అసలు, నువ్వు మనిషివేనా?
మీదో సంపన్న దేశం
అందుకే ఓ ఖరీదైన కెమెరా కొనుక్కోగాలిగావు
ప్రపంచంలో వింతలూ-విశేషాలూ చూడ్డానికి బయల్దేరావు
అక్కడితో ఆగచ్చు కదా!
ఊహూఁ, పేదరికానికి ఫోటో తీద్దామని వెళ్ళావు
పేగులు కనిపిస్తున్న పిల్లని చూసి పొంగిపోయావు
ఆమె వెంట కాచుకుని కూర్చున్న రాబందుని గమనించి ఉబ్బితబ్బిబ్బయ్యావు
అసలు నువ్వు మనిషివేనా?
మీ జాతి మనిషే అయివుంటుంది మేరీ ఆంత్వానెట్
బ్రెడ్డు లేదని జనాలు రోదిస్తే
కేకు తినచ్చుకదాయని నోరు వెళ్ళబెట్టిందట!
తిండి లేక, పోషకాల్లేక, నడవలేక
ఆహారం కోసం వెదుకుతూ డేకుతున్న
ఆ పాపాయిని చూస్తే ఫోటోతియ్యాలనిపించిందా?
అయ్యోపాపమనిపించలేదురా నీకు?
అసలు, నువ్వు మనిషివేనా?
ఫోటో తీసుకుని, బహుమతి నందుకుని
టీవీ ఇంటర్వ్యూకి ఎగబడతావురా సన్నాసీ?
అక్కడ ఎవరో ఆ పసిపాపని సురక్షితమైన ప్రదేశానికి
చేర్చావా,
అని అడిగే వరకూ నీకు ప్రైజు తెచ్చిపెట్టిన ఆ పాప
సంగతి గుర్తుకు రాదురా పాపీ?
నీకన్నా ఆ రాబందే నయం, బతికున్న వాళ్ళని
పీక్కుతినదు
పసిపాప ప్రాణం కన్నా విమానం ఎక్కువైందా నీకు ఓ
మనవ రాబందూ?
అసలు, నువ్వు మనిషివేనా?
*****
No comments:
Post a Comment