Thursday, May 29, 2014

పరుషపు మాటలూ, పాడు జపాలూ


మా షెట్టి, రాంప్రసాద్లు కొండంత ప్రోత్సాహాన్నిచ్చాక వ్రాయడానికి భలే ఉత్సాహమొచ్చిందంటే నమ్మండి! ప్రోత్సహించారుగా, ఇక భరించండి! ఈనాటి అంశం- “పరుషం మాటలూ, పాడు జపాలూ”. ఎందుకంటారా? మీరే చూద్దురుగాని!
ఈ రోజుల్లో పాడు జపాలూ, పరుషం మాటలూ, సర్వసాధారణమైపోయాయి. ఎందుకో తెలియలేదుగానీ, అలాగ మాట్లాడేవళ్ళకది గొప్పేమో అనిపించింది. ఆంగ్లంలో మాటాడేవళ్ళైతే మరీను. ఈ మధ్యనే మాకు తెలిసినవాళ్ళమ్మాయిని అనుకోకుండా కలిశాను. మహా అయితే ఐదు నిముషాలు మాట్లాడామేమో కానీ, అంతలో ఆ అమ్మాయి నరకాన్నీ, అశుధ్ధాన్నీ, ఇంకా చాలా చాలా చెప్పలేని మాటల్ని ప్రస్తావించింది. 'టైడ్' వాడకపోయినా అవాక్కయ్యాను. స్నేహితులని బండభాషతో సంబోధిస్తే, అది సాన్నిహిత్యమట! ముక్కుమీద వేలేసుకున్నాను. హతవిధీ, అని బాధపడ్డాను. కాలం మారిందో, నాకు వార్ధక్యం వచ్చిందో తెలియదుగానీ, నా చిన్నప్పుడు ఇలా వుండేది కాదు అని, అనకుండా ఉండలేకపోతున్నాను.
*******


చిన్నప్పుడు రెండవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటాను, ఒక సారి, " హోం వర్క్ చెయ్యలేక చస్తున్నాను బాబూ", అని వాపోయాను. "నా చిట్టి తల్లి అలసిపోయింది, పాపం", అని అమ్మ నాకు వెనువెంటనే హార్లిక్స్ చేసిచ్చింది. సంతోషించాను. పనంతా ముగించుకొని, " తాతయ్య గారూ, నేను నా హోం వర్కుని చాలా త్వరగా ముగించేశాను", అని గొప్పకొట్టుకున్నాను. ఆయన నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని, "అంతా బాగుందిగానీ, ఆ పరుషం మాట ఏమిటే, అమ్మాయీ?" అని అడిగారు. నాకేమీ అర్థం కాలేదు. ఏమిటని అడిగితే, "ఇందాకేదో నీ హోం వర్కు చేయలేక ఏదో అయిపోతున్నానన్నావ్?". నాకు గుర్తొచ్చింది."ఓహో, అదా,  చస్-" .. నేను మాట్లాడుతుండగా నన్ను అడ్డగించించి, "అదే పరుషం మాట మళ్ళీ అనకు. నీకేమంత కష్టమొచ్చిందని, అంతలేసి మాట అనేశావు?" అన్నారు. "హోం వర్కు కష్టంగా వుంటేను..".
"నీకు తినడానికి తిండి వుందా, లేక పస్తులుంటున్నావా", అని అడిగారు తాతాయ్య గారు.
 "నాకు ఇంతవఱకూ ఆకలంటేనే తెలియదు. ఆకలేసే సమయానికి అమ్మ అన్నం పెడుతుందిగా", అన్నాను.
"ఉండడానికి ఇల్లుంది కదా?"
"అవును".
"మరి కట్టుకోవడానికి బట్టలో?"
"ఉన్నాయి కదండీ!”
"ఏదైనా అనారోగ్యం ఉందా?"
ఈయనేమిటి, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, అనుకున్నాను.
"పోయిన ఎండాకాలంలో జ్వరమొచ్చాక ఇంకేమీ లేదు", అని జవాబిచ్చాను.
ఆయన మాత్రం, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు.
"మన చుట్టుపక్కల నీకున్నన్ని సౌఖ్యాలు, సౌకర్యాలూ కూడా లేని వాళ్ళు చాలామందే ఉన్నారుకదా?"
ఆలోచించాను. ఆయన చెప్పినదానిలో కొంచెం కూడా తప్పు లేదు. అయినా, నేనెప్పుడూ నా గొప్ప చెప్పుకోలేదు, పైగా వాళ్ళ దుస్థితి చూసి ఏడ్చేదాన్ని. వాళ్ళకొసం ఏదైనా చెయ్యమని మా తల్లితండ్రులని అడిగేదాన్ని. విషయం తాతయ్యగారికి తెలుసు కూడాను. కానీ, ఈ విషయాలకీ, పరుషపు మాటకీ, ఏమిటి సంబంధమో నాకు తెలియలేదు.
"బంగారు తల్లీ, జవాబు చెప్పవేమిటే?"
మాటలకి మళ్ళీ ప్రస్థుతంలోకొచ్చాను. అవునన్నట్టు తలాడించాను.
"మరొక్క విషయం. భూమి మీద మంచి వాళ్ళూ, చెడ్డ వాళ్ళూ ఉంటారుకదా?"
"ఉంటారు".
"దొంగలూ, హంతకులూ కూడా"?
"ఎందుకు మీరు నన్ను భయపెడుతున్నరు? నాకు దొంగలూ, హంతకులంటే భయం. నేనేమీ పోలీసుని కాను కదా?"
"కదా. ఇంతమంది భూదేవి భరిస్తోందా లేదా?"
నేను ఆలోచనలో పడ్డాను.
"ఆవిడ 'వీళ్ళందరినీ నేను భరించలేను' అని అనుకోవడంలేదుకదా. అలా అనుకొని వుంటే ఎన్ని భూకంపాలు వచ్చేవి?"
నాకు ఏడుపు వచ్చింది. భూకంపం వస్తే, మనుషులు మరణిస్తారని ఎక్కడో విన్నట్టు గుర్తు. ఇంక భరించలేక, "తాతయ్య గారూ, చావు గుఱించి ఎందుకు చెప్తారు?" అని కన్నీళ్ళతో ప్రశ్నించాను.
"కూసంత హోం వర్కు చెయ్యలేక ఇంత పెద్ద పరుషం మాట అన్నావే, మఱి 'తథాస్తు' దేవతలు తథాస్తు అన్నారంటే ఎన్ని కష్టాలో అలోచించు. పాడు జపాలు చెయ్యకూడదు, తెలిసిందా?"
*****************
చందమామ పుస్తకంలో రెండు, మూడు కథలు, తాతయ్యగారు చెప్పిన మాటల్ని బలపఱిచాయి. ఒకటి, "తిట్లూ- శపనార్థాలూ", రెండవదాని పేరు గుర్తులేదుకాని అదొక భేతాళ కథ. మూడవది కోపం ఎంత అనర్థానికి దారి తీస్తుందో చెపుతుంది. మొదటి కథలో రెండు పిశాచాలు భోజనానికి బయల్దేరుతాయి. దారిలో చాలామంది వేఱు వేఱు సందర్భాలలో ఎదుటివాళ్ళని 'నిన్ను పిశాచం మింగా' అని తిడుతూంటారు. పిల్ల పిశాచం తిండికి ఆరాటపడినా, తల్లి పిశాచం అవి తిట్లనీ, శపనార్థాలు కావనీ వారిస్తుంది. చివఱికి మోసపు లెక్కలు వేసిన వడ్డీ వ్యాపారి వల్ల కష్టపడే పెద్దావిడ అదే మాట అంటే, పిశాచం ఠక్కున అతన్ని మింగేస్తుంది. తిట్లకీ, శాపనార్థాలకీ తేడా సంగతేమోగానీ, పరుషపు మాటలు అనకూడదని నిశ్చయించుకున్నాను. నా జ్ఞాపకాలలో, రెండు, మూడవ కథలు కలసి పోయాయి. వీలయినంత  గుర్తు తెచ్చుకుంటాను. రెండవ కథలో ఒక మనిషి మిగిలినవాళ్ళు బాగుపడితే కుళ్ళుకుంటూంటాడు. వాళ్ళు నాశనం అవాలని శాపాలు పెడుతూంటాడు. అప్పుడొక యోగి అతని మాటలు వ్యతిరేకంగా పనిచేసేటట్టు దీవిస్తాడు. కుళ్ళుబోతు నాశనమైపోవాలనుకున్నవాళ్ళుఐశ్వర్యవంతులైపోతూంటారు. అది చూసి కుళ్ళుతో అతను వాళ్ళని దీవిస్తాడు. కనీ, వాళ్ళకేం అపాయం జరుగదు. మూడవ కథలో, ఒక కోపిష్ఠి అందరినీ నానా మాటలూ అంటూంటాడు. ఊరిలో చెడ్డపేరు తెచ్చుకుంటాడు. ఊరికి ఒక సాధువొస్తే కోపిష్ఠి భార్య తన గోడు చెప్పుకుంటుంది. సాధువు అతని మాటలు అక్షరాలా నిజమయ్యే వరాన్నిస్తాడు. కోపిష్ఠి "నీ మొహం మండా", "నీ అమ్మకడుపు కాలా" వంటి తిట్లు తిడితే, అవి అలాగే నిజమయ్యేవి. ఒకసారి తన తిట్లు తనకే కష్టం తెచ్చిపెడితే, బుద్ధి తెచ్చుకుంటాడు.

************************
ఈ చందమామ కథల్లో వుండే విలువల్ని చటుక్కున ఎలా వదిలేస్తామో, కొన్ని పరుష సంభాషణల్లో చూద్దామా (కొందరికైతే ఎబ్బెట్టైన పదాల్ని వాడడం సరదా. అలాంటివాళ్ళని నేనిక్కడ ప్రస్తావించను లెండి).….
ఒకసారి సిటీ బస్సులో నా వెనుక సీట్లో ఇద్దరమ్మాయిలు కూర్చున్నారు. వాళ్ళ సంభాషణ ఇలా సాగింది:
మొదటి అమ్మాయి: నీకు యునివర్శిటీ ఫస్టు వచ్చిందటగా! కంగ్రాట్స్!
రెండవ అమ్మాయి: థాంక్యూ.
మొదటి అమ్మాయి: అందరూ సంతోషించుంటారు.
రెండవ అమ్మాయి: ఏం సంతోషంలే? లేడీస్ కాలేజ్ వసంత లేదూ! నాకు ర్యాంకొచ్చిందని కుళ్ళుకు చచ్చిందంటే నమ్ము!
మొదటి అమ్మాయి: ఏమిటీ, వసంత ఆత్మహత్య చేసుకుందా? అయ్యో! నాకు తెలియనేతెలియదు సుమీ!
రెండవ అమ్మాయి: అబ్బెబ్బే, అలాంటిదేమీలేదు. అంటే, అంతగా కుళ్ళుకుందని...
ఇదండీ యునివర్శిటీ ఫస్టు వచ్చిన వాళ్ళ వరస...మాటల పొందిక ఎంత గొప్పగా ఉందో!
************
"టిఫిను తేవడానికింకెన్ని గంటలు చేస్తావే? అవతల ఆఫీసుకి లేటైతే, నా బాస్ నాప్రాణాలు తీస్తాడు ...”
ఏదో బాసుకి తనకింద పనిచేసేవాళ్ళని చంపడమే పనన్నట్టు.....
****************
"నీ పసుపు, కంకుమల మీద ఆశ వదులుకుంటే, నువ్వు మీ పుట్టింటి గడప తొక్కు..."

అతను మాత్రం తన తల్లిదండ్రుల్ని చూడడా? దానికి పిల్ల ఆంక్షలు పెట్టిందా?                     
**************
"ఒరేయ్, సూరిగా, మళ్ళీ ఇలా అల్లరి చేసి ఇల్లు కుప్పచేసావంటే, నిన్ను బావిలో పడేస్తాను.....జాగ్రత్త!"
తల్లి, పుత్రశోకం ఎంత బాధాకరమో ఆలోచించలేదన్నది మనకర్థమౌతోంది.. కాని ఆమెకు తెలిసేదెలా?
******************
"సరిగ్గా చదవుకోలేదనుకో, మన ఊరి గుడిమెట్లమీద కూర్చిని అడుక్కోవలసిందే…"
చదువుకొని బాగుపడరా అనడానికింత పాడు జపం చెయ్యాలా?
**************
"స్కూలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడూ జగ్రత్త. సొంత తెలివి పెట్టి వేషాలు వేశావంటే, చక్రాలకింద నలిగిపోగలవు జాగ్రత్త!" అని హెచ్చరించిన తల్లి ఆందోళనతో అన్నట్టు తెలుస్తోంది కానీ వినసొంపుగా వుందా?
************************
"నన్ను అంతలేసి మాటలన్నవాళ్ళు పురుగులుపట్టి పోతారు..."మనల్ని మాటలంటే బాధగా వుంటుంది, కాదనను. కానీ మనం కూడా వాళ్ళెవరికో సమవుజ్జీలుగా వుంటే ఎలా?

మరి, మనం "నా మతిమరుపు మండా" అని అనచ్చా? తథాస్తు దేవతలు దీవిస్తే, బుఱ్ఱ బాగా పనిచెయ్యచ్చేమో? అనే అనుమానం కలగచ్చు మీకు. మధ్య విన్న ఒక సంగతి చెపుతాను. ఎవరినో ప్రస్తావించకుండా నా మీదే వేసుకుంటాను. ఒకానొక రోజున, ఆదివారం ఉదయాన ఒక "టేక్ హోం" పరీక్ష వ్రాయడం కోసం నేను ఇంట్లో ఉండిపోయాను, మా వాళ్ళంతా అప్పటికే విహారానికి వెళ్ళిపోయారు. పాలు పొయ్యిమీద పెట్టి, కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో, ఒక మెరుపు ఆలోచన మెరిసినా పరీక్షాప్రశ్నకు తళుక్కుమనే సమాధానం తట్టింది. పాలు కాగడానికి ఇంకా పావుగంటైనా పడుతుందికదా, లోగా నాలుగు వాక్యాలూ టైపు చేసుకుందామని పక్కగదిలోకి వెళ్ళాను.
*************************
నా ఆలోచనావళి, ఒక జలపాతపు ఝరిలా జలజల జాలువారింది. నాకేనా ఇంత మంచి ఆలోచనలొచ్చాయి అని ఆనందించాను. కొంతసేపయ్యాక ముక్కుకిబ్బంది కలిగి, దాన్ని కదిలించాను. ఇబ్బందివేరేదీ కాదు, మాడు వాసన. తెరచి వున్న కిటికీలోంచి బైటకి చూస్టూ, అయ్యో, ఎవరో టీవీ చూస్తూ పాలని మరచిపోయారు, అని మా చుట్టుపక్కల ఎవరికి ఫోన్ చెయ్యాలా అని మాడువాసన దిక్కునుండి వచ్చిందా అని భోగట్టా వేస్తూండగా, కాలింగ్ బెల్ మ్రోగింది. మా వాళ్ళు వాక్ నుంచి వచ్చేసుంటారని (అంటే గంటకు పైగా అయ్యి వుంటుందని) తలుపు తీయడానికి బయలుదేరాను. నేను మా మొదటి గదికి దగ్గరైనకొద్దీ మాడువాసన బలమయ్యింది. బహుశః ఎదురింట్లో పాలు మాడాయేమో అని అనుకున్నాను. వంటింటి నుండి వస్తున్న పొగలు చూసాక గానీ తెలియలేదు, మాడిన పాలు మావేననీ, దానికి కారణం నేనేననీ. వెంటనే తలుపు తెరవనందుకు విసుగుకున్న మా వాళ్ళు, "నీ మతి మరుపు మండా" అని నన్ను దుయ్యబట్టారు. నేనభ్యంతరం చెబితే, మాడువాసన పాలదని గ్రహించిన నువ్వు, అది మనింట్లోదే అని గ్రహించలేనపుడు, మాటలో తప్పేమిటి అని అడిగారు. పైగా, నా మతిమరుపువల్లే పాలు మండి, మాడిపోయాయని వాళ్ళ వాక్యాన్ని సమర్థించుకున్నారు. గోరుచుట్టుపై రోకటిపోటులా పరీక్షా సమయంలో గిన్నె మాడి, వంటస్థలంలో పొంగిన పాలని శుభ్రం చెయ్యాలని నేనేడుస్తూంటే, కర్ణకఠోరమైన పాడుజపం కూడానా? ఎంత సమంజసమైనా,  వినబుద్ధి కాలేదు.

*********************************
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, కారణం వున్నా, లేకపోయినా ఊతపదాలూ, పరుషపు మాటలూ, పాడుజపాలూ అనాలోచితంగా, అలవోకగా వాడేస్తూంటాం...కదా! పరుషపు సంభాషణలు వ్రాసినపుడు నా మనసెంత బాధ పడిందో! నోట్లోంచి మాటలు బయటపడేముందు అవి నిజమైతే ఎలా అని, ఒక్కసారి ఆగాలి, ఆలోచించాలి. అప్పుడు మనం మాటల్ని మెదడులోంచే గెంటేస్తాం, కదా! ఇది చదివి ఒక్కరైనా పాడుజపాలూ, అవీ మానేస్తే నా వ్రాత ధన్యమైనట్టే!
****************

4 comments:

simple said...

నిజమేనండీ !! కష్టం కాదు , కొంచెం అలవాటు చేసుకోవాలి అంతే . ఆ చందమామ కథలు నేను కూడా చదివినట్లు గుర్తు !! :)

Mediocre to the Core said...

సరళమైన వారి ప్రోత్సాహానికి ధన్యవాదాలు. చూశారా, చందమామలోని కథలు విలువలు పంచేవి, మనసుకు హత్తుకునేవి, జై చందమామ!

WB said...

చందమామకన్నా ముందు - మీ తాతయ్యకు జై! పసిమనసు కసుగాయకుండా ఎంత అందంగా బుద్ధి నేర్పారో...

Mediocre to the Core said...

ధన్యవాదాలండీ ! మీరన్న ముక్క అక్షరాలా నిజం. ఎవరైనా నా ఆలోచనా ధోరణిని మెచ్చుకుంటే నాకు ఒకటే అనిపిస్తుంది- అదెంత కాకతాళీయమో అని. Just the result of the "accident" of being born of such noble souls!