Sunday, August 13, 2017

చిట్టి కథ – key word- ఛెళ్ళు- ఎందుకు మానేసిందంటే...


ఎందుకు మానేసిందంటే...
        కరెంటు పోయింది. అనుపల్లవికి చాలా ఇష్టమైన చిరు మెగా హిట్, ‘గ్యాంగ్ లీడర్’, జెమినీ మూవీస్ లో మొదలవబోతోంది. ఛీ.. ఈ పాడు కరెంటు ఇప్పుడే పోవాలా! జస్ట్ అరగంట పోయినా టైటిల్ సాంగ్ మిస్ అవుతాం. అయినా, నువ్వెంటే పల్లవీ, ఇంత మంచి సినిమా టీవీలో వస్తూంటే, కరెంటు పొతే, నిమ్మకు నీరెత్తినట్టున్నావు?” అంది. “ఇప్పటికి ఎన్ని సార్లు చూశావే అనూ?” అడిగింది పల్లవి. “నచ్చిన సినిమాని ఎన్ని సార్లయినా చూస్తాం. ఏం, నీకు నచ్చిన సినిమాలు నువ్వు చూడవేమిటి?” అని పెడసరంగా జవాబిచ్చింది అనుపల్లవి. “ఒకప్పుడు నీలాగే ఉండేదాన్ని.  అది నా చిన్నప్పటి మాట. ఆ కాలంలో నాకు సినిమా పిచ్చి చాలా ఉండేది. నాకు గనుక సినిమా నచ్చిందంటే ఎన్ని సార్లు చూడడానికైనా వెనుకాడేదాన్ని కాదు”, అంది పల్లవి. “మరైతే ఇప్పుడెందుకు మానేసావ్?”

        “రెండేళ్ళ క్రితం ‘పెద్దరికం’ వేశారు. అది మంచి సినిమా అని తెలుసుగా.... దాన్ని కుర్చీకి అతుక్కుపోయి మరీ చూస్తున్నాను. అప్పటికే లెక్కలేనన్ని సార్లు చూసేశాను. అయినా, ఆ సినిమా అంటే అంత పిచ్చి. ఆ సమయంలో తాతయ్యగారు ఈవెనింగ్ వాక్ నుండి తిరిగొచ్చి టీవీని అత్యంత ఏకాగ్రతతో ఆ సినిమాతో లీనమైపోయిన నన్ను చూస్తూ ఉన్నారట. అఫ్ కోర్స్, నేను గమనించలేదు.  ఈ లోగా హీరోని ప్రేమించినందుకు హీరోయిన్  ని ఆమె తండ్రి కొడతాడు. ‘అమ్మాయీ, నువ్వు ఇలాంటి పని చేస్తావనుకోలేదే!’ అన్న తాతయ్యగారి మాటలకి ఒంటి మీద స్పృహ వచ్చింది.
        “తాతయ్య గారు కూడా నాలాగ సినిమాలో లీనమయ్యారేమోననుకుని ఆయన వైపు చూశాను. ఆయన నా వైపే చూస్తున్నారు. ‘ఒక అమ్మాయిని కొట్టే సినిమాని తరిస్తూ చూస్తున్నావా? బాధగా లేదూ?’ అని అడిగారు. ‘అంటే, తాతయ్య గారూ, అది క్యారెక్టర్ బట్టి...’ అని నసుగుతూ ఉంటే, ‘ఆడవాళ్ళని గౌరవించే కుటుంబం రా మనది’, అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు.  
        “ఆలోచించగా, నాకు ఒక విషయం అర్థమయ్యింది. మన సినిమాల్లో స్త్రీల గురించి వెకిలి చర్చలూ, తక్కువ చేసి మాటలాడ్డాలూ, అశ్లీలంగా చూపించడాలూ ఉంటాయి కదా! తాతయ్య గారు అన్న మాటలు నాకు ‘ఛెళ్ళు’ మని తగిలాయి. అప్పటి నుంచి, నా సినిమా పిచ్చి వదిలింది”, అని జవాబిచ్చింది పల్లవి.

****

No comments: