"అమ్మా, ఈ లిటిక్కాయని
నేను తింటున్నాను", అంది ఏడేళ్ళ ధృతి, సంధ్యాదీపం పెడుతున్న వాళ్ళమ్మ లావణ్యతో. దీపం పెట్టాక, తులసమ్మ కోసమని ఓ వెలిగించిన అగరువత్తుని
తీసుకెళ్తున్న లావణ్య, "ఏ లిటిక్కాయ? మన ఇంట్లో అంత
చిన్న కాయలు లేవే?" అని గొణుక్కుంటూ తులసి
కోట కేసి నడవసాగింది. "ఇదిగో!" అని ఓ అరగంట ముందు గుడిలో అర్చన
చేసినప్పుడు ఇచ్చిన అరటిపండును చూబిస్తూ దారికడ్డం పడింది ధృతి. "కొంచెంలో
చెయ్యి కాలి ఉండేది. ఏమిటీ వేషాలు?" అని కూతుర్ని
కోప్పడి, ఆ పండును చూసి, "ఇది దేవుడిచ్చిన
పండు. దాన్ని లిటిక్కాయ అనకూడదు. అందరితోనూ పంచుకోవాలి, అంటే పైడమ్మతో
సహా," అని నీతి ఉపదేశించింది లావణ్య.
తులసి ప్రార్థన
చేసినంతసేపూ మౌనం వహించిన ధృతి, "అమ్మా, మనం పెద్ద అరటి
పండు ఇస్తే దేవుడు ఇంత చిన్న పండు ఇచ్చాడు. ఎందుకమ్మా?" అని అడిగింది. "నీకు ఆకలేస్తే
మనింట్లో ఉండే పెద్ద పండు తిను. దేవుడితో లెక్కలు వెయ్యకూడదు. మనకన్నా ఎక్కువ
అవసరమున్న మనుషులకి ఆయన ఆ పండుని అందజేస్తాడు. సరేనా?"
***
అది మండు వేసవి
స్వాతి చినుకులని స్వాగతించే కాలం. ఆ రోజు ధృతి
ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఇంట్లో సాయంత్రం ఆరున్నరకి తోటి వయసు పిల్లలతో
చిన్న పార్టీ ఉంది. ఈ లోగా ఆమెను గుడికి తీసుకెళ్ళి రావాలి. వాళ్ళ నాన్నకు సెలవు దొరకలేదు (ఎప్పటిలాగానే!).
అయిదింటి వరకూ గుడి తెరవరు. ఈ లోగా ధృతి, తను ఒకే
కాంప్లెక్స్ లో ఉండే నాలుగైదు దేవుళ్ళను దర్శించుకొని రావాలి. పావుతక్కువ అయిదుకి
తల్లీకూతుళ్ళు ఇద్దరూ రెడీ అయిపోయారు. స్కూటీ తీయబోయిన లావణ్య ఆకాశాన్ని చూసి
వెనుకంజ వేసింది. కారుమబ్బులు కూడా వర్షించడానికి రెడీగా వున్నాయి. ఆటో స్టాండ్
వైపు నడిచిన వాళ్ళకి ఒక్క ఆటో కూడా కనిపించలేదు. పిల్లల్ని ట్యూషన్లకి తీసుకెళ్ళే
టైం కదా మరి!
ఇంతలో దూరంగా ఓ
ఆటో పోతుంటే తల్లీకూతుళ్ళు గట్టిగా కేక వేసి, చప్పట్లు చరిచి
పిలిచారు. "బాబూ, శివాలయం కాంప్లెక్స్ కి వెళ్ళాలి, వస్తావా?" అని హడావుడిగా
అడిగింది లావణ్య. అప్పటికే తుంపర మొదలయ్యింది. "డ్రాపింగా రిటర్నా?"అని తీరికగా
అడిగాడు డ్రైవర్. "రిటర్నే లేవయ్యా! త్వరగా చెప్పు… ఎంత కావాలి. అవతల వాన పడుతోంది". తన వద్ద
ఉన్న ఇంద్రధనుస్సు రంగుల గొడుగు పట్టింది ధృతికి.
"వాన పడుతుంటే మాత్రం ఏటి? ఈ రోజు పాప పుట్టినరోజులా వుంది అంతేనామ్మా? నాకు ఈ వయసు మనుమరాలు విజయవాడలో ఉంది. అందుకని, మీరు మామూలుగా ఎంతైతే అంతే ఇవ్వండి". ఆటో
ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ని పరీక్షగా చూసింది లావణ్య. ముగ్గుబుట్టలాంటి తెల్లటి
జుట్టు, తెల్లని గడ్డమూను. ఓ అరవై ఏళ్ళు ఉండచ్చు. అంటే
వాళ్ళ నాన్న వయసే. ఏదో గడవక ఈ వయసులో ఆటో వేస్తున్నాడేమో! ఓ పది రూపాయలెక్కువ
ఇచ్చేస్తే పోతుందిలే, అనుకుంది.
"యాపీ బర్త్ డే పాపా", అన్న డ్రైవర్ మాటలకి
ఉలికిపడి, స్కూటీలో ప్రయాణం మానుకున్నప్పుడు డిక్కీలో
పరాకుగా వదిలేసిన టాఫీ కవర్ గుర్తు తెచ్చుకుంది లావణ్య. గుళ్ళో పూజ కోసం మామిడిపళ్ళు
మాత్రం గుర్తుగా తెచ్చుకుంది! "థాంక్ యూ
తాతయ్యా", అంది ధృతి సంతోషంగా. "సారీ బాబూ, టాఫీలున్న కవరు ఇంట్లో మరచిపోయాను. ఇంటికి
తిరిగి వచ్చాక చాక్లెట్లు ఇస్తాను, ఏమీ
అనుకోకు", అంది లావణ్య బాధగా. "అమ్మా, మీరు సదువుకున్నోరు. అట్టా మాబోటోల్లకి సారీలు, అవీ సెప్పకూడదమ్మా! పాప పుట్టినరోజున సంతోషంగా
ఉండాలిగా?" అన్నాడు డ్రైవర్.
డ్రైవర్ ధృతితో, "పాపా, నీకు తెలుగులో
పద్యాలు వచ్చా?" అని అడిగి, ఆమె చేత
"చేతవెన్నముద్ద" చెప్పించుకున్నాడు. "అమ్మగారూ, ఏదైనా పద్యాల షో
టీవీలో వస్తుంటే పాపని పంపండి. ఫస్టు ప్రైజు పాపకే!" అని ఏవో మాటలతో
కాలక్షేపం చేసి గుడికి తీసుకెళ్ళాడు. అప్పటికి వాన కాస్త జోరందుకుంది. ముందుగా, వినాయకుడి గుళ్ళో ధృతి
పేరిట అర్చన జరిగింది. దేవుడికి సమర్పించిన మామిడి పండు ప్రసాదమై
తిరిగొచ్చింది. శివపార్వతుల
గుడిలోని పూజారి వానలో ఇరుక్కున్నారట. ఈ లోగా రామాలయంలో గోత్రనామాలతో పూజ అయ్యి, పండు ప్రసాదం
చేతికి వచ్చింది. ఈ రెండు పళ్ళను వేరే బాగ్లో, అంటే పసుపు రంగు
బాగ్లో పెట్టింది లావణ్య. నవ గ్రహాలు, సాయి బాబా, కుమారస్వామి, అయ్యప్పస్వామి , శివ పార్వతుల
దేవాలయాల్లో పూజార్లు ఇంకా రాలేదు. వర్షం ఉధృతమయ్యింది. తను ఇంటికి వెళ్ళేలోగా
పురోహితులు రారని నిధ్ధారించుకున్నాక, దేవుడి విభూతి, కుంకుమ
తీసుకెళ్ళేందుకు అక్కడ ఉంచబడిన కాగితాల
మీద పిల్ల పేరు, గోత్రం, నక్షత్రం వ్రాసి పెట్టి ఆ
కాగితం కింద దక్షిణగా పది రూపాయలు పెట్టి, వాటి మీద తను
తెచ్చిన మామిడిపళ్ళు పెట్టి, ఇంటికి
వెనుదిరిగింది లావణ్య. ధృతి రెండు పళ్ళున్న పసుపు రంగు సంచీలోనికి చూసి, దేవుడిచ్చిన
రెండు పళ్ళలో ఒకటి ఆటో తాతకి ఇవ్వాలని అనుకుంది. గుడి మెట్లు దిగేసరికి వన తగ్గినా, గచ్చు జారుడుగా
వుంది.
"జాగ్రత్తగా నడు.... కింద చూసుకుని .....” అని ధృతిని చేయి పట్టి నడిపిస్తున్న లావణ్యని, "అమ్మా, బాగున్నారా?" అని ఎవరో పలుకరించారు. "ఓ లక్ష్మి గారూ , మీరా? ఒక్క క్షణం.... పాపని ఆటోలో కూర్చోబెట్టి మాటలాడుతాను.
రండి", అని పలుకరించి, ఆటోలో ధృతిని
కూర్చోబెట్టి, దాన్ని ఆనుకుని
లక్ష్మితో మాటలాడసాగింది. "అరెరే, మీ పాప కూడా
వచ్చిందా? మా ధృతితో ఆటోలో కూర్చోమని చెప్పండి
......." . ధృతి పుట్టిన కొత్తలో చాలా నీరసంగా వుండేది లావణ్య. అప్పుడు ఓ
రెండేళ్ళు లక్ష్మి ఇంట్లో వంట చేసేది. ఈ లోగా లావణ్యకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
లక్ష్మి కూతురికి ఓ పదేళ్ళుంటాయి; అంటే ధృతి ఈడే!
ఎలాగూ తను టాఫీలు తేలేదు. ఈ పాప పుట్టినప్పుడు చేదోడు- వాదోడుగా ఉన్న ఆవిడ
కూతురుకి ఓ ప్రసాదం పండిస్తే బాగుంటుందనిపించింది లావణ్యకి.
ఆలోచన రావడమే
ఆలస్యం అన్నట్టు, "ధృతీ, ఎల్లో బాగ్లో
ఉన్న ఒక పండుని అక్కకి ఇయ్యి అమ్మా!" అంది.
"ఇది దేవుడిచ్చిన
పండు కదమ్మా!" "అయిష్టం ధ్వనించింది ధృతి స్వరంలో.
"అందుకే ఇమ్మన్నాను", అని గట్టిగా
చెప్పింది లావణ్య.
ఏమనుకుందో ఏమో, లక్ష్మి కూతురు
వల్లికి ధృతి ఒక పండుని నవ్వుతూనే ఇచ్చింది. "దసరా, దీపావళి పిండివంటలు ఇంటికొచ్చి చేస్తే
సంతోషిస్తా", అంటూ లక్ష్మి
చేతిలో ఓ వంద రూపాయలు పెట్టి, స్వీట్లు కొనుక్కోమని ఆటో
ఎక్కింది లావణ్య.
ఇంటికి
వచ్చేసరికి ఆరు గంటలయ్యింది. "ధృతీ, స్కూటీలో టాఫీలున్నాయి, పట్టుకొచ్చి ఓ
పది ఆటో తాతయ్యకివ్వు. క్విక్! దేవుడిచ్చిన రెండో పండు టేబుల్ మీద పెట్టు, దాన్ని కోసి మీ ఫ్రెండ్స్ అందరికీ పంచాలి", అని అర్డరేసింది
లావణ్య.
ధృతి కదలకుండా తన
కోరిక వెళ్ళబుచ్చింది. అవాక్కయ్యింది లావణ్య. "పోనీ, ఇంకొక పండిద్దాం.
మీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది కదా, అందుకు అందరికీ దేవుడి
పండుని పంచుదాం!"
"ప్లీజ్, అమ్మా, వాన పడుతున్నా ఈ
తాతయ్య ఎక్కువ అడగలేదు. పైగా, తనకు వచ్చిన ఇంగ్లీష్ లో
నన్ను విష్ చేశాడు కూడా! మొన్నీమధ్యనే తోటపని చేసే సింహాచలం తాతను చూసి, 'ఈ వయసులో
పనిచేస్తున్నాడంటే పాపం చాలా కష్టాలు ఉండి ఉంటాయి', అని అతనికి మాట్లడుకున్నదానికంటే ఎక్కువ
ఇచ్చావు కదా! మా ఫ్రెండ్స్ అందరూ మామిడిపళ్ళు కొనుక్కోగలరు. అందుకే ఈ తాతకి ఇయ్యి
అమ్మా! ప్లీజ్, ప్లీజ్", అని బ్రతిమాలిన
తన కూతురు ఔన్నత్యానికి సంతోషించి, లావణ్య బయటకు
వెళ్ళి, తన కూతురు చేతుల మీదుగా ఆటో చార్జీలు, టాఫీలు, స్వీట్లు, దేవుడిచ్చిన
మామిడిపండు, ఆటో డ్రైవర్ కి ఇప్పించింది .
***
No comments:
Post a Comment