వత్తిడికి గురి అవుతారు. స్వంత పేరుతో ఒక సమతౌల్యం
(Equilibrium) కలిగి ఉన్న జాన్ నాష్ కొద్ది రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఆర్ధిక శాస్త్రంలో నోబుల్ బహుమతి గ్రహీత, ప్రముఖ గణిక శాస్త్రజ్ఞుడు అయిన ఆయన తన యుక్త
వయసులో స్కిట్జోఫ్రేనియా అనే తీవ్రమైన మానసిక రుగ్మతకు లోనయ్యారు. దాని నుంచి బయట పడ్డాక,
ఈ విషయం బయటపెడితే తన పరువు ప్రతిష్ఠలకి భంగం
కలుగుతుందేమో అని ఒక సామాన్య మానవునిలా ఆలోచించకుండా, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు
కృషి చేసిన మనీషి ఆయన. చంద్రునికో నూలుపోగులా ఆయన స్మృత్యర్థం ఈ కథ. నేను వైద్యం చేసే
డాక్టర్ని కాను. అలాగని కనీసం మనోవిజ్ఞాన శాస్త్రం కూడా చదవలేదు. అయినప్పటికీ మానసిక
ఆరోగ్యం అంటే మిక్కిలి మక్కువ. దీన్ని చదివిన వారిలో ఒక్కరైనా మానసిక రుగ్మతల పట్ల
శీతకన్ను చూపకుండా వుంటే నా ఈ వ్రాత ధన్యమైనట్టే.
ఇక
పోదాం పదండి కథలోకి ..........
*********************************
"విన్నావా
గురూ, మన ఆఫీసర్ గారిని పోలీసులు పట్టుకెళ్ళి ఆస్పత్రిలో పెట్టారట!" కంగారుగా
అన్నాడు విశ్వనాథం.
"ఏమిట్రా
శిష్యా, తాగొచ్చావా పనిలోకి? ఒకటి, నేను నీకు గురువుని కాను. నా పేరు గురునాథం. నేను
నీ కన్నా పెద్ద గుమాస్తాని. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. వయో వృద్ధుడూ, పదవీ వృద్ధుడూ
అయిన వాణ్ణి ఇలాగేనా సంబోధించటం? పైగా ఆఫీసర్ గారిని ఆసుపత్రిలో పెట్టాలంటే అంబులెన్సు
లో తీసుకెళ్ళాలి గాని పోలీసులతో కాదు", అన్నాడు గురునాథం ఫైల్లో నిమగ్నమైన తన
తల ఎత్తకుండానే.
"అయ్యా,
కావాలంటే నాకు రక్త పరీక్ష చేయించండి. నేను
తాగలేదు. కూతురిపై హత్యాయత్న నేరం కింద అరెస్ట్ చేసారుటండీ. నా మాట నమ్మండి",
అన్నాడు విశ్వనాథం ప్రాధేయపడుతున్నట్లుగా.
"ఏమిటేమిటీ,
ఆ పదేళ్ళ బుజ్జి పాపనా ఆయన, కాదు కాదు వాడు, చంపాలనుకుంది? పాపిష్ఠి వాడు, పాపాన పోతాడు
చూస్తుండు. ఇంటికి మనిషిలా వెళ్తాడో, శవమై వెళ్తాడో చూద్దాం", అక్కసుతో అన్నాడు
గురునాథం.
"అదేమిటి
గురునాథం గారూ, ఇప్పుడే మర్యాద గురించి నాకు ఒక క్లాసు పీకారు. మన ఆఫీసర్ గారిని ఇలా
అనడం ఏమీ బాగాలేదండీ", అంటూ అభ్యంతరం చెప్పాడు విశ్వనాథం.
"మంచి
చేసే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి గానీ కన్నకూతుర్ని చంపాలనుకున్న కసాయి వాడికి కాదు. అయినా
వాణ్ణి జైల్లో పెట్టాలి గానీ, ఆసుపత్రిలో ఎందుకు పెట్టారో?" అని కాస్త స్వగాతంగానూ
కాస్త ప్రశ్న వేసినట్టూ అన్నాడు గురునాథం.
బదులివ్వాలనిపించకపోయినా
గురునాథాన్ని అపోహ నుంచీ,ఆఫీసర్ని నీలాపనింద నుంచీ బయట పడెయ్యాలి గనక ," వాళ్ళమ్మాయిని చంపి................
".
పూర్తి
కానివ్వకుండా అడ్డు తగులుతూ, "అంతా ఆ కొత్త పెళ్ళాం మహిమ. ఊరికే అనరు, పెళ్ళాం
అంటే బెల్లమని. ఈవిడ మోజులో పడి కన్న కూతుర్నే
చంపాలనుకుంటాడా ఆ కిరాతకుడు! కలి కాలమంటే యిదే మరి!", అని అవాకులూ, చవాకులూ పేలాడు
గురునాథం.
"అయ్యా
, మిమ్మల్ని ఆత్మీయులుగా భావించి, ఏక వచన ప్రయోగం చేసి తప్పు చేశాను. క్షమించి, నేను
చెప్పేది పూర్తిగా వినండి. పిల్లని చంపి, ఆయన కూడా చచ్చిపోదామనుకున్నారుట. యముడు జాలి
చూపి ఇంకా వాళ్ళ జోలికి పోలేదు. అంతే", అని, లేచి బయటకు వెళ్ళిపోయాడు విశ్వనాథం.
****************
భోజన
వేళలో ఆసుపత్రికి వెళ్ళిన విశ్వనాథానికి ఎక్కడ చూసినా పోలీసులే. ఇంత కరుడుకట్టిన నేరస్థుడి దగ్గరా తను ఇన్నాళ్ళూ
పని చేసింది? ఆఫీసర్ని ఒక గురువుగా భావించాడే?తన అంచనా అంత తప్పా? ఏమో! మరో వైపు బోలెడు
గురునాథాలు. ఎవరి నోట విన్నా ఆఫీసరు గురించి ఒక్క మంచి మాట లేదు కదా! తెలుగు సినీమా
పేర్లల్లో వచ్చే పదాలు, అంటే రౌడీ, హంతకుడు- ఇలా ఎవరికి తోచిన బిరుదులు వాళ్ళిచ్చుకుంటూ
పోతున్నారు. ఓ మనిషి, తన కూతురితోసహా చావుబతుకుల మధ్య ఉన్నాడనే కనీసపు మానవత్వం ఎవరికీ
ఉన్నట్టు లేదు. కరుడు కట్టిన హంతకులకి పెట్టే శాపనార్థాలు ఆయనకి పెట్టేస్తున్నారు.
ఒకటే తికమక. మనసు వికలమై మధ్యాహ్నం ఆఫీసుకి శలవు పెట్టి ఇంటి దారి పట్టాడు విశ్వనాథం.
*********************************
ఇంటికి
వెళ్ళి, తన కారియర్ లోని భోజనం చేసి, మంచం మీదకి జారాడు విశ్వనాథం. భార్య, పిల్లలు
ఇంకో రెండుగంటల దాకా రారు. తను నిశ్చింతగా, ఎటువంటి అడ్డంకులూ లేకుండా తన ఆలోచనల్లో
మునగవచ్చు.
*********************************
పదేళ్ళ
క్రితం, తను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో జరిగిన
సంఘటన అది. "రెండు చందమామల కలయిక లో చందమామే పుడుతుంది గానీ వేరేదీ పుట్టదు. పేరు
కూడా ఆ రూపాన్ని ప్రతిబింబించేటట్టు 'పూర్ణిమ'. అహాఁ, మీ జీవితం నిండా పున్నములే
.............." అంటూ ఆఫీసర్ని ఆకాశానికి ఎక్కించేస్తున్నాడు గురునాథం. పరీక్షగా
చూశాడు తను మునగ చెట్టెక్కించేస్తున్నాడేమో అని. కానే కాదు. సీతారాముల్లా, పార్వతీపరమేశ్వరుల్లా
ఉన్నారు వైదేహి, రాఘవ రావు దంపతులు. వాళ్ళమ్మాయి
పూర్ణిమ అచ్చం పున్నమి నాటి చందమామలా వుంది. ఆ ముఖం సర్కులర్ తో గీసిన వృత్తంలా గుండ్రంగా
వుంది. చంటిపిల్లలు ఎవరైనా ముద్దొస్తారుగానీ ఈ పాపాయి మాత్రం నామకరణ సమయానికే
"అబ్బో" అనిపిస్తోంది.
**********************
అంతా
విషాదం నెలకొంది. రాఘవ రావు ముఖాన్ని ఇంత కళావిహీనంగా చూడడం ఇదే మొదటి సారి తనకి. ఆరేళ్ళ
పూర్ణిమ వలవలా విలపిస్తోంది. వాళ్ళమ్మ ఇంక తిరిగి రారని ఎవరైనా చెప్పారో లేదో కానీ,
కడుపు చించుకున్న బంధం ఆమెను కన్నీరు మున్నీరుగా ఏడిపిస్తోందేమో!
**********************
రాఘవ
రావు ఆఫీసుకొస్తున్నాడు కానీ ఇదివరకటి ఉత్సాహం లేనే లేదు. జీవచ్ఛవంలా వున్నాడు. చేసే
పనిలో ఢోకా లేదు గాని తేడా మాత్రం అందరికీ తెలిసే విధంగా ప్రస్ఫుటంగా వుంది.
**********************
"అందరూ
వినండొహోయ్....... మన ఆఫీసర్ గారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. మేడం పేరు లక్ష్మి. మనూరే.
ఆవిడ డివోర్సీ అట. తల్లి లేని పిల్ల ఆలనా, పాలనా చూసుకోవడానికి చేసుకున్నారట. ఎందుకంటే,
ఇప్పుడు ఆ పని చేస్తున్న వాళ్ళమ్మ గారు చేతులు ఎత్తారట. ఏడేళ్ళ పాప అల్లరి ఎక్కువై,
దాని వెంట పరుగెత్తలేకపోతున్నానని ఆవిడ వాపోయిందట. బహుశః, రాఘవ రావుగారు తనకుతానే బాధ్యత
తీసుకునేటట్టు చేయడానికి ఆవిడ ఉపాయం కావచ్చు", అన్నాడు గురునాథం.
"నా
చిన్నప్పుడు "సవతి తల్లి" అంటే "గయ్యాళి" అనుకునేవాళ్ళం. ఈ రోజుల్లో
అలా కాదని అనుకుంటున్నాను. పూర్ణిమకి తల్లి దొరుకుతుందేమో చూద్దాం. మన ఆఫీసరు గారు
కొత్త పెళ్ళాంతో ఎలా ప్రవర్తిస్తారో...పాపం. ఆయనకి భార్యంటే చాలా ఇష్టమనీ, ఆవిణ్ణి
హృదయపు కోవెలనుండి బహిష్కరించలేక మథన పడుతూ, కూతుర్ని కూడా అలక్ష్యం చేశారనీ విన్నాం.
పొనీ లెండి, ముగ్గురూ చక్కబడితే ఆల్ హ్యాపీసు", అన్నారు వేరొకరు.
"దేవుడా,
వాళ్ళని చల్లగా చూసుకో స్వామీ", అనుకున్నాడు తను.
**********************
"తెలుసా,
'ఆడదాని ఓరచూపులో..' అనే పాట ఊరికే వ్రాయలేదా కవి. మన ఆఫీసర్ కొత్త పెళ్ళాం కొంగు పట్టుకు
తిరుగుతున్నడట ప్రతీ పెళ్ళికీ, పార్టీకీనూ. కీర్తి శేషురాలైన భార్యంటే ప్రేమట. నా బొంద.
ఇదంతా కొత్త భార్యని ఆకర్షించడానికి ఉపయోగించే తెలివితేటలు", అనే మాటలు ఆఫీసులో
వినబడ్డాయి. "వాళ్ళనీ, పాపనీ కూడా సంతోషంగా వుంచు దేవుడా", అనుకున్నాడు తను.
**********************
మళ్ళీ
వర్తమానంలోకి వచ్చాడు విశ్వనాథం. ఇంతలో ఏమయ్యింది రాఘవ రావుగారికి? రెండేళ్ళలోనే కన్న
కూతురు బరువయ్యిందా? పోయిన భార్యకోసం కూతుర్నే లెక్క చేయనివారు, ఇప్పుడు కొత్త భార్య
కోసం పిల్లని చంపడానికి సిద్ధపడ్డారంటే ఆశ్చర్యమేముంది? కాదు, ఆయన అలాంటి వారు కారు.
ఇదేదో ఖచ్చితంగా గాలివార్తే అయ్యుంటుంది. ఏమో, ఎవరెలాంటివారో ఎవరికి తెలుసు? అంతా అయోమయంగా
వుంది.
ఇంతలో
కాలింగ్ బెల్ మ్రోగింది. అకాలంగా తనని ఇంట్లో చూసిన భార్యకు సర్ది చెప్పి, ఆసుపత్రికి
బయలుదేరాడు. తండ్రీ కూతుళ్ళు కోలుకుంటున్నారని తెలిసి సంతోషించాడు. ఈ మాటు కొత్త కూతలు
వినబడ్డాయి, రాఘవ రావుగారి మీద. ఆఫీసులో ఏదో కుంభకోణం చేశారనీ, అది బయట పడితే మొహం
చెల్లదుకనుక ఆత్మహత్యకు తలపడ్డారని ఎవరో చెప్పుకుంటున్నారు. ఇది మరీను. నిజాయితీకి
మారు పేరు ఆయన. అన్నీ తెలిసీ, అదిగో పులి అంటే, ఇదిగో తోక అనే జనాలే ఎక్కువ ఈ ప్రపంచంలో!
పోనీ కొంతసేపు వాళ్ళ మాటే నిజం అనుకుంటే మరి కూతుర్ని ఎందుకు చంపజూస్తారాయన? అంతా అయోమయం.
అలాగని ఎవరినైనా అడిగే పరిస్థితి లేదు. నిజం నిలకడ మీద తెలియాల్సిందే.
**********************
...................to be continued
7 comments:
మంచి సబ్జెక్ట్! కథలోకి తీసుకెళ్ళే తీరు, శైలి చాలా బావున్నాయి... రెండవ భాగం ఎప్పుడిస్తారా అని ఆత్రుతగా ఎదురుచూసేటంతగా!! అభినందనలు!!
ధన్యవాదాలండీ.. రేపు రాత్రి ఎనిమిదికి అప్లోడ్ చేస్తా!
Excellent. Ps bring out all your posts as a book one day. Best wishes, as always
with ur blessings, annayya
with ur blessings, annayya
A very relevant subject Surya. Read it just now. You are very talented. Like someone else wrote, I hope you publish this as a book soon.
Shanti, thank you for your best wishes and encouragement! I hope to bring out my anthology, God willing!
Post a Comment