అనగనగా ఓ మధ్యతరగతి కుటుంబం, ఇద్దరే ఆడపిల్లలు. చిన్నప్పటి నుండీ పెద్దమ్మాయి వేదవతిది పోటీ తత్త్వం. తనకు కొన్నలాంటి బట్టలే చెల్లెలికి కొనాలని పట్టుబట్టేది (అంటే, అది తన ఎంపిక అని; పైగా,
ఎవరైనా మెచ్చుకోకపోతే ఎంచక్కా తన చెల్లి మీదకి నెట్టెయ్యచ్చు). తనకి కాలేజీ లెక్చరర్ వర్ధన్ తో పెళ్ళి అయ్యింది కనుక తన చెల్లెలైన పద్మావతికి కంపెనీ మేనేజర్ సంబంధాలు చూడకుండా అడ్డుపడి, మరో కాలేజీ లెక్చరర్ తో పద్మ పెళ్ళి జరిగేలా చూసింది. వర్ధన్ వాళ్ళింట్లో ఒక్కడే కొడుకు; మంచి ఆస్తిపరులు కూడా! నసపెట్టని అత్తమామలు, వేదని అపురూపంగా చూసుకునేవారు. ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట.
కానీ పద్మ భర్త వేంకట్ కి ముగ్గురు అక్కలు. అత్తగారు లేకపోయినా అతను ఇంటి ఆడబడుచులకి విలువనిచ్చేవాడు. అందువల్ల, పురుళ్ళకనీ, పుణ్యాలకనీ వాళ్ళ కుటుంబాల రాకపోకలుండేవి. పైగా అంత ఆస్తిపరులు కారు. అందుచేత బ్రతుకు బండిని ఈడవడం కష్టంగా వుండేది. వేదకు అవినాష్, అనూహ్య పిల్లలు. మగబిడ్డను కన్నందుకు వేదకి అత్తమామలు గచ్చిబౌలిలో ఎనిమిదొందల గజాల స్థలం బహుమతిగా ఇచ్చారు. ఎలాగూ బాధ్యతలు తప్పవు కనుక ఉద్యోగం మానుకున్న పద్మ, అనూహ్య వయసుదైన అలేఖ్యతో సరిపెట్టుకుంది. తమ ఆర్ధిక స్థోమతు ఎక్కువని, రెండు కుటుంబాలకీ వారసుడు తనకే పుట్టాడని గర్వపడే వేద, తన స్నేహితులతోనూ, అత్తింటి చుట్టాలతోనూ గొప్ప చెప్పుకుని మురిసిపోతూ వుండేది.
***
వాచీ చూసుకుని డ్యూటీ టైం అయిపోయిందని, రిలీవర్ వచ్చారని రూఢి చేసుకున్నాక బయలుదేరడానికి బాగ్ తీసుకుంది అలేఖ్య. బయటకి వస్తుంటే సైరన్ తో అంబులెన్సు అప్పుడే వచ్చి పోర్టికోలో ఆగింది. హైవేకి దగ్గరగా వుండే ఆసుపత్రి కనుక ఆక్సిడెంట్ కేసులు అక్కడ కొత్తేమీ కాదు. అయినా, డ్యూటీ అయిపోయిందని పట్టనట్టు తన దారిన వెళ్ళిపోయే డాక్టర్ కాదామె. వెంటనే అటు వెళ్ళింది. ఆక్సిడెంట్లో గాయపడిన ఇద్దరు మనుషుల్లో ఒకరు అంబులెన్స్ వెళ్ళేసరికే పోయారని డ్రైవర్ చెపుతున్నాడు. వార్డ్ బాయ్స్ వచ్చి స్ట్రెచర్లో వాళ్ళని తరలిస్తున్నప్పుడు చూసి నివ్వెరపోయింది డా॥
అలేఖ్య.
***
"అమ్మా, టిఫిన్ చేసి బీపీమాత్ర, విటమిన్ టాబ్లెట్ వేసుకున్నావా?"
"వేసుకున్నానుకానీ, నీకేమైనా ఎమర్జెన్సీ ఉందా?అప్పుడే కదా నీకు నా టిఫిను మీద, మాత్రల మీద ఇంత ప్రేమ?" ఛలోక్తి
విసిరింది పద్మావతి. విషయం చెప్పింది అలేఖ్య. ఏడుపు లంకించుకున్న తల్లితో, "నువ్వు ఇంతల్లా డీలా పడిపోతే ఎలాగమ్మా?
పెద్దమ్మకి
నువ్వేగా ధైర్యం చెప్పాలి? నువ్వూ, నాన్నా కాబ్లో వాళ్ళింటికి బయలుదేరి, తనతో పాటు ఇక్కడకు రండి. ఈ లోగా, ఇక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను."
***
పద్మ, వేంకట్ వేదతో కలిసి అసుపత్రి చేరేసరికి ఓ పదకొండు గంటలు అయ్యాయి. అవతల హైదరాబాద్ ఎండ తీక్షణంగా ఉంది. ఇవతల పెద్దవాళ్ళ కళ్ళలో ఎడతెరిపి లేని వాన కురిసింది.
అలేఖ్య
ముందు పెద్దమ్మని ఓదార్చి మార్చురీకి దారి తీసింది. అక్కడ ప్రశాంతంగా, శాశ్వతంగా నిద్రపోతున్న అనూహ్య కనిపించింది. స్ఫురద్రూపం, ప్రశాంతం కానవచ్చాయి ఆమెలో. కన్న కూతురు తనకన్నా ముందే వెళ్ళిపోతే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు? వేదని అదుపు చెయ్యడం వీళ్ళ ముగ్గురికీ కష్టమయ్యింది. అలేఖ్య సంజ్ఞ చేస్తే వేంకట్ మిగిలిన వారిని వర్ధన్ ఉన్న ఐసీయూకి తీసుకెళ్ళాడు. తనను లోపలికి విడువనందుకు అక్కడి వారితో ఏడుపుతో కూడిన వాదన పెట్టుకుంది వేద. సంతకాలు అయ్యాక, పెద్దలు
ముగ్గురూ కాబ్ ఎక్కారు; వర్ధన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచనలిచ్చి అలేఖ్య, తను ముందుగానే కుదిర్చిన మార్చురీ వాన్ ఎక్కింది, జీవం కోల్పోయిన తన ప్రియమైన చెల్లితో. ‘జీవితం ఎంత వింతైనదో కదా! ఏ నిముషంలో
ఎవరిని ఎటు పంపుతుందో కదా!’ అని నిర్లిప్తంగా ఆలోచిస్తూ నిశ్చలంగా ఉన్న అనుహ్యను చూసింది. తను
ఓ అందమైన అమ్మాయి మాత్రమే కాదు, మంచి మనసున్న పిల్ల కూడా. ఇరవై ఎనిమిదికే నిండు నూరెళ్ళంటే ..... రకరకాల జ్ఞాపకాలు ఆమె మనసులో మెదలసాగాయి. ...
***
వాళ్ళకి ఓ ఆరేళ్ళున్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కలుసుకున్నప్పుడు......
"అనూ, నువ్వు బలే ముద్దుగా ఉన్నావ్. నీ
పట్టు లంగా చాలా బాగుంది!" అంటూ మెచ్చుకోలుగా పరికిణీని తడిమింది అలేఖ్య. "నువ్వు తీసుకో ...మా అమ్మతో చెప్పి నీకిస్తానులే".... "దీన్ని మైసూరు సిల్క్ అంటారు. నువ్వు కట్టుకునే కంచి పట్టు కంటే చాలా ఖరీదు. ఆ అంచు బంగరపుది. బాగుండక ఏం చేస్తుంది?" అని పిల్లల మాటలకి ఎటువంటి సంబంధమూ లేకుండా గొప్ప చెప్పి లోనికి వెళ్ళింది వేద.
***
"కంగ్రాట్స్ అలేఖ్యా! నీ పేరుకి అర్థం ఏదైనా ఈ వ్యాస రచన, అంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్టు
ప్రైజ్ రావడం చాలా సంతోషం సుమా! ఇంతకీ ఈ ఏడాది నీకు ఎన్ని ప్రైజులొచ్చాయి? ..... ఐదా! బాగుంది.....ఓ...ఇవి తెలుగు వ్యాసరచనలో మాత్రమేనా? అయితే ఇంగ్లీష్ లో ఎన్ని వచ్చాయో?.................ఆహాఁ, బాగుందే అమ్మాయీ, నా ఇద్దరు కూతుళ్ళూ రతనాల రాసులు!" మెచ్చుకోలుగా ఫోన్ పెట్టేసింది వేదవతి. అడిగిన తీరునుబట్టి వేద, అనూహ్యకి వచ్చిన ప్రైజుల లెక్క వేస్తుందని పసిగట్టారు పద్మ, అలేఖ్య. "పిల్లలం మాకు లేని పోటీ పెద్దమ్మకెందుకమ్మా", అని అలేఖ్య అడిగితే సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న పద్మ,”దాని మనసులో ఉండే పోటీ వల్ల మీకేమీ నష్టం రాదుకదా, వదిలెయ్యి", అని నచ్చచెప్పింది.
***
ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లలు కలిస్తే అన్నయ్యని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరూ తెగ కబుర్లాడేవారు. రాత్రిపూట కూడా గుసగుసలే. ఎవరైనా కోపడితే,"వీళ్ళకి పాము చెవులు, మనకు బ్రహ్మ చెవుడు" అని ఛలోక్తులు వేసేది అను.
***
అన్నట్టు అన్నయ్యకీ విషయం చెప్పాలి అనుకుంటూ వాచీ చూస్తే అమెరికాలో తెల్లవారు మూడవుతుంది. అయినా సరే, కష్టంతో కన్నీళ్ళాపుకుని విషయం చెప్పింది. ఇల్లు చేరే లోగా, అతను మరుసటి రాత్రికి వస్తున్నట్టు వర్తమానం వచ్చింది.
"అనూహ్య అంటే అనూహ్యమైన ఉన్నతిని పొందుతుందనుకుని ఈ పేరు పెట్టాముగానీ ఇలా అనూహ్యమైన రీతిలో మేము బతికుండగానే వెళ్ళిపోతుందని కాదు. అది పని చేసే కాలేజీలో ప్రతీ ఏడు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వుంటే గర్వించాను. పిన్న వయసులోనే నూరేళ్ళ ముచ్చట్లూ తీర్చేసింది ఒక్క పెళ్లి తప్ప. ఆ విషయంలో అను, ఆలే తోడుదొంగలు! ఇప్పుడు
ఇది పోయిందని ఏడవనా, లేక ఆయన ఐసీయూ లో ఎలా ఉన్నారో అని బాధపడనా .."అని ఒకదానికి మరోదానికీ సంబంధం లేకుండా గొణుక్కుంటోంది వేద, పద్మ ఒడిలో తలపెట్టుకుని. పద్మకి ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి....
***
"అలేఖ్య కి ఐసిఎస్సీలో తొంభై రెండు శాతం మార్కులు వచ్చాయా? ఇదేమిటీ, మార్కులు తగ్గాయి? ఓ మీ స్టేటుకి ఇదే ఫస్టు మార్కా?
అలాగా! బాగుంది బాగుంది! మన అనూకి సిబీఎస్సీలో తొంభై ఏడు శాతం మార్కులు వస్తేను…. ఇంతకీ ఇంటర్లో ఎంపీసీ సీటు వస్తుందా? ఓహో... బైపీసీలో చేరుతుందా? ఎంపీసీ
లో కళ్ళకద్దుకుని సీటు వస్తుంది అనూకి... అలేఖ్యకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవే!" అంటూ ఇసుమంత దర్పంతో ఫోను పెట్టింది వేద. ఆమె ఇంజనీరింగ్, ఎంబీయే, పీహెచ్. డీ చదివేటప్పుడుకూడా ఇదే వరస. అవినాష్ కి పోటీ
ఎవరూ లేరు గనుక వాడు అమెరికా వెళ్ళినా చీమైనా కుట్టలేదు వేదను.
***
పద్మ వాళ్ళకి ఆస్తి కలిసొచ్చి నల్లకుంటలో ఓ రెండు బెడ్రూముల ఫ్లాట్ కొన్నారు. కొన్నాళ్ళ తర్వాత వేద వాళ్ళింటి గృహప్రవేశం అయ్యింది. అప్పుడామె పద్మతో,"జాగ్రత్తగా చూసుకోవే. మూడు బెడ్రూములు, డుప్లెక్స్ ఇల్లు….. స్థలం అవిగాడు పుట్టినప్పుడు నాకు సంక్రమించింది, గుర్తుందా? గ్లామర్రూం ఫిట్టింగులు ...నా నగలన్నీ తాకట్టు పెట్టాను తెలుసా"..... అని బాకా ఊదేసింది. పద్మ
జాలిపడింది.
***
ఇల్లు చేరేసరికి అప్పటికే చుట్టుపక్కలవాళ్ళు, అనూహ్య కాలేజీ వాళ్ళు, ఇప్పటి విద్యార్థులు, ఇదివరకటి వాళ్ళు- చాలామందే చేరారు. స్టూడెంట్స్ అందరూ ఆమె వాళ్ళకు జ్ఞానాన్ని పంచి జీవితాలని ఎలా మార్చేసిందో చెపుతుంటే,"వీళ్ళకోసం అయినా అనూహ్య బతికి వుంటే బావుణ్ణు", అనుకుంది వేద. మేడంగారి తండ్రి ఐసీయూ లో ఉంటే
కనిపెట్టుకుని ఉండేందుకు కొందరు విద్యార్థులు చొరవ చూపి అటు వెళ్ళారు.
మరుసటి రోజుకి అంతిమ యాత్రను గురించిన మాటలు వినబడ్డాయి. ఈమె పెళ్ళి కానిది కనుక అనాథ ప్రేత అట! కర్మ ఎవరు చేసినా సరిపోతుందిట! తండ్రి చేస్తే మంచిదే కాని ఆయనకి ఈ విషయం
తెలియనివ్వకుండా అందరూ జాగ్రత్త పడుతున్నారే! తల్లిదండ్రులు బ్రతికి వున్నారుగనుక అవినాష్ ఎలాగూ పనికిరాడు. అక్కడే ఉన్న వేంకట్,"నా కూతురు లాంటి పిల్లని అనాథ ప్రేత అంటే తట్టుకోలేను వదిన గారూ! మీకు అభ్యంతరం లేకపోతే .... ", అని ప్రస్తావించాడు.
వేదవతి నిర్విణ్ణురాలై వెక్కి వెక్కి ఏడవ సాగింది. పక్కనే పద్మ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. "నీ కూతురు వయసు పిల్లకి కర్మ చేస్తానంటే మీ ఆయన్ని ఎందుకు వారించవు?" అని పద్మని గద్దించి, వేంకట్ దగ్గరకు వెళ్ళి, కాళ్ళ మీద పడి, "నేనెప్పుడూ నన్ను పొగుడుకుని మిమ్మల్ని అందరినీ చిన్న చూపు చూశాను. అంతెందుకు, ఇలాంటి పరిస్థితిలో మేముండి వుంటే నేను మా ఆయనకు అడ్డు
చెప్పేదాన్ని. అయినా మీ మంచితనంతో, పెద్ద మనసుతో నా కూతుర్ని పై లోకాలకి పంపిస్తున్నారు. నా పొగరు అణచడానికి దేవుడు దాన్ని నా నుంచి దూరం చేశాడు. దాని మంచితనం, అదృష్టం వల్ల మీ వంటి ఉత్తముడి చేతుల మీదుగా స్వర్గానికి ఎగుస్తోంది. ఈ నమస్కారం మీ ఆయుఃక్షీణానికి కాదు. మీలో ఉండే గొప్ప మనీషికి నా చిన్న మనసు చేసే వందనం", అని కన్నీటితో తన గర్వాన్ని కడిగేసుకుంది వేద.
***
No comments:
Post a Comment