Friday, March 4, 2016

నడమంత్రపు సిరి


పన్నీరు చల్లడానికి రెడీగా ఉన్నట్టుంది ఆ మధ్యాహ్నపు ఆకాశం. వరలక్ష్మీ వ్రతం రోజు శ్రావణ మేఘాలు వర్షిస్తే అమ్మవారి ఆశీస్సులు అందుతాయని కొందరు నమ్ముతారు. వాళ్ళలో విశాఖపట్నంలో ఒక మూడు వాటాల ఇంట్లో ఉండే ముగ్గురు మధ్య తరగతి స్త్రీలు ఉన్నారు. మొదట వాళ్ళందరిలోనూ చిన్నదైన సవిత పెరట్లోకి వెళ్ళింది, బట్టలు తీయడానికి. రెండు గంటల సమయంలో పనిమనిషి ఉండదుగా! తరువాత వచ్చిన వనిత, బట్టలు తీస్తూనే, “ఏం, సవితా! పూజంతా చక్కగా అయినట్టేనా? ఎన్ని ఐటమ్స్ నైవేద్యం పెట్టావేమిటి?” అని అడిగింది. “ అబ్బే, మూడే వనిత వదినా!” అని సవిత జవాబిచ్చింది. “ఏమిటీ, మీరు వచ్చే ఏడాదికి ముచ్చటగా ముగ్గురవాలనా?” అని వనిత అడిగితే, “అంతకన్నా వేరే భాగ్యముందా?” అంది సవిత. ఆ మాటలతోటే ఆలోచనలో పడింది. ఇప్పటికి తనకి రెండు సార్లు గర్భం నిలువలేదు. తన భర్త సారంగ్ మెకానికల్ ఇంజినీర్. అది ఆర్ధికమాంద్య కాలం కనుక అతను పనిచేసే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులందరికీ జీతాలు తగ్గించబడ్డాయి.  వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఎదుగూ- బొదుగూ లేని జీవితం అంటే విసిగిపోయి, వాళ్ళు ఒక జాతకబ్రహ్మని ఆశ్రయించారు. ఆయన వాళ్ళ ఇద్దరి జాతకాలూ చూసి, వచ్చే అమావస్యకి సవిత నక్షత్రానికి పట్టే సూర్య గ్రహణం తరువాత వాళ్ళ చీకటి జీవితంలో వెలుగులు చోటు చేసుకుంటాయని జోస్యం చెప్పాడు. ఆ మంచి రోజులకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు.


“ఏమిటర్రా అమ్మాయిలూ, ఇంత నాజూకుగా బట్టలు తీస్తున్నారు? అవతల మొత్తేసేటట్టుంది. బట్టలు తీసి త్వరగా వరండాలోకి నడవండి”, అన్న మొదటి వాటా లక్ష్మి మాటలకి ఉలిక్కిపడి, సవిత చెంగు చెంగున పరుగెత్తి వరండా చేరుకుని, అక్కడ ఉన్న టేబుల్ పైన బట్టలు పెట్టి, “ఆంటీ, మీరుండండి. నేను బట్టలు తీస్తాను”, అని చొరవగా వాళ్ళ బట్టలూ తీసి వాళ్ళింట్లో పెట్టి, ఆ రోజు సాయంత్రం పేరంటానికి రమ్మని బొట్టు పెట్టకుండానే ఆహ్వానించింది. అలాగే వాళ్ళింటి వెళ్తూ, రెండవ వాటాలో ఉండే వనితను కూడా పిలిచి తన ఇంటికి తను వెళ్ళింది.
సాయంత్రం పేరంటంలో, “ఆంటీ, మీకు చారుమతిలాంటి ఇద్దరు కోడళ్ళు కావాలని కోరుకున్నారా?” అని సరదాగా ఆటపట్టించింది వనిత. లక్ష్మి భర్త కోటేశ్వరరావు టెలిఫోన్ డిపార్టుమెంటులో ఉద్యోగి.  వాళ్ళకి ఇద్దరబ్బాయిలు. పెద్దవాడు పూనాలో ఓ ఫాక్టరీలో డిజైన్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. రెండవ పిల్లాడు, వరంగల్ ఇంజినీరింగ్ కాలేజిలో చదువుతున్నాడు. యుక్త వయసులో అత్తమామలకు సేవలు చేసిన లక్ష్మి, తనకు సేవలు చేసే కోడళ్ళు కావాలనుకోవడంలో తప్పులేదనుకుంది. “అంతకన్నానా?” అని, “వనితా, నువ్వు మాత్రం మీ ఆయన త్వరలోనే స్వఛ్చంద పదవీవిరమణ చేసి ఇక్కడికి వచ్చెయ్యాలని కోరుకోలేదూ?” అని ఆమెను ఎదురు ప్రశ్నించింది. వనిత నవ్వి తన పరిస్థితి నెమరు వేసుకుంది. ఆమె భర్త ఉత్తమ్ భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో కట్టడాలని పరిశీలించే ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. పిల్లాడు తొమ్మిదో తరగతికొచ్చాడు కనుక ఎంసెట్ ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నానికి తనూ, కొడుకు ఆనంద్ కాపురం మార్చి ఏడాది అయ్యింది. ఆమె వాళ్ళింటికి దగ్గరగా వుండే స్కూల్లో సాంఘిక శాస్త్రం చెప్పడానికి కుదిరింది. రేపో, మాపో ఉత్తమ్ ఉద్యోగం మానేసి, బెనిఫిట్స్ తో  వైజాగ్ కి పెట్టె, బేడా పట్టుకు దిగుతాడని ఆశగా ఎదురు చూస్తోంది.
***
కొంత కాలానికి ఉత్తమ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆమోదింపబడి మూటా- ముల్లే సర్దుకుని విశాఖకు వచ్చి వాలాడు. ఇంకా ఒంట్లో ఓపిక వున్నప్పుడు గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక ఏదైనా ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మహేష్ అనే ఒక చిరకాల స్నేహితుడు కనిపించి తన ప్లాన్ చెప్పాడు. ఆయన ఒక కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా పని చేసిన అనుభవంతో బిల్డింగు కాంట్రాక్ట్లు చేసే ఉద్దేశ్యంలో ఉండి పార్ట్నర్ కోసం వెతుకుతున్నాడట. ఉత్తమ్ ఎలాగూ సివిల్ ఇంజినీరే కదా! తన పార్ట్నర్ గా ఉంటాడా, అని ఉత్తమ్ ని అడిగాడు. వెంటనే ఒప్పేసుకోకుండా మహేష్ ని తన పని గురించి అడిగాడు. అతడిచ్చిన జవాబులకి సంతృప్తి చెంది వనితతో ఓ మాట చెప్పి వస్తానన్నాడు. త్వరలోనే మహేషోత్తం అసోసియేట్స్ అనే బిల్డర్ల కంపెనీ ఒకటి ఏర్పాటయింది!
సారంగ్ కి లెక్కలపై తనకున్న పరిపక్వతని ఉపయోగించుకుంటే కలిసొస్తుందన్నఆలోచన వచ్చింది. వచ్చింది తడువుగా “డేటా అనలెటిక్స్” అనే సాఫ్ట్వేర్ గురించిన జ్ఞానాన్నిసంపాదించి బీఎస్సీ పట్టభద్రులు ఇందులో నిష్ణాతులయ్యేలాగ కొన్ని సిలబస్లు తాయారు చేసి, కాలేజీల బయట కొన్ని వివరాలతో కూడిన కరపత్రాలని (పాంఫ్లెట్లని) పంచి పెట్టాడు. రోజూ సాయంత్రం మాత్రమే తను అద్దెకు తీసుకున్న ఒక చోట తనను కలవవచ్చని, తెల్లవారు ఝామున, సాయంత్రం ఆరున్నర తరువాత క్లాసులు ఉంటాయని వాటిల్లో వ్రాసుకున్నాడు. ఎవరో ఒకరు వచ్చి తనకు బోణీ చేస్తారని ఆశ పడ్డాడు సారంగ్. వారం రోజులపాటు ఆ ఆశ నిరాశగా మిగిలింది. ఎట్టకేలకి ఒక అబ్బాయి చేరడానికి వచ్చాడు. అతనికి బీఎస్సీలో డెబ్బై రెండు శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. ఇంత తక్కువ మార్కులు వచ్చిన అతణ్ణి తీసుకుంటే తనకి ఇప్పుడు డబ్బులు రావచ్చుగానీ, భవిష్యత్తులో తన ఇన్స్టిట్యూట్ నిలదొక్కుకోదు. అలా కాకుండా ఉండాలంటే, ఇక్కడ చదివిన వారు మంచి ఉద్యోగాలు సంపాదించాలి, అని సారంగ్ అనుకున్నాడు. అది జరగాలంటే వచ్చే దరఖాస్తుదారుల విశ్లేషణాశక్తిని పరీక్షించక తప్పదు. ఎక్కడా దొరకని ఒక పరీక్షాపత్రాన్ని తయారు చేసుకుని, దాన్ని ఆ వచ్చిన వాడిపై ప్రయోగించాడు సారంగ్. టాపర్స్ తన ఇన్స్టిట్యూట్ కి రారని గుర్తుంచుకుని, ఓ మోస్తరు మార్కులు వచ్చిన ఆ పిల్లాణ్ణి చేర్చుకుని, ఆరు నెలల్లో ఆ అబ్బాయిని విశ్లేషణలో దిట్టని చేశాడు. అతనికి మంచి ఉద్యోగమే వచ్చింది. ఆ నోటా, ఈ నోటా ఈ విషయం స్టూడెంట్స్ లో తెలిసి, సారంగ్ నడిపే కోర్సులకి గిరాకీ పెరిగింది. తానింకా మరొక్కరికి ఉద్యగమిచ్చే పరిస్థితిలో లేడు కాబట్టి, తనకి దీనివల్ల వచ్చే ఆదాయాన్ని, తనకిప్పుడు వచ్చే జీతాన్ని, జ్యోతిష్కుడు తన భార్య గురించి అన్న మాటని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం మనేయ్యాలనే ఒక పెద్ద రిస్క్ తీసుకోవాలనుకున్నాడు. సవిత కూడా ఒప్పుకుంది. పిల్లా- పీచూ ఉంటే వద్దనేదేమో! ఆ తర్వాత సారంగ్ రోజంతా తన ఇన్స్టిట్యూట్లోనే గడపసాగాడు. క్లాసులు లేని సమయంలో తన కోర్సులకి గిరాకీ పెంచుకునే ప్లాన్లు వేసేవాడు.
***
ఒక సంవత్సరం గడిచింది. ఈ మాటు వనిత వరలక్ష్మీ వ్రతానికి ఒక పొడవాటి బంగారు నెక్లెస్ కొనుక్కుంది. ఒకే కుంపటి, పైగా ఉత్తమ్ రిటైర్మెంట్ డబ్బులు చేతిలో ఆడుతున్నాయి. తండ్రి శిక్షణలో లెక్కలు బాగా అబ్బి, ఎంసెట్ కి చదువులు నూరేసే ఒక చదువుల ఫ్యాక్టరీలో ఇంటర్లో చేరాడు. లక్ష్మి పెద్ద కొడుకు పంపిన డబ్బుతో నవరత్నాలు పొదిగిన దుద్దులు కొనుక్కుంది. సవితకి ఇప్పుడు అయిదో నెల. ఒక గాజుల జత కొనుక్కుంది. ఆ ఏడాది ఆశ్వీయుజ మాసంలో ఉత్తమ్ కుటుంబం, సారంగ్-సవిత వాళ్ళుండే ఇంటికి ఓ అరకిలోమీటర్ దూరంలో కట్టిన “హై-క్లాస్ అపార్ట్మెంట్స్” కి మారిపోయారు. ఇప్పుడు సారంగ్ చదువు చెప్పే ఓ మంచి గురువుగా పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లోర్ అంతా తన అనలెటిక్స్ ఇన్స్టిట్యూట్ కోసం లోన్లో కొనగాలిగాడు. ఇప్పుడతనికి ఆఫీసు పనుల్లో సాయపడే ఒక గుమస్తా, కొత్త కోర్సులు చెప్పేటందుకు మరొక ఉపాధ్యాయుడూ ఉన్నారు. మరో ఫ్లోరంతా తీసుకుని పెద్ద ఇల్లు అమర్చుకున్నాడు. ఇప్పుడతనికి గొప్ప వాళ్ళతో స్నేహం ఏర్పడింది. వాళ్ళలో ఒకరు అమెరికా వెళ్తుంటే, పుట్టబోయే బిడ్డకి ఏడాది పాటు సరిపడా బేబీ సోప్, నూనె, పౌడర్ మొదలైనవి తెప్పించుకున్నాడు.
“హలో ఆంటీ, నేను బాగానే ఉన్నాను...... పనిమనిషి ఇంకా రాలేదు.........మీ ఇంటికి ముందరే వస్తుందిగా...అందుకు ఫోన్ చేశాను... ఆ తింగర మనిషి వస్తే ఇటు పంపండి ప్లీజ్...ఏమిటీ ... వాళ్ళాయన దాన్ని చితకబాదాడా? నాతో చెప్పలేదే అయ్యయ్యో...సరే ...అయితే దీని మీద ఆధారపడకూడదన్నమాట”, అని అవసరమొచ్చినప్పుడల్లా లక్ష్మితో మాటలాడుతుండేది సవిత.
ఇదేమీ కొత్త విషయం కాదు. అయినా, లక్ష్మికి కొంత ఆశ్చర్యమేసింది. ఎప్పుడైనా మంగమ్మ తన భర్త కొట్టాడని చెబితే, “నేను నీకు చదువు చెప్తాను. ఏదైనా ఉద్యోగం చేసుకు బతుకు. ఆ నీచుడికి దూరంగా ఉండు”, అని చెప్పే సవిత ఇప్పుడు తన సౌకర్యం గురించే ఆలోచించడం కొంత తేడాగా అనిపించింది లక్ష్మికి. పాపం, నిండు చూలాలు ఏం చెయ్యగలదని ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది.
***
కొంత కాలానికి పండంటి మగబిడ్డను కన్న సవిత, మంగమ్మ చిన్న కూతురు దుర్గని పిల్లాడి విషయంలో తనకు సాయంగా పెట్టుకుంది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఎంత కాలమని విశాఖపట్నం లో ఉండగలరు? ఒక రోజు రిత్విక్ కి స్నానం చేయిస్తున్నప్పుడు, ఎప్పటిలాగే సబ్బుని కేస్ లో పెట్టమని దుర్గకి అందించింది సవిత. ఆ రోజు మాత్రం దుర్గ చేతిలోనుంచి అది జారి కింద పడింది. సవిత కోపంగా, “జాగ్రత్త, ఇది అమెరికా సబ్బు. మీ అక్క కూతురికి వాడే చినవాల్తేరు, పెదవాల్తేరు సోపు కాదు”, అని అరిచింది. దుర్గ శాంతంగా, “మేం పస్తులుంటామేమో గాని, మా అక్క కూతురికి ఏ లోటూ చేయ్యట్లేదమ్మా! గొప్పోల్లు వాడే జాన్సన్ బేబీ సోప్ లాంటివి వాడతన్నాం; అయినా, ఈ ఇసయం మా అమ్మ మీతో కాన్పు వచ్చే ముందే సేప్పిందంటగా”, అని జవాబిచ్చింది.
***

భోగి పండుగకి  చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి రిత్విక్ కి భోగి పళ్ళు పోసింది సవిత. చంటాడికి డిజైనర్ డ్రెస్సు, దీపాలూ, తోరణాలూ- అబ్బో, చాలా హడావుడి చేసిందామె. వచ్చిన వాళ్లకి శనగలు ఇచ్చింది. పిల్లాడి సంగతి పక్కన పెడితే, పేరంటానికి వచ్చిన వాళ్ళు వేసుకున్న ఆభరణాలు గమనిస్తూ ఉంది. వనిత ముద్ద జరీ అంచుతో కూడిన ఆకుపచ్చని పట్టు చీరలో  ఓ వనదేవతలా దర్శనమిచ్చింది. పచ్చలు పొదిగిన పొడవాటి గొలుసు, దానికి సరైన నాలుగు జతల గాజులు, దుద్దులు- వీటన్నిటితో మెరిసిపోయింది. సవిత ఒకసారి తన కట్టూ- బొట్టూ సమీక్షించుకుంది. మట్టి రంగు పట్టు చీర, ఒక ముత్యాల హారం, రెండు పేటల పగడాలు, ఒక బంగారం గొలుసు, ఒక బంగారం నెక్లేసు- అస్సలు పొంతనే లేదు, అనుకుంది. ఇంటికి తాంబూలంతో తిరిగి వెళ్ళిన లక్ష్మి, శనగలు చాలా తక్కువ ఉండడాన్ని గమనించింది. వరలక్ష్మీ వ్రతానికే బోలెడు శనగలిచ్చే సవిత, పాపల బాగోగులకోసం  చేసే భోగి పండక్కి గుప్పెడంటే గుప్పెడే ఎలా ఇవ్వగలిగింది?
***

మరో వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ఈ లోగా  మహేషోత్తమ్ బిల్డర్లు ధనికులకు సరిపడే కోట్ల కొద్దీ విలువ చేసే అపార్ట్మెంట్లు కట్టి వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వపు నిర్మాణాలలో పాల్గొంటున్నారు కూడా!ఇప్పుడు వనితకి “హై క్లాస్ అపార్ట్మెంట్స్”  చాలా లో క్లాస్ గా అనిపించాయి. వాళ్ళు సీతమ్మధారలో ఒక డుప్లెక్స్ ఇంటికి మారిపోయారు. ఉత్తమ్ స్కోడా కారులో సైటుకి వెళ్ళి వచ్చేవాడు. వనిత టొయోటా అల్టిస్ లో తన పనులు చేసుకునేది. రెండు కార్లకీ ఇద్దరు డ్రైవర్లు. ఆనంద్ తన చదువుతో తన తంటాలు పడుతున్నాడు. వ్రతానికి లక్ష్మిని, సవితని పిలిచింది. కావలిస్తే లక్ష్మిని తీసుకు రావడానికి కారు పంపుతానంది. సవిత సారంగ్ ని అడిగి, వాళ్ళ హోండా సిటీ కార్లో లక్ష్మితో సహా వచ్చింది. ఎరుపు రంగు చీర, ఎర్ర రాళ్ళ దుద్దులు, గాజులు, నెక్లేసుతో సవిత అమ్మవారిలా ఉంది. వనిత పసుపు చీరతోనూ, పొడవాటి కాసుల పేరుతోనూ దర్శనం ఇచ్చింది.  వచ్చిన వాళ్ళకి ఆ నెలలో దొరికే బత్తాయిలే కాకుండా సూపర్ మార్కెట్ లో దొరికే ఆస్ట్రేలియా ఆపిల్ పళ్ళు కూడా తాంబూలమిచ్చింది వనిత. అక్కడకు వచ్చిన వారంతా నగలు, చీరలు, వాటి ఖరీదు గురించి చర్చించుకోవడం చూసి లక్ష్మి ఈ ఏడు అర గ్రాము పిల్ల కాసునే కొందన్న సంగతి ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే, ఇప్పుడు వనిత దగ్గర కోటేశ్వర రావుకి వచ్చిన గుండె జబ్బు గురించి ప్రస్తావిస్తే, ఏమైనా ఆర్థిక సహాయం కావాలని అనుకోగలదు! జీవితంలో అన్నీ డబ్బుతో ముడి పడి ఉండవని వీళ్ళకి తెలియదు, చెప్పినా వినిపించుకుంటారో, లేదో, ఎందుకులెమ్మని ఊరుకుంది లక్ష్మి.
***
ఈ హై క్లాసు వాళ్ళిద్దరూ వాతలు ఖాళీ చేశాక, చిన్న చిన్న వాటాలకి గిరాకీ తగ్గి, ఎవరూ రానందున, ఆ మూడు పోర్షన్ల ఓనరు ఇల్లు అమ్మకానికి పెట్టదలచి కోటేశ్వర రావు దంపతుల్ని ఖాళీ చేయమన్నాడు. ఈ వయసులో, అందులోనూ అనారోగ్య  స్థితిలో ఇల్లు చూసుకోవడమంటే మాటలా? కోటేశ్వర రావు దంపతులు కాస్త సమయం ఇమ్మని
 అడిగారు.  ఇన్నాళ్ళుగా ఉంటున్న మంచి వాళ్ళు కనుక వాళ్ళకో ఆరు నెల్ల సమయం ఇచ్చాడాయన.
***

 ఒక రోజు అలవాటు ప్రకారంగా కోటేశ్వర రావు రాత్రి తొమ్మిది గంటల వార్తలు టీవీలో చూస్తున్నాడు. “విశాఖపట్నంలో నాణ్యత లేని భవనం కూలిపోయి నలుగురు మరణం- రంగంలోకి దిగిన ఏసీబీ, పోలీసులు.....ప్రముఖ బిల్డర్ల అరస్ట్”, అనే కథనంలో ఉత్తమ్, మహేష్ ల బొమ్మలు మళ్ళీ, మళ్ళీ చూబిస్తున్నారు. వాళ్ళు కట్టిన ఇళ్ళలో పర్మిట్లు వగైరా అక్రమ మార్గాల ద్వారా సంపాయించారనీ, భూసార  పరీక్షలు చేయకుండా ఎత్తైన కట్టడాలు నిర్మించారనీ, అది  నేరమని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇది ఓ నలుగు రోజులు సాగింది. ఆ సమయంలో వనితకి లెక్కు చూపలేనన్ని నగలు ఉన్నాయన్న విషయం వెల్లడి అయ్యింది. ఇన్నాళ్ళూ, మనకు స్నేహితులుగా ఉండే వీళ్ళు ఇన్ని అక్రమాలకి పాల్పడ్డారా? అని బాధ పడింది లక్ష్మి. లోకం పోకడ అంతే, అని ఓదార్చాడు కోటేశ్వర రావు.
***
“రేపు పొద్దున్నే సిమ్మాసలం ఎల్లి రావాల. అందుకే ఇయ్యాల రాత్రికే పాచి చేసి, రేపు మద్యాన్నం వచ్చి మిగతా పనులు సేస్తానమ్మగోరూ!” అని బతిమాలింది మంగమ్మ. ఒప్పుకుంది లక్ష్మి. రాత్రి పనికి వస్తూనే,” అమ్మగోరూ, మన సవితమ్మ గారినీ, సారంగయ్యగారినీ పోలీసులు పట్టుకెల్లారంట!” అనే కబురు మోసుకొచ్చింది. ఎందుకో ఏమిటో సరే, మరి రిత్విక్? వెంటనే భర్తను తీసుకు వెళ్ళి పిల్లాణ్ణి ఇంటికి తెచ్చింది. ప్రకటించిన కోర్సులు చెప్పనందున ఎవరో సారంగ్ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టారట. మళ్ళీ టీవీ వాళ్ళకి పండగే పండగ!
***
“ఆంటీ, జరిగినదేదో జరిగిపోయింది. ఉన్న ఆస్తులన్నీ కేసుల్లోంచి బయట పడడానికీ, లాయర్ ఫీసులకీ కర్పూర హారతైపోయాయి. మళ్ళీ ఈ ఇంట్లో మా వాటాలు మాకు అద్దెకివ్వమని ఓనర్ గారితో చెప్పించండి”, రిత్విక్ ని చంకనేసుకుని కన్నీళ్ళతో ప్రాధేయపడింది సవిత. అక్కడే ఉన్న వనిత పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే! వాళ్ళ చేత నడమంత్రపు సిరి చేయించిన ఘాతుకాలను దృష్టిలో పెట్టుకుని ఓనర్ అద్దెకివ్వడానికి ససేమిరా అంటున్నాడు. అయినా, తప్పు తెలుసుకున్నారు కనుక వారికి ఇళ్ళని అద్దెకివ్వమని కోటేశ్వర రావు ఓనర్ని బ్రతిమాలి, కార్య సాధన చేశాడు.
 ***






2 comments:

RAJESH YALLA said...

చాలా బావుంది లక్ష్మీ! ఎక్కడైనా పత్రికలో ప్రచురణ అయ్యాక ఇక్కడ పెట్టవలసింది!!

Mediocre to the Core said...

thank u rajesh...ఇక్కడైతే ఎక్కువ మంది చదువుతారేమో అని....