Saturday, April 7, 2018

గద్య పూరణము- గుంటూరు శేషేంద్ర శర్మ గారి "నా దేశం నా ప్రజలు" కవితా సంపుటి వరుస



శిక్షణ
1.     పసి పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే పోషక పదార్థాల్లా, శిక్షణకోసం అధికారులు వస్తే, వృత్తిలో ఎదుగుదలకి కావలసిన నైపుణ్యాన్ని ప్రసాదింపజేశాను. పసిపిల్లలకి నీతి కథలు చెప్పినట్టు, వాళ్ళ ఉగ్గుపాలలో విలువల తేనెని కలిపి, తాగించాను.


జ్ఞానం

2.     అజ్ఞానాంధకారాన్ని చీల్చుకుని సూర్యుడు జ్ఞాన వెలుగుని ప్రసరింపజేశాడు. ఆ వెచ్చదనానికి మనిషి మెదడులో బిగుసుకుపోయిన మూర్ఖత్వం కరిగి, తర్వాత వేడెక్కిన సూర్యుడి కిరణాలకి అవిరయ్యింది.

పడవమునక

3.     చిన్నప్పుడు వాననీటిలో వదిలిన కాగితపు పడవలు మునిగితే ఏడవలేదు; ఇప్పుడు సంసారసాగరంలో బాధ్యతల బరువు మోయలేని నా నావ మునిగేటట్టుంటే, ఏడుస్తే తగునా? స్థితప్రజ్ఞతతో ఉండాలి గాని.

నక్షత్రాలు

4.     నా ప్రేమికను చూస్తే, నక్షత్రాలన్నీ నా రెండు కళ్ళలోను ఇమిడి జిగేలుమంటాయి. అవే నక్షత్రాలు ఆమె నవ్వినప్పుడు ముప్ఫై-రెండు పళ్ళలో ఇముడుతాయిదేమి చోద్యమో?

దర్శనం
5.     నలుపు-తెలుపుల్లో ఇప్పుడు దర్శనమిస్తేనేం? నేను అనుభవించినప్పుడు నా బాల్యం ఇంద్రధనుస్సు వర్ణాలలో నిండి దర్శనమిచ్చేది.

జలపాతం

6.     పైనుంచి దూకే జలపాతాన్ని, చూసి మురిసిపోతే సరిపోదు. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారికి ప్రేమను పంచాలి, జలపాతమంత ఉన్నతంగా!
*********

No comments: