Sunday, June 28, 2015

ఓ బలహీన క్షణాన ............ In a weak moment.....Part 2 (concluded)

(continued from the previous post)

      ఇలా ఓ వారం రోజులు గడిచాయి. రాఘవ రావుగారిని ఐసీయూ నుండి వార్డుకి మార్చేశారు. సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు ఎవరైనా సరే రోగిని పరామర్శించవచ్చు. మొదటి రోజున ఊళ్ళో లేకపోవడం వల్ల చూడలేకపోయాడు, విశ్వనాథం. ఊళ్ళోకి వస్తూనే తెలిసిన విషయమేమంటే, కాకులైన లోకులు పలకరించే నెపంతో రావు గారిని చూసి, వివరాలు కూపీ లాగడానికి ప్రయత్నించారట. ఆయన ఆవేదనా భరితమైన ఆవేశంతో అరిచారట. వీళ్ళు బయటికి వచ్చి ఆయనకు పిచ్చి అనే మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు. విశ్వం ఎంతగానో బాధపడి, నాలుగు ఎప్పుడౌతుందా  అని చూసి చూసి, ఎట్టకేలకి ఆసుపత్రి చేరుకున్నాడు.

      తీరా అక్కడిదాకా వెళ్ళాక తెలిసినదేమంటే, ఆయనను చూడడానికి కుటుంబసభ్యులకు తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదని. హతవిధీ! ఛీ ఛీ ఐడెమ్ పాడు జపం, అనుకుని తనని తాను ఓదార్చుకున్న విశ్వనాథం, బ్రహ్మాస్త్రంలా డాక్టర్ వద్దకు వెళ్ళాడు, రావు గారిని చూడడానికి అవకాశం దొరుకుందేమో అని.  మొత్తానికి డాక్టర్ గారి గదిలోకి వెళ్ళి, తను వచ్చిన పని చెప్పాడు విశ్వనాథం. వెంటనే డా॥ అవినాష్ మోహంలో రంగులు మారాయి. కోపంగా, "ఎంత అమానుషత్వం ఇది! పరిస్థితుల్ని ఎదిరించలేని ఓ దౌర్బల్యుడు, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొతే పీడా పోయేది. మీ అందరి బల్లెపు మాటలు వినపడేవి కావు. ఇప్పుడు బ్రతికి బయటపడ్డాడు కనుక మీరు అనరాని మాటలని, వివరాలు కనుక్కొని, అయనని బాధ పెట్టి, వారి గురించి పుకార్లు పుట్టించాలనుకుంటారా? ఎంత అన్యాయం! వెళ్ళండి, వెళ్ళండి", అన్నాడు. ఆ మాటలకూ బాధపడినా, పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి, డాక్టర్ని ఒప్పించాడు. రావుగారితో ముక్తసరిగా, "సార్, మీరు త్వరలోనే కోలుకొని ఆఫీసుకి రండి. మీ ప్రోత్సాహం కోసం నా లాంటి ఎందరో అక్కడ ఎదురుచూస్తున్నారు!" అని నాలుగు మంచి ముక్కలు చెప్పి వచ్చాడు.
**********************
     కొన్నాళ్ళిలా సాగాయి. డా॥ అవినాష్, విశ్వనాథం తరచుగా మాట్లాడుకునేవాళ్ళు. మరికొన్నాళ్ళకి విశ్వనాథంపై నమ్మకం కుదిరి, తనకు తానే డా॥ అవినాష్ అసలు విషయాన్ని బయట పెట్టాడు: "మొదట్లో లక్ష్మిగారు పిల్లకు తల్లిగా మాత్రమే వచ్చినట్లుగా తనూ, పిల్లా, వేరే గదిలో పడుక్కునే వారట. అది చూసి రాఘవ రావుగారూ, వాళ్ళమ్మగారూ సంతోషించేవారుట. ఇలా ఓ ఆరు నెలలు గడిచాక పిల్ల కొంచెం పెద్దదయ్యింది, నన్నమ్మకి తోడుగా వుంటే బాగుంటుంది, భార్యాభర్తలకు కూడా ఏకాంతం కావాలిగా, అని ప్రస్తావిస్తే ఆవిడ భర్త, అత్తగారూ వెంటనే ఒప్పుకున్నారుట. ఆ తరువాత ఆవిడ గర్భవతి అవడంతోనే పూర్ణిమని చిన్న చూపు చూసేదిట, తల్లిని పొట్టన పెట్టుకుందని. ఆ పిల్ల దగ్గరకు వస్తేనే తన కడుపులో ఉండే శిశువుకి ఏమైనా జరుగుంతుందేమో అని భావించేదిట. ఈ విషయం రావుగారి తల్లికి తెలిసినా, కోడలు ఉద్రేక పడకూడదనే ఉద్దేశ్యంతో ఊరుకుందిట. తనకు కొడుకు పుట్టిన వెంటనే పూర్ణిమ జ్యేష్టా దేవిలా కనిపించి, తనకు కట్నం తెచ్చేవాడు కలిగాడు కనుక యీ పిల్ల వల్ల భవిష్యత్తులో ఎందుకు నష్టపోవాలి, అనే ఆలోచన బలంగా ఏర్పడిందట. ఇంక ఆమెను చీటికీ మాటికీ విసుక్కోవడం, కొట్టడంలాంటివి చేసేదిట. అత్తగారు అడ్డు చెబితే, పూర్ణిమకి బొత్తిగా క్రమశిక్షణ నశించిందనీ, మొక్కై వంగనిది మానై వంగదనీ, తర్వాత సవతి తల్లి కదా అని పిల్ల పెంపకాన్ని అలక్ష్యం చేసిందని తనను అందరూ ఆడిపోసుకుంటారనీ, అందుకే ఇప్పటి నుంచీ కట్టుదిట్టం చేస్తున్నాననీ చెప్పేది. ఈ విషయం తన కొడుకు చెవిన వేద్దామంటే తెలివైన ఆ కోడలు ఎప్పుడూ చుట్టుపక్కలే వుండేది; లేకుంటే ఏ పెళ్ళో, పేరంటమో, పార్టీనో అని చెప్పి తన మొగుణ్ణి వెంటేసుకు తిరిగేది. అదే సమయానికి ఆఫీసులో అదనపు బాధ్యతలు నెత్తిన పడిన రావుగారు, భార్య అన్నీ చూసుకుంటుందనే ధీమాతో ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకోలేదుట. ఓ రోజు ఆఫీసునుండి ఏ కారణం వల్లనో ఇంటికి త్వరగా వచ్చిన రావుగారికి వాళ్ళమ్మగారితోనూ , పూర్ణిమతోనూ కొంత ఏకాంతం దొరికిందట (ఎందుకంటే, లక్ష్మి తన చంటి పిల్లాడితో కిట్టీ పార్టీకి వెళ్ళింది కనుక) . జరిగిన సంగతి  తెలుసుకొని, బాధ పడ్డ రావుగారు, లక్ష్మి ఇంటికి వచ్చాక ఆవిణ్ణి నిలదీశారట. వెంటనే ఆవిడ పెద్ద గొంతుతో భర్త, అత్తగారూ తనని అష్టకష్టాలు పెడుతున్నారనీ, పూర్ణిమ కోసం తననీ, తన కొడుకైన శశాంక్ నీ చంపే యత్నంలో ఉన్నారనీ, తాను అది సహించదనీ, గృహహింస చట్టం కింద కోర్టుకెక్కుతాననీ అరచి పెడబొబ్బలు పెట్టిందిట. రావుగారూ, వాళ్ళమ్మగారూ నివ్వెరపోయారట. ఏ మర్యాదస్తులైనా అంతే కదండీ! ఆ రోజు తర్వాత పూర్ణిమని అవకాశం దొరికినప్పుడల్లా వాతలు పెట్టి శారీరిక హింసకు గురిచేసేదట. ఎవరైనా ఏమైనా అంటే, కోర్టూ, పోలీసులూ అని బెదిరించి వాళ్ళ చేత వెనుకంజ వేయించిందిట. ఇలా ఓ ఆరు నెలలు అయ్యాక ఒక రోజు రావుగారు తన జీవితాన్ని సమీక్షించుకున్నారుట. తనకి చట్టపరంగా భార్య అయిన లక్ష్మి, వేరే చెడ్డ ఉద్దేశ్యాలతో తనను పెళ్ళి చేసుకుంది. తానొక దుఃఖ భరితమైన బంధమనే ఊబిలో కూరుకుపోయాడు. విడాకులనే ఆసరాతో బయటికి రావచ్చు. కానీ లక్ష్మి, అతడు బయట పడకుండా బెదిరిస్తుంది. ఆ బెదిరింపులే నిజమైతే తనూ, తన తల్లీ కూడా తట్టుకోలేరు. ‘చిన్న పిల్ల పూర్ణిమ ఎంత పాపం చేసుకుందో కదా! లేకుంటే చేతగానివాడైన తన కడుపున పుట్టి, తల్లిని పోగొట్టుకుని, సవతి తల్లితో కష్టాలు పడుతుందా పాపం', అని  ఆలోచించి, ఆ నిస్సహాయ స్థితిలో, ఓ బలహీన క్షణాన, ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారుట. తన తల్లికి ఇంకా ఒక కొడుకూ,కూతురూ ఉన్నారు; వాళ్ళు ఆవిణ్ణి చూడక పోరు. లక్ష్మి సంగతి సరేసరి. ఆమెకు కావలసినది ఒక బిడ్డ, తన ఆస్తి. ఒకటి ఎలాగో సంప్రాప్తించింది. రెండవది ఇస్తే ఆమె తనను కూడా గుర్తు తెచ్చుకోదు. అదే చేస్తే ఓ పనైపోతుంది. పూర్ణిమ అసలే తల్లి లేని పిల్ల; తండ్రి ఎంత నిస్సహాయుడంటే ఉన్నా లేనట్లే. తను లేకపోతే లోకులు రాబందులై పొడుచుకు తింటారు, ఆమె వెనుక ఎవరూ నిలబడరు గనుక. ఇలా విపరీతమైన ఆలోచనలకు లోనయ్యి, పూర్ణిమని చంపి, తను చచ్చిపోదామనుకున్నారుట రావు గారు.
  ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు కానీ ఆత్మహత్య, హత్యాయత్న నేరాలకింద పోలీసు కేసులు, తన్ను నట్టేట్లో ముంచే యత్నంలో ఆయన ఉన్నారంటున్న లక్ష్మి, మీడియా వాళ్ళూ ....... ఆయన, పూర్ణిమ బ్రతికినందుకు సంతోషించదగ్గ పరిస్థితులు లేవు. మీరైనా కాస్త ఆయన్ని సముదాయించండి, విశ్వం!" అన్నాడు.
      విశ్వనాథం కళ్ళు తుడుచుకుంటూ, "ఆ పని ఎలా చేయాలో మీరే చెప్పండి", అని అడిగాడు.
"మనదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత లేదు. సామాన్య ప్రజానీకం మానసిక అనారోగ్యం అంటే పిచ్చి అనుకుంటారు. భౌతిక అనారోగ్యానికి మందులున్నట్లే, మానసిక అనారోగ్యానికి కూడా మందులుంటాయి. ప్రతీ రుగ్మతకీ ఆసుపత్రిలో చేర్చి గొలుసులతో కట్టేస్తారనుకుంటే కల్ల. 'నా చేయి విరిగింది; ప్లాస్టర్ వేసుకుంటున్నాను', అని చెప్పే మనుషులు, ' నాకు మనసు బాగులేదు, కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళొచ్చాను', అని చెప్పడానికి వెనుకాడతారు. రావుగారు ఎవరైనా కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళి  ఉంటే ఇంతటి యత్నం చేసివుండేవారు కారేమో! అయినా, ఇప్పుడు ఏది వీలయితే అదే చేద్దాం. ఆయన తల్లిని వాళ్ళ తమ్ముడు తీసుకు వెళ్ళాడు. అటూ, ఇటూ పెద్దవాళ్ళతో మాట్లాడించి, లక్ష్మి చేత విడాకులిప్పించి, పోలీసు కేసు కొట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన చెల్లెలికి పిల్లలు లేరు. ఆవిడ పూర్ణిమని పెంచుకుంటానంది. మానసిక  వత్తిడి కాకపోతే, తల్లిని చూసుకునే తోబుట్టువులు, తన కూతుర్ని చూసుకోరా ఏం? మీరు ఆయనకు నచ్చే విషయాలు గుర్తు చేయండి. గుట్టుచప్పుడు కాకుండా ఆయన బదిలీకోసం ప్రయత్నించండి. కొంత  కాలంపాటు యీ ఊరు, దాని పరిసరాలకి ఆయన్ని దూరంగా ఉంచితే మంచిది."
**********************
   "సార్, ఓ తమాషా చూశారా? మీకూ, నాకూ ఒకే ఊరికి బదిలీ అయ్యింది. మీ మార్గదర్శకత్వంలో నా ఉద్యోగాన్ని మొదలెట్టిన వాణ్ణి. మీరెప్పుడు జాయినైతే నేనూ అప్పుడే!" అని స్వీట్ల డబ్బాని అందజేశాడు విశ్వనాథం.  చిరునవ్వు నవ్వుతూ అందుకున్నారు రావుగారు.
**********************
      "చోద్యం కాకపోతే ఈ అకాల బదిలీ ఏమిటండీ! కొత్త ఊరూ, కొత్త పరిసరాలూ, పిల్లలకి కొత్త స్కూళ్ళూ , స్నేహితులూను", అని విసుక్కుంటూ సామాన్లు సర్దుతోంది విశ్వనాథం శ్రీమతి. కేవలం మానవత్వం కోసమే ఈ బదిలీని నేత్తినేసుకున్నాడని అతను చెప్పలేదు.
**********************
ఇది కథే కనుక ఎలాగో సుఖాంతం చేశాను. నిజ జీవితంలో అన్నీ అలా వుండవుగా. అందుకే మీకు తెలిసిన వారు ఎవరైనా మానసిక వత్తిడి, రుగ్మతలకి లోనైతే, వారిని తప్పించుకోకుండా, వాళ్ళ జీవితంలో సంతోషం చిగురించడానికి మీకు చేతనైన సాయం చేస్తే నా యీ వ్రాత ధన్యమౌతుంది. క్లుప్తంగా చెప్పాలంటే,  మానసిక రోగాలు ముఖ్యంగా రెండు రకాలు - సాధారణ మానసిక రుగ్మతలు, మరియు తీవ్ర మానసిక రుగ్మతలు.ఇంకా వివిధ రకాలుగా కూడా విభజింపబడ్డాయి. చికిత్సలో కౌన్సిలింగ్, మందులు, ఆసుపత్రిలో చేర్పించడం, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (షాక్ ట్రీట్మెంట్) మొదలైనవి ఉంటాయి (అందరికీ అన్నీ అవసరం కానక్కరలేదు). వివరాల కొరకు "మెంటల్ డిసార్డర్" అని గానీ, "WHO మెంటల్ హెల్త్ " అని గానీ, గూగుల్లో టైపు చేసి చూడండి. మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. మరొక మనవి- ఈ రుగ్మతలలో స్వంత వైద్యం చాలా ప్రమాదకరం. ఎవరికైనా అవసరమైతే మానసిక వైద్యుణ్ణి గానీ, లేక కౌన్సిలర్ని గానీ సంప్రదించగలరు.

**********************
(concluded)

7 comments:

RAJESH YALLA said...

చాలా చక్కగా ముగించారు. నిజంగా ఆలోచింపచేసే కథ! అభినందనలు!!

RAJESH YALLA said...

చాలా చక్కగా ముగించారు. నిజంగా ఆలోచింపచేసే కథ! అభినందనలు!!

Mediocre to the Core said...

ty @rajesh!

Thinker said...

Maam, as usual a well written, complicated and thought provoking story! Unfortunately society is so judgmental about mentally sick. And you have illustrated very beautifully how even well educated people with all resources available to them are not exempted from this illness.
Great job!

Mediocre to the Core said...

thanks for your appreciation, Thinker! It means a lot to me!

Anonymous said...

The conclusion is great Surya. It's so true that mental health is a very neglected aspect in the overall health of a person. It's something which cannot be measured in normal circumstances. In a crisis it comes out. Beautifully written. You get these translated or do it yourself so you will have a wider following. All the best.

Mediocre to the Core said...

thank u Shanti! Reg. the translation, will try. The basic premise for writing in Telugu was that there was a greater need to reach out to a vernacular audience ( it could be a wrong perception, too!). At the moment, a no. of ideas are circulating in my head. Want to catch those toughts & give them a word- form before they run away from me!