Friday, May 20, 2016

ద్విగుణీకృతం


          ఆ రోజు ఫలితాలు వెల్లడౌతాయని తెలుసు. కానీ, సమయం తెలియదు. అలాగని నాలో ఆదుర్దా పెరగలేదు. బహుశః అది నా పరిణితికో, లేక నా పాండిత్యలేమికో చిహ్నమేమో! మరి, ఆ పరిణితి నేను చిన్నప్పుడే పొందానేమో! సాధారణంగా ఫలితాల రోజు నన్ను భయపెట్టేది కాదు. నేను ఆశించిన విధంగా మార్కులు రాకపోతే బాధపడేదాన్ని. అదెవరైనా పడే బాధే కదా! అందులో గొప్పేముంది?


          నేను ఒకే ఒకసారి ఫలితాల మీద బెంగ పెట్టుకున్నాను. అది నా జీవితాన్ని ఒక గాడిలో నడిపించే పరీక్ష. పరీక్ష ఎంత ఏడిపించిందంటే ‘ఫెయిల్ అయిపోతే బావుణ్ణు, ఓ పనైపోతుంది బాబూ’, అనిపించింది. కానీ, నాకు ఆ సంతోషం రాసిపెట్టి లేదేమో, నేను పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యాను! ఇప్పటి పరీక్ష అంత పెద్దది కానేకాదు!
          ఎండాకాలం కదా, కరెంటు పోయి, ఐదున్నరకి లేచాను. మరీ ముందు లేచినప్పుడు నాకు ఆ రోజంతా వేస్ట్ అయిపోవడం పరిపాటి. అందుకని, ఓ అరగంట పడుక్కుని లేద్దాంలే, అని నడుం వాల్చాను. లేచేటప్పటికి ఎనిమిదిన్నర! ఎంత అవమానం! అయ్య బాబోయ్, ఎన్ని పనులు తెముల్చుకుని బయటికెళ్ళాలి!
          ఈ లోగా ఫలితాల విషయం గుర్తుకు వచ్చింది. ఆ ఆలోచన అప్పుడే రావాలా? ఇంక, ఆలోచన రావడమే ఆలస్యం, ఆచరణలో పెట్టేశాను. లాప్ టాప్ ఆన్ చేశాను. అది బూట్ అవడానికి ఓ జీవితకాలం పట్టేట్టుంది. కొంపదీసి క్రాష్ అయ్యిందా?ఇంపాజిబుల్. ఈ మధ్యనే యాంటీ వైరస్ లోడ్ చేయించానుగా మరి !అయినా, ఇంత కాలం పట్టకూడదే! మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ ఫలితమా? ఏమో! ఈ మధ్య చాలా వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాను. మై వీడియోస్ ఫోల్డర్ ఎక్కువ జాగాని ఆక్రమించి ‘సి’ డ్రైవ్ లో తక్కువ చోటు ఉంది....నా సిస్టం స్లో అవుతోందని హెచ్చరికలొచ్చాయి. వాటిని లక్ష్య పెట్టనందుకు అది నన్నిలా దెబ్బ కొట్టిందా?ఎనిమిదిన్నరకే ఫలితాలు నెట్లో పెట్టేస్తారా? ఏమో, చూద్దాం!
          వెబ్ పేజి తెరుచుంది. ఫలితాలు లోపలి పేజీలో ఉన్నాయి, అనే మాటలు కనపడ్డాయి..డెబ్భై ఆరు పేజీలు.ఎక్కడని వెతకను? పోనీ, ఆ మాటలురాసున్న చోట హైపర్ లింక్ ఉందేమో? ఏమో! క్లిక్ చేశాను. తరువాతి పేజీకి వెళ్ళాను. ఒకదాని తరువాత ఒకటి వెదుకసాగాను. నాలుగో పేజిలో విషయ సూచిక ఉంది. హమ్మయ్య....తిన్నగా ఎనిమిదో పేజీకి వెళ్ళాను. అక్కడ మహామహుల పేర్లు, వారి గొప్పదనం కనబడ్డాయి. అలాంటి వారి మధ్య ఉండదగ్గ పేరా నాది? ఎస్, ఐ యాం రైట్. పోనీ సెకండ్ క్లాసులో నా పేరుంటుందా? ఏమో! నేను గనక ఫెయిల్ అయితే ఇంత టైం వృధా చెసినట్లే కదా!
పోనీ, ఆ ఫలితాలు ఎక్కడున్నాయో సూచనప్రాయంగా కూడా చెప్పబడలేదు. ఓసారి తొమ్మిదో పేజీలో ఉన్నాయేమో చూసి, లేకపోతే వెతకడంలో టైం వేస్టు చేయకుండా నా పని నేను చూసుకుందామనుకున్నాను. అంత సుళువుగా నాకు ముక్తి దొరకదు కదా! తొమ్మిదో పేజీలో మిగిలినవారి వివరాలున్నాయి. ఏకంగా నూట పద్దెనిమిదిమంది.
ఉంటేగింటే నా పేరు ఏ వందలోనో ఉంటుందనుకుని వెనుక నుండి చూడడం మొదలు పెట్టాను. నాలుగు వరసలున్నాయి. చిట్టచివరికి నాలుగో వరుసలో, చివరలో నా పేరు కనబడింది.  అంటే, మొదటి వరుసలో పైనే ఉందన్నమాట! దేవుడికి వెంటనే ధన్యవాదాలు చెప్పుకుని, గదిలోంచి బయటికి వచ్చాను. మా కుటుంబ సభ్యులతో ఈ విషయం పంచుకోవాలిగా!
“ఇవ్వాళ ఎగ్గొట్టే ప్రయత్నమా?”అన్నారొకరు.
“ఉహూఁ, హైస్పీడులో రెడీ అయిపోతా. మీరంతా నన్ను ఎందుకు లేపలేదు?”
“నువ్వు మాకు రోజూ పెట్టే బాధలు నీకు అర్థం అవాలంటే, మేము మా ఔన్నత్యాన్ని చాటుకోవాలి. అందుకే లేపలేదు”.
“బాగానే ఉంది మీ వరస. నాకు లేటయ్యే ప్రమాదం ఉంది కదా!”
“నీకు బుద్ధి చెప్పాలంటే అలాగే అవ్వాలిగా”.
“నా క్రమశిక్షణకి మీలో ఇంత కసి ఉంటుందని నేను గ్రహించలేదు”. ఇంతకీ వీళ్ళతో నా సంతోషాన్ని పంచుకోవలా, వద్దా?
“నా స్కూలుకి టైం అయ్యింది, అమ్మా. బై”.
“ఉండవే, ఒకానొకపరీక్షలో నేను ఉత్తీర్ణురాలినయ్యాను”.
“కంగ్రాట్స్ అమ్మా, బై.”
“ఆగవే, నెట్లో నా పేరు వచ్చింది. చూడు.”
“సాయంత్రం చూస్తాను లేమ్మా!”
“బై డియర్, కంగ్రాట్స్... ఆఫీసు నుండి ఒక అర్జెంటు ఫోన్ వచ్చింది. నా పని ముగించుకునేసరికి లేట్ అవుతుంది. రాత్రి నీ కథ చదివి నిన్ను మెచ్చుకుంటానులే!”
మరో అయిదు నిముషాల్లో ఇల్లంతా ఖాళీ. నేను త్వర త్వరగా తయారవుతే నేను టైం కి ఆఫీసుకి చేరుకోగలను. ఫోన్ అందుకుని బాస్ చరవాణికి లైన్ కలిపి. “గుడ్ మార్నింగ్ సార్... ఇవ్వాళ ఒక రోజు సెలవు కావాలండీ.... ఒక కథల పోటీలో నా కథ సాధారణ ప్రచురణకి ఎంపికయ్యింది...థాంక్ యూ సార్.. లేదండీ, బహుమతి గెలుచుకునే కథ రాసేంత పెద్ద రచయిత్రిని కాను నేను......మీరనుమతిస్తే ఈ సంతోషకరమైన విషయాన్ని ఇంట్లో పంచుకోవాలనుంది.....థాంక్స్ అ లాట్, సార్”.
సంతోషాన్ని పంచుకుంటే గుణింపబడుతుందంటారు..... అందుకని, అర్జంటుగా నాతోనే నా సంతోషాన్ని పంచుకుని, దాన్నిద్విగుణీకృతం చేసుకున్నాను.

***

No comments: