Thursday, September 7, 2017

చిట్టి కథ- keywords-" హార్థిక బంధాలన్నీ ఆర్థిక సంబంధాలైనప్పుడు ఏం చెయ్యగలం ?"- ఆత్మస్థైర్యం

“నేను ఏం పాపం చేశానని, ఈ మధ్య ఊరికే ఇంట్లో నరకం సృష్టిస్తున్నారు?” ఇద్దరు పిల్లలున్నారు, వాళ్ళని చీదరించుకుంటే ఆ పసిమనసులు ఎంత బాధ పడతాయో ఆలోచించారా? వాళ్ళు పడ్డ ఈ మథన వాళ్ళని పెద్దయ్యాక ఎలాగ తాయారు చేస్తుందో తెలుసా? వాళ్ళెదురుగా నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ఇంకా వాళ్ళకి కన్న తల్లంటే గౌరవం ఉంటుందా?” కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ అడిగింది హిమజ.

 “ఆడవాళ్ళకి లేని పోని గౌరవాలు వాళ్ళేమీ ఇవ్వక్కరలేదు. అయినా, నాకు నీ మీద మోజు తగ్గింది. నీతో ఉండాలంటే కంపరంగా ఉందే!” విసుక్కుంటూ అన్నాడు శివరామ్. “నేను మీ కన్నా పదేళ్ళు చిన్నదాన్నైనా, నా వెంటపడి, ప్రేమించి మరీ పెళ్ళిచేసుకున్నరెందుకు?”ఉక్రోషంగా అడిగింది హిమజ. “అప్పట్లో నువ్వు నాజూకుగా ముద్దొచ్చేటట్టు ఉండేదానివి. ఇప్పుడు చూడు, మొద్దులా ఉన్నావ్. ఇప్పుడు నిన్ను ఎవడు చూస్తాడే!” అంటూ సిగరెట్ వెలిగించాడు శివరామ్. “నన్ను ఎవడైనా ఎందుకు చూడాలి? పైగా, ఈ చెడ్డ అలవాటుందని అప్పట్లో నాకెందుకు చెప్పలేదు?” అని మళ్ళీ రోదించింది హిమజ. “ఆఁ, చెప్పేస్తారు మరి! వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు కదా!” అని విసురుగా జవాబిచ్చాడు శివరామ్. మళ్ళీ తనే, “మీ నాన్న నా అలవాట్లు ఎలాంటివో కూడా విచారించలేదు. నా సంపాదనెంత? నా వెనుక ఆస్తిపాస్తులు ఏ రేంజ్ లో ఉన్నాయి- ఇవే కదా అడిగాడు? ఇదేదో పెద్ద పవిత్రబంధం అన్నట్టు ఓ తెగ ఇదైపోతున్నావేంటే? ఇప్పుడు చెబుతున్నాను విను. నాకుండే డబ్బుకి కో అంటే కోటి మంది దొరుకుతారు. నీలాంటి రుబ్బురోలుతో పడుండక్కరలేదు. నాకొక అందమైన అమ్మాయి దొరికింది. నీ కన్నా పదేళ్ళు చిన్నది. దానికి షోకులు కావాలి, నాకు అందం కావాలి. నీకూ, నీ పిల్లలకి కావలసినంత ఇస్తున్నాను కదా! విసిగించక, నోరు మూసుకుని పడుందండి”, అన్నాడు గొప్పగా.
“పిల్లలు పడుక్కున్నారు కాబట్టి సరిపోయింది. వాళ్ళ నాన్న ఎంత నీచుడో వాళ్ళకి తెలియలేదు. కట్టుకున్న పెళ్ళానికి ద్రోహం చేస్తారా? సిగ్గులేదూ?” అని అరిచింది. “చాల్లే నోర్ముయ్, లేకపోతే చెయ్యి చేసుకోవలసి వస్తుంది! నన్ను నానా మాటలూ అనే ఆడది నాకొద్దు. నోర్మూసుకుని పడుంటే ఉండు, లేకపోతే బయటికి పో!” అని లెక్కలేకుండా మాట్లాడాడు శివరామ్. “పోతాను. ఇంటర్ చదివేటప్పుడు నా వెంట పడి, పెళ్ళి తరువాత నన్ను చదవనివ్వలేదు. నేను చదివిన చదువుకి ఏం ఉద్యోగం వస్తుంది?” అంది హిమజ. “కరెక్ట్. ఇలాంటి రోజొస్తే నువ్వు నీచ స్థితిలో ఉండాలనే అలా చేశాను. సో, నోరు మూసుకునుండు!” గెలిచిన సంతోషంతో అన్నాడు శివరామ్. “ఊహూఁ, నేను బయటకే వెళ్తాను”, నిర్ణయానికి వచ్చింది హిమజ. “నీకు ఎంత భరణం కావాలో రాసుకో”, అంటూ బ్రీఫ్ కేసులో ఉన్న చెక్ బుక్ తీసి, సంతకం చేసి, ఆ సంతకం పెట్టిన ఖాళీ చెక్కుని ఆమె ముఖాన కొట్టాడు. ఆమె దాన్ని చింపేసి, “నేను, నా పిల్లలు కాలో గంజో తాగి బతుకుతాం. వాళ్ళిద్దరూ అబ్దుల్ కలాంని గుర్తు తెచ్చే మంచి మనుషులయ్యేటట్టు పెంచుతాను”, అని, నిద్రపోతున్న తన పిల్లలని లేపి, వాళ్ళతో బయటకు నడిచింది హిమజ.

*****

No comments: