అంతకు ముందు- ఆ తర్వాత
బాంబు పేలే ముందు ఆమె ఒక
ఆకతాయి ఆడపిల్ల
ఆ తరువాత ఆమె ఒక
స్ఫూర్తిదాత.
బాంబు పేలే ముందు ఆమె ఒక సగటు
విద్యార్థిని
ఆ తరువాత ఆమె రికార్డు
బద్దలుకొట్టిన ఒక ఉత్తమ విద్యార్థిని.
బాంబు పేలే ముందు ఆమె మామూలుగా
వ్రాసేది
ఆ తరువాత ఆమె డిక్టేట్
చేసేది, లేక ఒక వేలుతో టైపు చేసేది.
బాంబు పేలే ముందు ఆమె అందంగా
కనిపించాలనుకునే కోట్ల మందిలో ఒకరు
ఆ తరువాత ఆమె దివ్యాంగులకై
మోడలింగ్ చేసిన కొద్దిపాటి స్త్రీలలో ఒకరు.
బాంబు పేలే ముందు ఆమె ‘తను-తనలోక’మనే
గిరి గీసుకున్న సగటు మనిషి
ఆ తరువాత ఆమె దివ్యాంగుల
సంక్షేమానికై పాటు పడే మహా మనీషి.
బాంబు పేలే ముందు ఆమె డా||
అబ్దుల్ కలాం గారి గురించి విని ఉంది
ఆ తరువాత ఆమె ఆయనను
కలుసుకుని, అయన మెప్పు పొందింది.
బాంబు పేలే ముందు ఆమె ఐక్యరాజ్యసమితి
గురించి విని ఉంది
ఆ తరువాత ఆమె ఐక్యరాజ్య
సమితినే ఉద్దేశించి ప్రసంగించే అవకాశాన్ని దక్కించుకుంది.
బాంబు పేలే ముందు ఆమె అందరిలాగా
సాధారణ జీవితం గడిపింది
ఆ తరువాత ఆమె అందరికీ
ఆదర్శప్రాయమయ్యే జీవితాన్ని గడుపుతోంది.
బాంబు పేలే ముందు ఆమెకు వైకల్యం
తెచ్చిపెట్టే పలువ్యధల గురించి తెలియలేదు
ఆ తరువాత ఆమె వైకల్యమంటే
కష్టమేమిటో తెలుసుకుంది.
బాంబు పేలే ముందు ఆమె అంగవైకల్యముంటే
జీవితం దుర్భరమనుకుంది
ఆ తరువాత తనకు అసాధారణ
కీర్తి తెచ్చిన ఆ వైకల్యానికి ధన్యవాదాలు చెప్పుకుంది.
వైకల్యం ఉంటే పెళ్ళికాదని
లోకం కోడై కూసింది
వైకల్యం ఉన్నా తగు మంచి వాడు
దొరుకుతాడని ఆమె నిరూపించింది.
బాంబు పేలే ముందు ఆమె వైకల్యమంటే
ఒక రకమైన కష్టమనుకుంది
ఆ తరువాత తప్పుడు వైఖరి
కన్నా వైకల్యం లేదన్న మాటలోని నిజాన్ని తెలుసుకుంది.
తన దివ్యాంగాన్ని
అంగీకరించే ముందు ఆమెకు తన స్థితిపై జాలి వేసింది
ఆ తరువాత ఆమెకు
స్థితప్రజ్ఞత సిద్ధించింది.
ఆమె పేరు మాళవిక అయ్యర్
అప్పటికీ ఇప్పటికీ మారనిది
కోటి దీపాలని వెలిగించగలిగే
ఆ నిష్కల్మషమైన చిరునవ్వు.
************
No comments:
Post a Comment