Sunday, April 23, 2017

చిట్టి కథ keywords" అతను/ ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు ..."- వుడా పార్కు వృద్ధ గురువు



గృహిణినైన నేను రోజూ సాయంత్రం నాలుగున్నర- ఐదున్నర గంటల మధ్య కొత్త వుడా పార్కు లోని వాకర్స్ పారడైస్ లో నడవడం అలవాటు. ఒకపక్క పనిమనిషి పనైపోతుంది, మరోపక్క మా వారూ, పిల్లలూ రావడానికి ఆరు దాటుతుంది. ఒక రోజు కాస్త నిస్త్రాణగా అనిపించి, ఒక బెంచి మీద కూర్చున్నాను. సాయంకాలపు పిల్లగాలులు సముద్రం నుండి వీస్తాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ పని ఇదివరకెన్నడూ ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నంతలో ఒక వృద్ధుల సమూహం వచ్చి మిగతా బెంచీల మీద స్థిర పడ్డారు.

వాళ్ళ వాలకాన్ని బట్టి వాళ్ళకిది అలవాటని అర్థమయ్యింది. వాళ్ళలో  చాలా మంది ప్యాంటు, షర్టు, చెప్పులు వేసుకున్నారు. మరి కొందరు నడవడానికి సుళువుగా ఉండే షూస్ వేసుకున్నారు. వాళ్ళంతా “గురువు గారు” అని సంబోధించే వ్యక్తి మాత్రం తెల్లటి నేతపంచె బిళ్ళాగోచీ పెట్టుకుని మరీ వచ్చారు. ఈ రోజుల్లో ఆ వేషధారణ కొంత వింతగా అనిపించింది. సరే, ఈయన ఎందుకు గురువయ్యారో చూద్దామని ఆగాను. ఆయన తన జీవితంలో మంచికీ చెడుకీ జరిగిన సంఘర్షణల గురించి చెప్పి, తాను మంచి వైపు మొగ్గినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మన జీవన విధానం మెరుగుపరచుకోవచ్చు గానీ అత్యాశకి పోరాదని హెచ్చరించారు. ‘ప్రాక్టికల్’ మనుషులతో నిండిన ఈ ప్రపంచంలో మంచి వైపు నిలబడే మనిషి కనిపించడం నా మనసుకు ఊరటనిచ్చింది. ఇంటికెళ్ళి మా వాళ్ళతో ఆయన గురించి చెప్పాను. వాళ్ళు ఆయన్ని పరిచయం చేయమని ఒకటే గొడవ. నేను రోజూ వాళ్ళ సంభాషణలు విని అమితానందం పొందేదాన్ని. ఈ లోగా అందరికీ సెలవైన ఆదివారం రానే వచ్చింది. కానీ, అక్కడ ఆ కూటమి సభ్యులెవరూ లేరు. ఓ నాలుగు రోజుల తరువాత వాళ్ళలో కొందరు కనిపించారు. కనుక్కుంటే, పెద్దాయనకి గుండె పోటు వచ్చిందని, ఇవ్వాళే ఆయన్ని సెవెన్ హిల్స్ నుండి డిశ్చార్జ్ చేశారని తెలిసింది. ఆయనకి విశ్రాంతి అవసరం కనుక వాళ్ళ అబ్బాయి, కోడలు ఆయన్ని కొన్నాళ్ళ పాటు బయటకి పంపరని కూడా తెలిసింది.
        అప్పటి నుంచి నా ఈవెనింగ్ వాక్ లో ఎదో వెలితి. మొన్న మొన్నటి దాకా లేని ఈ వెలితి ఇప్పుడెందుకొచ్చింది? అయన పంచిన మంచితనం వల్ల. పోనీ, ఆయన్ని పరామర్శించి ఆయన ఆశీర్వాదం పొందితేనో? ఊహూఁ, ఇన్నాళ్ళూ ఒక ప్రేక్షకురాలిగా ఆయన్ను గమనించానుగానీ, ఆయనతో ముఖపరిచయమైనా లేదు. ఈ విషయం మా అయన, పిల్లలతో చర్చించి, ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, అని దేవుణ్ణి ప్రార్థించాను.
****

No comments: