Friday, March 30, 2018

చిట్టి కథ - Sentence- " తప్పు అయిందని ఒప్పుకున్న తర్వాత కూడా చెప్పుతో కొట్టి మాట్లాడినట్టు బాధించడం గొప్ప సంస్కారమా...చెప్పండి "--అదిగో పులి, ఇదిగో తోక



అదిగో పులి, ఇదిగో తోక
అది 1979వ సంవత్సరం. స్కైల్యాబ్ అనే ఒక ఉపగ్రహం కూలిపోతోందని రేడియోలో ఒకటే హోరు. ‘అదిగో పులి, ఇదిగో తోక' అన్న రీతిలో ఆ వూళ్ళో పడుతుంది, ఈ రాష్ట్రంలో పడుతుంది- అని ఒకటే పుకార్లు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని తికమకలో అంతా ఉన్నారు. కొందరు ఢిల్లీలో పడుతుందన్నారు, మరి కొందరు మద్రాసులో.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు....
        కొందరు పిల్లలు రాజమండ్రిలో ఆడుకుంటున్నారు. వేసవి కాబట్టి ఆ ఇంటికి కూతుళ్ళు మనవలతో సహా వచ్చేసారు, అనంతపురం, విజయనగరం, విజయవాడల నుండి. వాళ్ళ పిల్లలే, పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్నారు. పక్కింటి అబ్బాయి, “స్కైల్యాబ్ ఆంధ్ర ప్రదేశ్ మీద పడుతుందట.... ఏ ఊరో తెలియలేదు”, అని ప్రకటించాడు. పిల్లల్లో కలకలం బయలుదేరింది. వాళ్ళ నాన్నలు వేరే ఊళ్ళల్లో ఉన్నారు కదా! అక్కడ పడితే వీళ్ళు మిగిలిపోతారు; ఇక్కడ పడితే వాళ్ళు మిగిలిపోతారు. ఈ భయంతో ఉన్న పిల్ల పదేళ్ళ విజయనగరం అమ్మాయి సాగరిక. హడావుడిగా లోపలికి పరుగెత్తి, వాళ్ళమ్మతో, “అమ్మా, స్కైల్యాబ్ అనంతపూర్ మీద పడుతుందట. పదమ్మా, విజయనగరం వెళ్ళిపోదాం”, అంది కంగారుగా. పక్కనే ఉన్న అనంతపురం పిన్ని, “ఏమి స్వార్థమే నీకు? స్కైల్యాబ్ అనంతపురంలో పడితే, మేమంతా మట్టిలో కలిసిపోవచ్చు, మీరు మాత్రం విజయనగరంలో క్షేమంగా ఉండాలి... అంతేనా?” అని, గొంతెత్తి అరవడం మొదలెట్టింది. సాగరిక తను కంగారులో చేసిన తప్పు తెలుసుకొని, “సారీ పిన్నీ, ఆంధ్ర ప్రదేశ్ అనబోయి అనంతపూర్ అన్నాను. బతికినా, పోయినా కలిసుండాలని అలా అన్నాను”, అంది. కానీ పిన్ని వదలలేదు. “నీకు మా మీద అక్కసు... మేం చచ్చిపోతే ఆనందం... చిన్న పిల్లవైనా ఎంత అతి తెలివి?” అని అరుస్తూనే ఉంది పిన్ని. “అమ్మా, నిజంగా నాకలాంటి కుళ్ళు బుద్ధులు లేవమ్మా, పిన్నితో చెప్పమ్మా ప్లీజ్..”, అని ఏడుపు లంకించుకుంది సాగరిక. “చిన్న పిల్ల కదే, ఎదో కంగారులో నోరు తడబడుంటుంది. అది సారీ చెప్పింది కదా, వదిలెయ్యవే”, అంది సాగరిక వాళ్ళ అమ్మ, తన చెల్లితో. “వేలెడంత లేదు, ఇంత పొగరా, అనుకున్నా. ఇదంతా నీ అండ చూసుకునే కదక్కా...”, ఇంకా ఏదో చెప్పబోతున్న చెల్లిని ఆపి, "తప్పు అయిందని ఒప్పుకున్న తర్వాత కూడా చెప్పుతో కొట్టి మాట్లాడినట్టు బాధించడం గొప్ప సంస్కారమా...చెప్పు", అనేసరికి చేసేది లేక మౌనంగా ఉండిపోయింది చెల్లి.
**********


No comments: