Thursday, April 12, 2018

చిట్టి కథ - Sentence- "నాను బతికి సెడిన వోన్ని బాబయా...మీరు సెప్పే పాపం పనులు సేస్తూ సెడి బతకలేను...దండాలండీ" (మాండలికంలో)- ఆత్మస్థైర్యం


ఆత్మస్థైర్యం
అదో మోస్తరు పల్లెటూరు. అందులో పిపీలకం లాంటి వెల్డర్ కాశీ. చేసేవి చిన్నా, చితకా పనులైనా శ్రద్ధగా చేస్తాడు. ఆ కారణంగా ఊళ్ళో మంచి పేరుంది. “నువ్వు చేసే పని దుబాయ్ లో చేస్తే లక్షలకు లక్షలు సంపాదించచ్చు”, అని ఓ పెద్ద మనిషి ఉచిత సలహా ఇస్తే, ఉన్న కాస్త పొలమూ అమ్మేసి, అర్జంటుగా ఓ ఏజెంటు దగ్గరికి వెళ్ళాడు. పూర్వాపరాలు వాకబు చేయని పాపానికి వాడు కాశీని నిలువునా ముంచాడు.

ఓడిపోయిన మొహంతో ఊరికి రావడం ఇష్టం లేకపోయినా, ఏదో ఒక పని దొరుకుతుందని ఆశపడి  వచ్చాడు. ఇప్పుడు తను పని చేసే షాపు ఓనర్ పట్నానికి మకాం మార్చేశాడు. పోనీ, వ్యవసాయం చేద్దామంటే, అందులో తనకి పాండిత్యం లేదని నిరుత్సాహ పరిచేవారే ఎక్కువ. మొత్తానికి ఆ ఊరి ప్రెసిడెంట్ ఆలోచించి, సాయంత్రం వచ్చి కలవమన్నాడు. “వ్యవసాయప్పనులు శ్రెద్దగా నేర్సుకుంటానండయ్యా! ఎవురైనా ఒక పాలె నేర్పిస్తే ఇట్టే పట్టేత్తానండయ్యా!” అని తన గురించి విన్నవించుకున్నాడు. “ఎహే, అందుక్కాదు నిన్ను పిలుత్త. ఈడ సారాయి బట్టీ ఉన్నాది గంద! ఆడ సాయం సేసేవోడొకడు కావాల. అందుకే నిన్ను రమ్మంట. ఎల్లి పన్లో జేరు!” అని విసుక్కున్నాడు ప్రెసిడెంట్.    
“ఎల్లొత్తానండయ్యా”, అని వెనుదిరిగాడు కాశీ. “అవునూ, నువ్వెప్పుడూ సారాయి కొట్టుకాడ కనబడేవోడివికావు గందా! బట్టీ ఏడుందో ఎరుకా?” అడిగాడు ప్రెసిడెంట్.
“తెలుసండయ్యా! అయినా అది యేడుంటే నాకేటి? మడుసులను సంపేసే పని నాను సెయ్యనేను బాబయ్యా......నాను బతికి సెడిన వోన్ని బాబయా...మీరు సెప్పే పాపం పనులు సేస్తూ సెడి బతకలేను... కట్టపడేవోడికి కూసింతన్నం దొరక్కపోదయ్యా! దండాలండీ...” అని తన దారిన తను వెళ్ళాడు.
***

No comments: