తప్పిదం
భామ, గోపి ఇంజనీరింగ్
చదువుతున్నారు. ఎంసెట్ లోనూ, ప్రతీ సెమ్ లోనూ కూడా భామకే మొదటి స్థానం లభించేది.
వాళ్ళు పెద్ద స్నేహితులు కారు గానీ ఒకరికొకరు ఆరోగ్యకరమైన పోటీనిచ్చుకునేవారు.
అలాంటిది, నాలుగో యేడు పూర్తయ్యాక మొత్తానికి అతనికి మొదటి స్థానం వచ్చిందట! ఆ
విషయం అతనే స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పాడు. సెక్షన్ లో కనుక్కుంటే చెప్పారట
అనధికారికంగా.
ప్రతీ సెమ్ లోనూ ఫలితాలు ముందు అనధికారికంగా తెలిసేవి. అధికారికంగా
తెలిశాక అవే నిజమయ్యేవి. భామ అవాక్కైపోయింది. ఏడు సెమ్ లలో మొదటి స్థానంలో నిలచిన తనకి
ఈ గతి పట్టడమేమిటి? రెండవ స్థానానికి చేరుకోవాలంటే ఆఖరి సెమ్ లో పరీక్షలు బాగా
వ్రాసి ఉండకూడదు. కానీ, తను అన్ని పరీక్షలూ బాగానే వ్రాసిందే! అందుకే, ఈ విషయం
ఆమెకి మింగుడు పడడం లేదు. అయినా, స్పోర్టివ్ గా ఉండదలచి, "సర్లెండి...శుభాకాంక్షలు",
అంది ఆమె దు:ఖాన్ని దిగమింగుకుంటూ.
ఒక రెండు వారాల
తరువాత అధికారికంగా ఫలితాలొచ్చాయి. తీరా చూస్తే, భామకే మొదటి స్థానం దక్కింది. ఆరా
తీస్తే తెలిసింది ఏమిటంటే, ఆఖరి సెమ్ లో భామ ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశాన్ని
ఎంచుకుంది. దాన్ని ఎం.టెక్ చదివే పిల్లలతో కలిసి చదవాలి. ఆ పేపర్ లోని మార్కులు
ఇంకా అప్పటికి రాకపోవడం వల్ల గోపికి మొదటి స్థానం లభించిందనుకుని పొరబడ్డారు. ఆ మార్కులు
కలిపితే, ఎప్పటిలాగే తనకే ఫస్ట్. కానీ, ఆమె విర్రవీగిపోలేదు. జీవితంలో ఫస్ట్ రాంక్
భాగమే గాని ఫస్ట్ రాంకే జీవితమనుకోకూడదనే పాఠాన్ని నేర్పిన ఈ తప్పిదానికి థాంక్స్
చెప్పుకుంది.
*****
No comments:
Post a Comment