Thursday, August 10, 2017

చిట్టి కథ -keywords"ఛీ పొండి...మీరు మరీనూ ".. హాస్య సరస మేళవింపుతో -- పెద్ద ఉద్యోగం

పెద్ద ఉద్యోగం

అపర భద్రకాళిలాగ మీనాక్షి భీకర రూపం దాల్చింది. కనపడ్డ వస్తువే ఆయుధంగా మలచుకొని భర్త నిరూప్ ని చితకబాదింది. “మీనా, మీనా”, అని ఆమెను అనునయించబోయినా పనిచేయలేదు. “భార్యకు తెలియకుండా వెధవ్వేషాలేస్తావుట్రా!” అని హుంకరించింది. “లేదు అమ్మతల్లే, ఈ మాటు మా ఆవిడకి చెప్పి మరీ చేస్తాను”, అన్నాడు అతి తెలివిగా. అంతే, మరో రౌండ్ కోటింగ్ ఇచ్చింది మీనాక్షి. “భార్యని గౌరవించడం చేతకాని నీకు భార్య కావలసి వచ్చిందా? మీ అమ్మానాన్నలని అనాలి, నీ లాంటి అచ్చోసిన ఆంబోతులని అపర శ్రీరామచంద్రులని చెప్పి, పెళ్ళికూతుళ్ళ ముందుకి వదిలినందుకు”, అని తిడుతూనే ఉంది. “శాంతించు తల్లే....”, అని కాళ్ళ మీద పడ్డాడు. “మరెప్పుడైనా అబద్ధాలు చెప్తావా?” అని భీకర స్వరంతో అడిగింది మీనాక్షి. “ఆపద్ధర్మాలో?” అని సందేహం వెలిబుచ్చాడు. మరో రౌండ్ తగిలిస్తూ, “ఊహూఁ”, అని గద్దించింది. “సర్లే తల్లే, ఇంకెప్పుడూ ఎవరితోనూ అబద్ధాలు చెప్పాను. మా ఆవిణ్ణి వదిలిపెట్టు తల్లే..” అని బతిమాలాడు.


అందాల మీనాక్షి ఎందుకు అపర భద్రకాళి అవతారమెత్తిందో అర్థం కాక నిరూప్ బుర్ర గోక్కున్నాడు. కొంపదీసి తను తాగొచ్చాడని గమనించిందా ఏమిటని ఆలోచించాడు. లేదే! ఛాన్సే లేదు. మౌత్ ఫ్రెషనర్స్ ఇన్నేసి ఎందుకు అమ్ముడుపోతాయి, తనలాంటి వాళ్ళు లేకపోతే? ఏ భర్తైనా భార్య దగ్గర మంచి మార్కులు కొట్టడానికే ట్రై చేస్తాడు కదా! అందుకనే తనకి తాగుడు అలవాటు లేదని పెళ్ళి ముందర బొంకాడు. మరి ఇంకెందుకు ఇలా చేసింది? కొంపదీసి అమ్మవారు నిజంగానే పూనిందా, అని తలుచుకొని ఉలికిపడ్డాడు.
ఈ లోగా అమ్మవారు ప్రసన్నమయింది. “నిరూప్, ఏమయ్యింది?” అని అమాయకంగా అడిగింది. “ఏమీ లేదు మీనా, ఎన్నో రోజుల నుండీ అడుగుతున్నావ్ కదా! మనం రేపు వాటర్ ఫాల్స్ దగ్గరకి పిక్నిక్ కి వెళ్దామా?” అన్నాడు. “మరి మీ ఉద్యోగం?” అని మీనాక్షి అడిగితే, “భార్యని గౌరవించడం కన్నా పెద్ద ఉద్యోగం లేదోయ్”, అన్నాడు నిరూప్. "ఛీ పొండి...మీరు మరీనూ”, అని మీనా పక్కా భారత నారి డైలాగ్ చెప్పేసరికి అమ్మవారు శాంతించిందని నిట్టూర్చాడు నిరూప్. ‘
కొన్నాళ్ళ బట్టి భర్త తాగి ఇంటికి వస్తున్నాడని మథన పడ్డ మీనాక్షి ఉపాయంతో అతని వ్యసనాన్ని వదిలింనందుకు సంతోషించింది.

****

No comments: