Monday, February 20, 2017

ఎంబీ వద్దు- జీబీ ముద్దు

(published in a magazine meant for private circulation)
          ‘ఛీ, నాదెంత పనికిమాలిన బ్రతుకు, ముచ్చటగా మూడో సారి కూడా నా వీసా రిజెక్ట్ అయిపొయింది’, అని తిట్టుకున్నాడు సామంత్. “అదే దేవుడుగనుక కనిపిస్తేనా, ఛెడా మడా కడిగేద్దును”, అనుకుంటూ తన కష్టాన్ని మరచిపోడానికి నిద్రకుపక్రమించాడు.
నిద్ర పట్టీ పట్టనట్టుండే తరుణంలో తన గదంతా వెలుగుతో నిండిపోయింది. మెరిసిపోయే మేనితో, తలతలలాడే దుస్తులతో, నగలతో ఒక సుందరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే నేను అమెరికా వెళ్ళిపోయానా, అనుకున్నాడు సామంత్. మళ్ళీ, ఇదేమిటి, ఈ తెల్ల దొర మన నాటకాలూ, సినిమాల్లో దేవుడిలా ఉన్నాడు, అని ఆశ్చర్యపోయాడు. అంతలోనే ఒక ఆలోచన వచ్చింది- మన దేవుళ్ళు నల్లగా అయినా ఉంటారు, లేకపోతే నాలుగు తలలతో ఉంటారు, లేక జటాజూటం, పాము వగైరాలతో ఉంటారు. ఈయన జస్ట్, ఒక తల, తెల్లని మేనూ, కిరీటంతో ఉన్నారంటే కొంపదీసి ఏ ఇంద్రుడో, గంధర్వుడో కాదు కదా! నాకు వైరం దేవుడితో కదా! అయన నన్ను పక్కదారి పట్టించడానికి ఈ మనిషిని గాని పంపలేదుగా! అయినా తన పిచ్చిగానీ, పురుషులను పక్కదోవ పట్టించాలంటే ఏ మేనకనో, ఊర్వశినో పంపాలి గాని, ఈ సుందరంగుడెవరు? ఎందుకు నాకు దర్శనమిస్తున్నారు? వెయిట్, వెయిట్....అసలు దేవుడు ఎప్పుడూ డైరెక్ట్ గా వచ్చి తేల్చుకుంటాడు గాని ఈ హైజాకింగ్ చేయడు కదా! అవన్నీ ఇంద్రుడి తెలివితేటలు. ఏమిటో బుర్ర పేలిపోతోంది......
ఈ లోగా ఆ సుందరాంగుడు సామంత్ ని పలుకరించాడు. వాళ్ళిద్దరి మధ్య నడిచిన సంభాషణ ఎలా జరిగిందంటే.....
సుం: హహహ సామంతూ, పేరులోనే సామంతుడివి. అమెరికా వెళ్ళి ఏక ఛత్రాధిపతివైపోదామనే?
సా: సామంతుడు అంటే.....ఎస్ .... గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూశాను. తెలుసు. మా మమ్మీ డాడీలు స్టైల్ గా ఉందని ఈ పేరు పెడితే, దాని అచ్చ తెలుగు అర్థం చెప్పి నన్ను అవమానిస్తున్నారా?
సుం: నువ్వేమిటో నీకు తెలియజేద్దామని...
సా: నీ భక్తుణ్ణైన నేనేమిటో నీకు తెలియదూ..... అవునూ, జస్ట్ ఫర్ క్లారిటీ, నువ్వెవరు?
సుం: ఓరి తిక్కేశ్వరా, నా భక్తుణ్ణంటావ్, నేనెవరో నీకు తెలియదూ?
సా: ఇదిగో, ఇది రియల్ లైఫ్. సినిమాలో ఎమ్మెస్ నారాయణ సునీల్ ని ఆటపట్టించినట్టు చేయకూడదు. తూచ్. 
సుం: ఇందాక నన్ను కడిగేస్తానన్నావుగా...
సా (సంతోషంగా): ఓ నువ్వు దేవుడివేనా! థాంక్స్. (ఆలోచిస్తూ).... నాకూ ఒక డౌట్ ఉంది. నువ్వు ఏ దేవుడివి?
సుం: నేను ఒక్కడినే. నేను పరమాత్మను. ఎవరికి ఏ పేరు తోస్తే, ఆ పేరుతో పిలుస్తారు. అన్ని మతాల వాళ్ళూ నా పిల్లలే.
సా: నాకు తెలిసిన దేవుళ్ళలా నువ్వు లేవే! పరమాత్మని అంటున్నావ్, కొంపదీసి దెయ్యాలు కూడా నీ నుండే పుట్టాయా?
సుం: నీకు సినిమాల మీద ఉండే మోజు నా మీద లేదు. అందుకే పరమాత్మంటే దెయ్యలతో ముడి పెడుతున్నావ్.
సా: ఓ, అలాగా! భక్తులు చిన్నా చితకా తప్పులు చేస్తే దేవుడు సర్దుకోవాలి. ప్లీజ్.
సుం: సరే, నీ విషయానికి రా. ఎందుకు నా మీద అంత కోపం?
సా: దేవా! మూడు సార్లు వీసా రిజెక్ట్ అయ్యేవాడికి అమెరికా వెళ్ళడానికింకా ఛాన్సుందేమో గానీ చుట్టుపక్కల వాళ్ళ ముందు వాడి బతుకు కుక్క కన్నా హీనం. నేనేం పాపం చేశానని నాకీ శిక్ష?
సుం: నువ్వేం ఊడబొడిచావని నీకు వీసా రావాలి?
సా: ఎందుకేమిటి? నేను ఇంజనీరింగు పాస్ అయ్యాను కాబట్టి. అందరిలానే అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి. 
సుం: మీ దేశంలో మగవాడిగా పుడితే చాలు, పిల్లనిచ్చే పనికిమాలిన తండ్రులున్నారు. అది మనసులో పెట్టుకుని అమెరికా వెళ్ళడం నీ జన్మ హక్కనుకుంటున్నావా?
సా: ఎన్ని సార్లడుగుతావు స్వామీ! ఇంజనీరింగు పాస్ అయ్యాను గనుక, అదీ జీఆర్ ఈ లో మంచి మర్కులొచ్చాయి గనుక.
సుం: నువ్వసలు ఇంజనీరింగ్ ఎలా చేశావు?
సా: ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది గనుక.
సుం: నీకు ఆ మంచి రాంక్ ఎలా వచ్చింది?
సా: మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చదివాను కాబట్టి.
సుం: అక్కడ నీకు సీట్ నీ మార్కుల వల్ల వచ్చిందా!
సా: పెద్ద తెలియనట్టు అన్నీ అడుగుతావేమిటి స్వామీ! ఏదో ఫ్లూక్ లో వచ్చింది, మూడో లిస్టులో.
సుం: అదైనా ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకో!
సా: ఫ్లూక్ అన్నానుగా.... నో నో మా మమ్మీ నా సీట్ కోసం ఏడాదిపాటు సోమవారాలు పూర్తి ఉపవాసం మొక్కుకుంటే వచ్చింది.
సుం: దారిలోకొస్తున్నావయ్యా! అంటే మీ అమ్మ తన సోమవారాన్ని నాకు త్యాగం చేసి సంపాదించింది అవునా?
సా: అవును స్వామీ!
సుం: మరి ఇంజనీరింగ్ లో  నీది ఫ్రీ సీటా, పైడ్ సీటా?
సా: పైడే స్వామీ! ఫ్రీ సీట్ వీధి చివరనుండే కాలేజీలో వచ్చేటట్టుంటేనూ..
సుం: అప్పుడేమిటి మొక్కు?
సా: మా డాడీ రామాలయంలో వెండి తొడుగు చేయించారు.
సుం: కదా!
సా: అర్థమయ్యింది స్వామీ. నీకు ఏదో ఒకటి కావాలి. ఈ మాటు కూడా వీసా కోసం నేను తిరుపతి కొండ కాలి నడకన ఎక్కి, దిగుతానని మొక్కుకున్నాగా! (ఆలోచిస్తూ) నీకది సరిపోయినట్టు లేదు. పోనీ, చిలుకూరు వెళ్ళి నూటెనిమిది ప్రదక్షిణాలు చెయ్యమంటావా?
సుం: నోర్ముయ్.
సా: (భయపడుతూ) ఎందుకు స్వామీ ఆ కోపం?
సుం: సరిగ్గా చదవకుండా నాతో వ్యాపారం చెయ్యజూస్తారట్రా మీరంతా?
సా: ఇందులో తప్పేముంది స్వామీ. అందరూ కష్టాల్లో ఉన్నప్పుడు మొక్కుకుంటారు కదా!
సుం: కష్టం వేరు. నువ్వు సోంబేరిలా సరిగ్గా చదవకుండా నాతో బేరమాడి మేనేజ్ చేస్తున్నావు. బాధ్యత తెలుసుకుని మసలలేని నీకు ఎంతకాలమని వరాలిస్తాననుకున్నావ్?
సా: (మౌనం)
సుం: మూర్ఖులు మొక్కులతోను, బేరసారాలతోను నన్ను కొనాలనుకుంటారు. నేను వరాలిస్తే, అది వాళ్ళు నాకిచ్చిన వాటాల వల్ల వచ్చిందనుకుంటారు. నేను సాయం చేస్తానుగానీ వాళ్ళలో మంచి మార్పును కోరుకుంటాను. మారిన వాళ్ళని విజయమెప్పుడూ వరిస్తుంది. అప్పుడప్పుడూ ఉత్తీర్ణులవకపోయినా వాళ్ళు నీరుగారిపోరు. వాళ్ళని వెన్నంటి ఉంటాన్నేను.
సా: (మౌనం)
సుం: ఒక చిన్న పరీక్ష పెడతాన్నీకు. కంప్యూటర్ ఇంజనీర్ వి కదా! అసలు ఎంబీ, జీబీ అంటే తెలుసురా నీకు?
సా: నువ్వు పరీక్ష పెట్టబోతుంటే ఏవో కష్టమైనవీ, నాకు తెలియనివీ పరిక్షా పేపర్ సెట్టర్ లా అడుగుతావనుకున్నా! ఇవి చెప్పడానికి కంప్యూటర్ ఇంజనీర్ అవక్కర్లేదు. ఎవరినడిగినా చెప్తారు. మెగాబైట్, గిగాబైట్.
సుం: తప్పులో కాలేశావురా. నీకర్థమయ్యే భాషలో భక్తి గురించి బోధించబోతే నువ్వు చంటి పిల్లల జవబిస్తావురా? ఎంబీ అంటే మూర్ఖ భక్తి. అంటే ఇన్నాళ్ళూ నువ్వు నాకు చూపించినది. జీబీ అంటే జ్ఞాన భక్తి. నేను నా భక్తుల్లో కోరుకునేది. సో, ఇప్పటికైనా, ఎంబీని వదిలి, జీబీ అలవరచుకో. అమెరికా వెళ్ళినా, వెళ్లకపోయినా బాగుపడతావు!
సా: ధన్యోస్మి స్వామీ, ధన్యోస్మి! నేను నోటి దురుసుతో నిన్నేదో అంటే, నువ్వు నన్ను చెడా-మడా కడిగేసి నా పాప ప్రక్షాళన చేశావు!
.....అంటూ సామంత్ సుందరాంగుడి కాళ్ళపై పడ్డాడు. తీరా లేచి చూస్తే, తను మంచంమీంచి దొర్లి కిందికి బొక్కబోర్లా పడ్డాడని తెలుసుకున్నాడు! తన అనుభవం నిజమో, కలయో దేవుడెరుగు గాని, వ్యర్థ ప్రయాసలకు పోకుండా తన త్రాణకు తగ్గ ఉద్యోగం వెతుక్కోవడం మొదలెట్టాడు. ఎంబీ వద్దు- జీబీ ముద్దు అనే జీవిత సత్యాన్ని సతతం మననం చేసుకునేవాడు.
***

                                         

No comments: