Wednesday, November 16, 2016

ఆ నవ్వుల కోసమే


1.     ఆనాడు అభిమానంతో పలకరించిన నీ చిరునవ్వు
చేసుకుంది నా మనసుని నీ వశం
నిండుగా నవ్వే నీ చందమామ ముఖం
చూసి మైమరచిపోవడమే ప్రేమికుడిగా నా ఘనకార్యం.


2.     మరుజన్మనెత్తి మన పాపని చూపినప్పుడు గర్వంతో కూడిన నీ నవ్వు
వెతికించింది ఆ బోసినవ్వులలో నీ నవ్వుల పోలికల్ని
ప్రయోజకురాలైన కూతురి విజయోత్సాహంలో సంతృప్తితో నవ్విన నీ నవ్వు
మన పెళ్ళి సార్థకమైన ప్రతీకగా తెచ్చింది నా ముఖాన చిరునవ్వుని.

3.     వయసుతోపాటొచ్చే అనారోగ్యం కృంగదీయలేదు మన సంతోషాన్ని
ఆసుపత్రి వాతావరణం చెరపలేదు నీ నవ్వుని
ఎందుకంటే, నా గుండె లోతుల్లో దాచుకున్న నీ నవ్వులన్నిటినీ
వెలికి తీసి గుర్తు చేస్తాను నీకు!
4.     మన సహచర్యంలో మనకు సంతోషాన్నిచ్చిన ఘట్టాలని
గుర్తు చేస్తే రాదా నీకు నవ్వు?
నీకిష్టమైన హాస్యపు ఘట్టాన్ని నెమరు వేసుకుంటే
పూయదా నీ ముఖాన నవ్వు పువ్వు?
5.     పళ్ళూడిన పండు వయసులో నాకింకా ఆయుర్దాయమెందుకు?
నీ ముఖారవిందాన వికసించే, వికసింపచేయబోయే ఆ నవ్వుల కోసమే కదా!

***

No comments: