పన్నీరు
చల్లడానికి రెడీగా ఉన్నట్టుంది ఆ మధ్యాహ్నపు ఆకాశం. వరలక్ష్మీ వ్రతం రోజు శ్రావణ
మేఘాలు వర్షిస్తే అమ్మవారి ఆశీస్సులు అందుతాయని కొందరు నమ్ముతారు. వాళ్ళలో
విశాఖపట్నంలో ఒక మూడు వాటాల ఇంట్లో ఉండే ముగ్గురు మధ్య తరగతి స్త్రీలు ఉన్నారు. మొదట వాళ్ళందరిలోనూ చిన్నదైన సవిత పెరట్లోకి
వెళ్ళింది, బట్టలు తీయడానికి. రెండు గంటల సమయంలో పనిమనిషి ఉండదుగా! తరువాత వచ్చిన
వనిత, బట్టలు తీస్తూనే, “ఏం, సవితా! పూజంతా చక్కగా అయినట్టేనా? ఎన్ని ఐటమ్స్
నైవేద్యం పెట్టావేమిటి?” అని అడిగింది. “ అబ్బే, మూడే వనిత వదినా!” అని సవిత
జవాబిచ్చింది. “ఏమిటీ, మీరు వచ్చే ఏడాదికి ముచ్చటగా ముగ్గురవాలనా?” అని వనిత
అడిగితే, “అంతకన్నా వేరే భాగ్యముందా?” అంది సవిత. ఆ మాటలతోటే ఆలోచనలో పడింది.
ఇప్పటికి తనకి రెండు సార్లు గర్భం నిలువలేదు. తన భర్త సారంగ్ మెకానికల్ ఇంజినీర్.
అది ఆర్ధికమాంద్య కాలం కనుక అతను పనిచేసే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులందరికీ జీతాలు
తగ్గించబడ్డాయి. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ
ఎదుగూ- బొదుగూ లేని జీవితం అంటే విసిగిపోయి, వాళ్ళు ఒక
జాతకబ్రహ్మని ఆశ్రయించారు. ఆయన వాళ్ళ ఇద్దరి జాతకాలూ చూసి, వచ్చే అమావస్యకి సవిత
నక్షత్రానికి పట్టే సూర్య గ్రహణం తరువాత వాళ్ళ చీకటి జీవితంలో వెలుగులు చోటు చేసుకుంటాయని జోస్యం
చెప్పాడు. ఆ మంచి రోజులకోసం
వాళ్ళు ఎదురు చూస్తున్నారు.