అనగనగా ఓ మధ్యతరగతి కుటుంబం, ఇద్దరే ఆడపిల్లలు. చిన్నప్పటి నుండీ పెద్దమ్మాయి వేదవతిది పోటీ తత్త్వం. తనకు కొన్నలాంటి బట్టలే చెల్లెలికి కొనాలని పట్టుబట్టేది (అంటే, అది తన ఎంపిక అని; పైగా,
ఎవరైనా మెచ్చుకోకపోతే ఎంచక్కా తన చెల్లి మీదకి నెట్టెయ్యచ్చు). తనకి కాలేజీ లెక్చరర్ వర్ధన్ తో పెళ్ళి అయ్యింది కనుక తన చెల్లెలైన పద్మావతికి కంపెనీ మేనేజర్ సంబంధాలు చూడకుండా అడ్డుపడి, మరో కాలేజీ లెక్చరర్ తో పద్మ పెళ్ళి జరిగేలా చూసింది. వర్ధన్ వాళ్ళింట్లో ఒక్కడే కొడుకు; మంచి ఆస్తిపరులు కూడా! నసపెట్టని అత్తమామలు, వేదని అపురూపంగా చూసుకునేవారు. ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట.
కానీ పద్మ భర్త వేంకట్ కి ముగ్గురు అక్కలు. అత్తగారు లేకపోయినా అతను ఇంటి ఆడబడుచులకి విలువనిచ్చేవాడు. అందువల్ల, పురుళ్ళకనీ, పుణ్యాలకనీ వాళ్ళ కుటుంబాల రాకపోకలుండేవి. పైగా అంత ఆస్తిపరులు కారు. అందుచేత బ్రతుకు బండిని ఈడవడం కష్టంగా వుండేది. వేదకు అవినాష్, అనూహ్య పిల్లలు. మగబిడ్డను కన్నందుకు వేదకి అత్తమామలు గచ్చిబౌలిలో ఎనిమిదొందల గజాల స్థలం బహుమతిగా ఇచ్చారు. ఎలాగూ బాధ్యతలు తప్పవు కనుక ఉద్యోగం మానుకున్న పద్మ, అనూహ్య వయసుదైన అలేఖ్యతో సరిపెట్టుకుంది. తమ ఆర్ధిక స్థోమతు ఎక్కువని, రెండు కుటుంబాలకీ వారసుడు తనకే పుట్టాడని గర్వపడే వేద, తన స్నేహితులతోనూ, అత్తింటి చుట్టాలతోనూ గొప్ప చెప్పుకుని మురిసిపోతూ వుండేది.
***