"మా
డిపార్టుమెంటులో పెద్దాయనతో మాట్లాడానోయ్. నా బదిలీ విషయంలో సాయం చేస్తానన్నారు",
అన్నాడు అనిల్. హరిత సంతోషంగా, "అలాగా, ఆ కనకమ్మ దయవల్ల అదే త్వరలో అయితే మన కష్టాలు
తీరినట్టే, అని అత్తయ్య అంటున్నారు", అంది.
"పిల్లలు
ఇవ్వాళ కూడా పడుక్కున్నారా?"
"పడుక్కోరు
మరి? రాత్రి పదకొండు కావస్తూంటే?"
"సారీ
హరీ, రేపైనా వాళ్ళతో స్కైప్ లో చాట్ చేస్తా, సరేనా?"
"'రేపు'
అని బోర్డు మీద వ్రాసినట్టే వుంది నీ వరస చూస్తుంటే! అత్తయ్య కూడా నీతో మాట్లాడాలని
ఉబలాట పడుతున్నారు".
"సరే,
తప్పకుండా! ఇలా ఫోన్లో కాకుండా నీతో లైవ్ గా గుడ్ నైట్ చెప్పాలనుంది".
"అనిల్,
అమ్మవారికి ప్రార్థించు".
"నాలుగు
రోజులు సెలవు పెట్టి ఇక్కడికి రాకూడదూ?"
"అత్తయ్య
పిల్లల్ని చూసుకోలేక పోతున్నారు. పోనీ మా అమ్మ దగ్గర వదులుదామంటే ఆవిడకి టైఫాయిడ్ వచ్చి
తగ్గిందికదా. ఇప్పటికీ వంటా అవీ నేనే చూసుకుంటున్నాను. నాన్న ఆవిడకి సపర్యలు మాత్రమే
చేయగలుగుతున్నారు! రొటీన్ పనులకే ఇంత కష్టంగా వుంటే నువ్వు అక్కడికి రమ్మంటావేమిటి?
ఇంక హాయిగా నిద్రపో. గుడ్ నైట్".
*****
అనిల్, హరిత ఒకే ఊళ్ళో, ఒకే వీధిలో ఉంటూ,
ఒకే బళ్ళో, ఒకే కళాశాలలో, ఒకే తరగతిలో చదివి ఒకే శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళు
వేరు వేరు కులాలు, రాష్ట్రాలకీ చెందినా కూడా వాళ్ళ పెళ్ళి పెద్దలే నిశ్చయించారు. ఒకే
ఆఫీసులో ఉద్యోగం సంపాయించుకొని, పండంటి ఇద్దరు పిల్లల్ని కని, గోదావరి నదిలో నావ ప్రయాణంలా
హాయిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న సమయంలో, సుడిగుండంలా వచ్చిపడింది అనిల్ బదిలీ.
ప్రధాన కార్యాలయంలో కొత్త అధిష్ఠానం, కొత్త విధానాలని ప్రవేశపెట్టింది. క్షేత్ర ప్రాంతాల్లో
పని చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా కొన్ని సంవత్సరాలపాటు ప్రధాన కార్యాలయంలో పని చెయ్యాలిట.
అలాగని ఇద్దరికీ బదిలీ అవలేదు. అనిల్ అన్నయ్య సునీల్ కొండప్రాంతంలో పాఠశాలలో ఉపాధ్యాయుడు.
అక్కడ వైద్యసదుపాయాలు ఉండవు కనుక అనిల్ తల్లి తనతోనే ఉండేది. హరిత, తల్లిదండ్రులకు
ఒకతే బిడ్డ. కొడుకైనా, కూతురైనా తనే. ఒకే ఇంట్లో ఉంటే అందరికీ సదుపాయంగా ఉన్నా, వియ్యంకులు
అహం భావంతో మెలగుతారేమోనన్న భయంతో ఎవరిళ్ళలో వాళ్ళనే ఉండనిచ్చారు ఈ దంపతులు. అదే వీధిలో
వాళ్ళతో చదువుకుని, వైద్యుడైన సురేష్ ఇల్లు, ఆసుపత్రి ఉన్నాయి. అందుకే, అనిల్ లేకపోయినా
సంసారభారం మోయగలుగుతోంది హరిత.
ఎలాగో చిన్న చిన్న లంఖనాలతో ఓ ఏడు గడిచింది.
కుటుంబంతో మహా అయితే ఓ మూడు వారాలు గడిపివుంటాడు అనిల్; అతని బదిలీ ఇంకా త్రిశంకు స్వర్గంలోనే
ఉంది. వాళ్ళూరికి రాలేదు. ఈ మధ్యనే బాధ్యతలు ఎక్కువై స్కైపులో కూడా ఎంతోసేపు మాట్లాడలేక
పోతున్నాడు, అదీ అందరూ లేచున్నప్పుడు కుదిరితేనే సుమా! దాంతో నిరక్షరాస్యురాలైన తల్లికి
మనో వేదన పట్టుకుంది, తన ఇద్దరు పిల్లలూ తన కళ్ళముందు లేరని. "నేను బతికి వుండగా
చిన్నాడికి ఇక్కడికి బదిలీ అవుతుందా?" అని గడిగడికీ వాపోతూండేది. వేరే ఆలోచనలే
లేనట్టు ఎప్పుడూ ఆ విషయాన్నే ప్రస్తావించేది, అనిల్ మాట్లాడినప్పుడు కూడా. అసలే ఆఫీసు
వత్తిళ్ళతో సతమతమౌతున్న అతడు, ఈ సతాయింపు భరించలేకపోయేవాడు. హరితతో, "అమ్మని సరిగ్గా
చూసుకుంటున్నావా, లేదా? లేకుంటే, మా అమ్మ నా మీద ఇంత బెంగ ఎందుకు పెట్టుకుంటుంది?"
అని విసుక్కునేవాడు. హరిత సర్ది చెప్పబోతే, "నాతో కాకమ్మ కబుర్లు చెప్పకు. ఆవిణ్ణి
జాగ్రత్తగా చూసుకో", అని సలహాలిచ్చేవాడు. అప్పుడప్పుడు ఆ విసుగును పిల్లల మీద
కూడా చూబించేవాడు.
ఆరు,
నాలుగు తరగతుల్లో చదువుతున్న కూతురు సంయుక్త, కొడుకు సంజీవ్ లు హరిత చేత కష్టమైన పాఠాలు
చెప్పించుకునేవారు; అలా అని తల్లి లేకపోతే కానీ చదవని బాపతు కారు; అదే ఆమె పెంపకానికి
చక్కని తాఖీదు. వాళ్ళు బుద్ధిగా వున్నారు గనుక ఆఫీసు సమయం కాకుండా మిగతా సమయమంతా రమారమి
ఇంటి పనులకీ, పెద్ద వాళ్ళకీ కేటాయించగలిగేది హరిత.
బదిలీ
అవకపోవడం అందరినీ క్షోభ పెట్టినా, దాన్ని హరిత మౌనంగా ఎదుర్కొంది. అత్త మీద కోపం దుత్త
మీద చూపినట్లు, అనిల్ ఊరికే హరిత, పిల్లల మీద విసుక్కునేవాడు. రానురాను పిల్లలకి వాళ్ళ
నాన్నతో మాట్లాడాలనే ఆసక్తి తగ్గిపోయింది. అకారణంగా తిట్టే తండ్రిని ఎవరు మాత్రం ఇష్టపడతారు?
అనిల్ మాత్రం అప్పుడప్పుడు, "ఏమర్రా పిల్లలూ, బాగా చదువుతున్నారా? ఏమైనా పోటీల్లో
పల్గొంతున్నారా లేదా?.." అంటూ, వాళ్ళు తాము గెలుచుకున్న బహుమతుల గురించి చెప్పే
లోపే, "బాగా చదవండి. బాగా ఆడండి. అన్నింట్లోనూ మీ నాన్న పేరు నిలబెట్టాలి, తెలుసా?"
అంటూండేవాడు. ఇది విన్నప్పుడల్లా హరిత మనసు నొచ్చుకునేది. ముక్కూ, మొహం తెలియని మగవాడు
మొగుడై తన ప్రతిభను గుర్తించకపోతే, అతనికి తనను అర్థం చేసుకోవడానికి గడువివ్వచ్చు.
కానీ, చిన్నప్పటి నుంచీ ఎరిగున్న మగాడు కూడా మొగుడయ్యే సరికి పురుషాహంకారి అయిపోతున్నాడు.
కొన్నాళ్ళ తర్వాత పిల్లలు, వాళ్ళ నాన్న నస భరించలేక, "నాన్నా, మా మిస్ చెప్పారు,
అమ్మ నీకంటే ఎప్పుడూ బాగా చదివేదని. ఇప్పుడు నీ పేరు నిలబెట్టాలా, అమ్మ పేరు నిలబెట్టాలా?"
అన్నారు. అప్పుడు నాలుక కరుచున్న అనిల్ మొహం చూసి జాలేసింది హరితకి. అహంకారం వల్ల పిల్లల
చేత ఖంగు తినవలసివచ్చింది, పాపం!
ఈ లోగా,
హరిత తల్లికి ప్రమాదవశాత్తు వెన్ను దెబ్బతింది. ఎలాగంటే, సంయుక్తని స్కూటర్ కింద పడకుండా
కాపాడే యత్నంలో. ఒక పక్క తల్లి అక్కడ లేకపోతే ఏమయ్యుండేదనే భయం, మరో పక్క తన కూతురే
తల్లి మంచం పట్టడానికి కారణమనే నిజం ఆమెను దహించాయి. అనిల్ అత్తగారిని పలకరించాడుగానీ,
అన్ని కష్టాలకీ హరితే కారణమని దెప్పాడు. "పిల్లలని పెంచడం చేతకాదా, ఏం? చుట్టుపక్కల
చూసి ఆడుకోవాలి కదా! ఏదో నువ్వు చాలా పనిమంతురాలివనుకున్నానుగానీ .... ", అనే
అతణ్ణి వారించుదామనుకుని హరిత ఆగిపోయింది. ఇంట్లో సమస్తం చూసుకుంటూ, పిల్లలకి చదువులతోబాటు
విద్యాబుద్ధులు నేర్పించడం తేలికైన పని ఎంతమాత్రమూ కాదు. వాళ్ళెప్పుడూ చదువూ, సంస్కారం-
రెంటిలోనూ మొదటి స్థానమే.ఇద్దరూ నాన్నమ్మ, అమ్మమ్మలతో కాలం గడుపుతూ చదువుకుంటూ వుంటారు.
వాళ్ళ బాధ్యతాయుత ప్రవర్తన కొంత ఊరటనిస్తోంది. అది పిల్లలకి పరీక్ష సమయం. వాళ్ళ స్థితప్రజ్ఞతని
మెచ్చుకోవాలి. ఇంట ఇంత హడావుడి ఉన్నా సరే, తమ కర్మానుసారంగా ప్రవర్తించి మంచిగా ఉత్తీర్ణులయ్యారు.
అనిల్ మట్టుకు అదంతా తన పోలికనే అనుకున్నాడు. అసలు అతనికి ఆమె శ్రమ విలువ తెలియడం లేదు. అత్తగార్ని
తలచుకుని జాలి పడింది, ఇలాంటి కొడుకు కోసమా ఈవిడ మంచం పట్టిందని!
వయసు
మళ్ళిన వాడైనా, హరిత తండ్రి పై పనుల్లో సాయం చేసేవాడు. పిల్లలకు నైతిక విలువల గురించి
ఎన్నో కథలు చెప్పేవాడు. ఇది విన్నప్పుడు హరితకి తన చిన్నతనం గుర్తొచ్చింది. చల్లని
వేళ దైవానికి ధన్యవాదాలు చెప్పుకుంది, తన పిల్లలు పోగరుబోతుల్లాగ కాకుండా, బాధ్యతాయుతులైన
పౌరులౌతారన్న నమ్మకంతో.
అత్తగారి
మనోవ్యాధి తీవ్రమై, ఆవిడ మనుషుల్ని గుర్తు పట్టడం మానేసింది. సురేష్ సలహా మేరకు బావగారికీ,
ఇతర చుట్టాలకీ కబురు పెట్టింది హరిత. అనిల్ కూడా చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయాడు,
ఏదో అత్యవసర పని ఆఫీసులో ఉందని. బావగారు, తోటికోడలు కొన్నాళ్ళు ఉండేసరికి అత్తగారు
కొంత కోలుకున్నారు. ఈ విషయమై అందరికన్నా ఎక్కువ సంతోషించింది హరిత. వచ్చిన మిగతా చుట్టాలు
మాత్రం తిన్నగా ఉండకుండా, అతిథి మర్యాదలలో ఏవో లోపాలున్నాయని దెప్పి వెళ్ళిపోయారు.
మర్యాదలు చేయించుకోవడానికి ఇదేమైనా శుభకార్యమా? ఇవన్నీ మన సంఘంలో మామూలేనని సర్ది చెప్పుకుందామె.
కొన్నాళ్ళకి
అత్తగారి ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. పోయినమాటు ఆవిడ కోలుకుంది కనుక ఈ మాటెవ్వరూ రాలేదు.
అన్నీ హరిత నెత్తినే పడ్డాయి. పనిమనిషి కూడా తన కూతురికి పురుటి సమయమని శలవు తీసుకుంది.
కొత్త పనమ్మాయి ఇంటి పనులకింకా అలవాటు పడలేదు. సినిమా కష్టాలంటే ఇవేనేమో? నానాటికీ
ఇంటినీ, ఆఫీసునీ సంతులితం చేయడం కష్టమౌతోంది. దూరాన ఉండే వాడికి తన కష్టం ఎలా అర్థం
అవుతుంది? నిపుణుడిలా సలహాలిస్తాడు గానీ చేతలదాకా వస్తే ఏమీ లేదు.
ఓ పక్కనుంచి
అవసాన దశలో వున్న అత్తగారు, మరో పక్క మంచానికే పరిమితమైనతల్లి, మూడో వైపు ఇద్దరు భావి
భారత పౌరుల భవిష్యత్తు, నాలుగో దిక్కున చేతికి అందుబాటులో లేని భర్త- హరిత పూర్తిగా
నలిగిపోయింది పాపం! కొత్త పనిమనిషికి పనితనం తక్కువ, ఎగ్గొట్టడం ఎక్కువ. ఎలాగో సంసారమనే
బండిని ఒంటెద్దులాగ ఈడుస్తోంది.
ఆ యేడు
అకాల వర్షాలవల్ల కరెంటు ఉండడం లేదు. ఫోన్లు పనిచేయడం లేదు. అదే సమయానికి, ఓ రాత్రి
వేళ హరిత అత్తగారి జీవన జ్యోతి ఆరిపోయింది. కొవ్వొత్తి వెలుగులో, తండ్రి అనునయపు మాటలతో
ఆ రాత్రి గడిపేసిందామె. సురేష్ ది ఏ జన్మ రుణమో గాని తన కారులో రాత్రికి రాత్రి బయలుదేరి
పొరుగూరు వెళ్ళి కావాల్సిన వాళ్ళందరికీ విషయం చెప్పాడు. అనిల్ అన్నగారి ఊరికి మనిషిని
పురమాయించాడు. అసలే అక్కడ కొండ చరియలు విరిగి పడి రహదార్లు మూసుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. సురేష్ వస్తూ వస్తూ మంచు గడ్డలు తెచ్చాడు, ఆవిడ
భౌతిక దేహాన్ని సంరక్షించడానికి. పెద్దకొడుకూ, కోడలూ వచ్చేసరికి మూడు రోజులయ్యింది.
అనిల్ కూడా అప్పటికే రాగలిగాడు. కారణం- “నువ్వు కర్మ చెయ్యక్కర్లేదుకదా, పదోరోజుకి
వెళ్తే చాలదా?” అని శలవు నిరాకరించిన కర్కోటక
ఆఫీసర్ని బుజ్జగించాల్సి రావడం వలన.
ఆ పధ్నాలుగు
రోజులూ గడవగానే ఎవరి గూటికి వారెళ్ళిపోయారు. హరితకు మిగిలింది వెలితి, నిశ్శబ్దం. గానుగెద్దులా
జీవితం నడుస్తూనే వుంది; గొంగళీ పురుగుల్లా అనిల్, హరిత ఉన్న ఊళ్ళలోనే ఉన్నారు. పిల్లలు
మరో తరగతిలోకి వెళ్ళి, కొత్త యూనిఫారాలు, పుస్తకాలలో నిమగ్నులైపోయారు.
*****
తల్లి
కంగారుగా రమ్మని ఫోను చేస్తే, హరిత ఆఫీసునుంచి అనుమతి తీసుకుని ఇంటికొచ్చింది. అప్పటికే సురేష్ అక్కడ ఉన్నాడు.
వాళ్ళమ్మ గారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తనని ఇవ్వాళ ఈ స్థాయిలో నిలబెట్టిన వారిలో ఒకరే మిగిలారు- నాన్నగారు తన స్వర్గ సౌధాన్ని
వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. కుప్ప కూలబడిపోయింది హరిత. ఒకరి చావు నుండి కోలుకునే లోపలే
మరొకరు వెళ్ళిపోయారు. తనకి ఆసరా ఇక లేనట్టేనా? వెంటనే తేరుకుని, పిల్లలకి మనోధైర్యాని
పంచింది. తాతయ్య మనకి భౌతికగా కనిపించకపోయినా మనల్ని కాపాడుతూ ఉంటారు, అనే మాటలతో వాళ్ళ
పసి మనసుల్ని స్థిమిత పరచింది. అనిల్ వచ్చి కర్మకాండ చేసి వెళ్ళాడు.
తల్లిని
ఒప్పించి, వాళ్ళింటికి బస మార్పించేసరికి హరితకి తల ప్రాణం తోకకొచ్చింది. “మీ నాన్నగారు
వెళ్ళిపోయిన ఇంట్లోంచి కాటికి తప్ప వేరే చోటికి రాన”ని భీష్మించుకు కూర్చుందావిడ! పిల్లలు
అడిగేసరికి కాదనలేకపోయింది. ఇల్లు సర్దినపుడు హరిత చాలా బాధ పడింది. మనవాళ్ళు తిరిగిన
దేవాలయంలాంటి ఆ ఇంటిని అద్దెవాళ్ళు సరిగా చూసుకుంటారో లేదో!
బ్యాంక్
ఎకౌంట్లు, కుటుంబ పింఛను, వంటగ్యాసు వగైరాలలో పేర్లు మార్పించడానికి కష్టపడింది హరిత.
అయినా సాధించింది. అప్పుడప్పుడూ వాళ్ళమ్మకి మూర్ఛ వచ్చేది; సంయుక్త తనకుతానుగా తన బస
అమ్మమ్మ గదిలోకి మర్చేసుకుంది. ఆవిడకేమైనా అనారోగ్యం వచ్చినా, సురేష్ గానీ, అతను సిఫారసు
చేసిన నిపుణుడుగానీ నయం చేసేవారు.
తన
అనుమానానికి తగ్గట్టు ఆ అద్దెవాళ్ళు పేచీకోరులయ్యారు. వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించడం
ఒక గగనమయ్యింది. ఇవన్నీ జరుగుతూండగా అనిల్ నోటి మాటలతో ఓదార్చాడుకానీ ఒక్క రోజు కూడా
శలవు పెట్టి సాయం చేయలేదు. పనిలోంచి విరామం తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రోజులుండి
ఒక అతిథిలా మసలుకుని ఊరెళ్ళిపోయేవాడు. ఇదంతా నెమరు వేసుకున్న హరిత పిల్లల బాధ్యతాయుత
ప్రవర్తనకి సంతోషించింది. చీకట్లో గోరంత దీపాన్ని చూసి సంతోషించి, చీకటిని మరచిపోయే
మనస్తత్వం ఆమెది.
*****
ఎట్టకేలకి
మరో సంవత్సరానికి అనిల్ కి సొంత వూరికి బదిలీ అయ్యింది. సంసార సాగరాన్ని ఈదడానికి తోడు
మళ్ళీ దొరికినందుకు హరిత సంతోషించింది. సొంత ఊరు వచ్చేసరికి వత్తిళ్ళు పోయి మామూలుగా
బాధ్యతగా మెలగసాగాడు అనిల్.
ఇలా
వుండగా ఓ ఆదివారం సాయంత్రం అందరూ టీవీ చూస్తున్నారు. సంజీవ్ సాంఘిక శాస్త్రంలో ఓ పాఠాన్ని
ముందస్తుగా చెప్పించుకోవడానికి హరితని తనకోసం కొంత సమయం కేటాయించమని అడిగాడు. హరిత
మంచి బాగా పాఠం చెబుతుంది కనుక తల్లి కొడుకును చదివిస్తుంటే సంయుక్త, అనిల్ అక్కడే
ఉన్నారు. ఆ అధ్యాయం "మాతృస్వామిక కుటుంబా" నికి సంబంధించినది. పుస్తకంలోంచి
నిర్వచనం చదివే ముందు హరిత ఉపోద్ఘాతంలా ఇలా చెప్పింది: " మాతృస్వామిక కుటుంబమంటే, యే ఇంటికి పెద్ద స్త్రీ అవుతుందో, యే కుటుంబపు బాధ్యత
స్త్రీ తీసుకుంటుందో, యే ఇంటి పేరు స్త్రీ నుండి సంక్రమిస్తుందో, అటువంటి కుటుంబం".
సంజీవ్ ఆలోచనలో పడ్డాడు. "చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. నువ్వే ఇంటి బాధ్యత తీసుకుంటున్నావు.
ఇంటికి పెద్దవి నువ్వే- మా స్కూల్లో "పేరెంట్స్ మీట్" కి నువ్వే వస్తావుగా!
నా ఇంటి పేరు నాన్నదైనా "హరిత గారబ్బాయి" గానే నాకు గుర్తింపు. హమ్మయ్య...
మాతృస్వామిక కుటుంబమంటే మన ఫ్యామిలీలాగే! నేర్చుకోవడానికి నేను కష్టపడక్కరలేదోచ్!"
అని ఆనందంగా కేరింత కొట్టాడు సంజీవ్.
సంజీవ్
మాటలకి ఉలిక్కి పడ్డారు అనిల్, హరిత. తను చేపట్టని బాధ్యతలు వెక్కిరించినట్టయ్యి అనిల్ బిక్కమొహం వేసుకున్నాడు. భర్త గుర్తించని తన
కృషిని, త్యాగాన్నితర్వాతి తరం వాడైన కొడుకు గుర్తించి, అన్వయించగలిగాడని సంతోషించిన
హరిత మొహంలో తన పెంపకం సరైనదనే ఆనందం కనిపించింది.
*****
2 comments:
Brilliant story maam!
My favorite of yours! Made me realize that almost all families I know (including mine) are matriarchal to the extent that women are the ones who carry the heaviest burdens. However women give up the authority and power to the guys because of the patriarchal mindset.
This is a beautiful story which needs to be in a competition maam!
Thank u dear thinker! I hope this will reach a lot more people ............:)
Post a Comment