1. 1. చిన్నప్పుడు స్నేహితురాలికి
నాట్య ప్రదర్శన కోసం పట్టుపరికిణీ ఇస్తే చింపి తెచ్చింది
తను చేసిన తప్పుకి
ఇసుమంతైనా బాధ పడలేదు.
2. యుక్త వయస్సులో నమ్మిన వాడు
వెన్నుపోటు పొడిచి డబ్బుకమ్ముడుపోయాడు
తను నన్ను పవిత్రంగా చూశాడు
గనుక ఇంకేం కావాలన్నాడు.
3. నాకు చాలా ప్రీతిపాత్రమైన
గాంధీజీ ఆత్మకథ ఒకరికరువిస్తే అది తిరిగి రాలేదు
పైపెచ్చు ‘పుస్తకం, వనిత,
విత్తం’ సామెత నాకు ఉద్బోదించబడింది.
4. మొదటి జీతంతో కొనుక్కున్న
కెమెరా ఒక హనీమూన్ జంటకి అరువిచ్చాను
వాళ్ళు దాన్ని పోగొట్టి,
నేనడిగే వరకూ అ సంగతే మరచిపోయారు.
5. తగిలిన ఈ దెబ్బలకి నాకు నమ్మకంపై నమ్మకం
పోయింది
అందరినీ అనుమానించే జీవితం
దుర్భరం కదా!
ఎదురుదెబ్బల కన్నా నమ్మాలా,
వద్దా అన్న సందిగ్ధం నన్ను ఎక్కువ బాధించింది
నా జీవితం కారు చీకటైపోయినట్టుంది.
6. చాలా రోజులు ఈ చీకటిలో దారి
వెదుకజూశాను
ఎటు వెళ్ళినా అడ్డంకులనే
ఎదుర్కున్నాను
ఫలించని నా ప్రయత్నాలకి
వేసారి, రేపటికి ఎదో ఒక దారి చూపమని దేవుణ్ణి ప్రార్థించాను
ఆయన నా మనసులోకి తొంగి చూసే
దారి చూపాడు.
7. పోయే యోగమో, విరిగే యోగమో
ఉంటే మనిషితో నిమిత్తం లేకుండా జరుగుతాయని తెలుసుకున్నాను
నిమిత్త మాత్రులైన మిగతా
వారిని వేలెత్తి చూపడం తప్పని గ్రహించాను
నమ్మకమే బంధాలకి పునాది
అన్న విషయం తేటతెల్లమయ్యింది
అకస్మాత్తుగా నా జీవితం
కాంతివంతమయ్యింది.
***
No comments:
Post a Comment