విజయ దరహాసమంటే?
ఆ రోజు ఎంసెట్ పరీక్ష.
పిల్లల కోసం దణ్ణం పెట్టుకోవడానికి గుడికి వచ్చారు. మహేష్ తల్లి, “మా వాడికి సీట్
ఇప్పిస్తే దేవుడికి బంగారు తొడుగు చేయిస్తానని మొక్కుకున్నాను. మరి మీరేం
మొక్కుకున్నారు?” అని సురేష్ తల్లిని అడిగింది. “అత్యుత్తమమైన పిల్లలకి
ఉత్తీర్ణతనివ్వమని”, అని ముక్తసరిగా జవాబిచ్చి సెలవు తీసుకుంది సురేష్ తల్లి.
ఫలితాల రోజున సురేష్ కి వెయ్యి చిల్లర రాంక్ వస్తే, మహేష్ కి పిన్ కోడ్ లాంటి రాంక్
వచ్చింది. ఎక్కడో మారు మూల కాలేజీలో కంప్యూటర్ చదివే బదులు ఉన్న ఊళ్ళో ఎలక్ట్రానిక్స్
చదివితే మంచిదనుకుని సురేష్ అలాగే చేశాడు. మహేష్ ని మాత్రం బోలెడు కట్నం (అదే...డొనేషన్)
ఇచ్చి, ఎక్కడో కర్ణాటకలో సివిల్ ఇంజనీరింగ్ చదివించారు. చదువుకి
బయలుదేరబోతున్న మహేష్ ని కలిశాడు సురేష్. సందేశాన్నిస్తున్న వాడిలా, "మన దారులు వేరైనా గమ్యం ఒక్కటే...
కలుసుకుందాం తప్పకుండా ఒకరోజు విజయ దరహాసంతో," అని బయలుదేరాడు మహేష్.
దేవుడికి బంగారు తొడుగు ఏర్పాటయ్యింది.