Friday, September 1, 2017

చిట్టి కథ- keywords- " కొంగజపాలతో దొంగబాబాల పంగనామాలు...హోషియార్ " - భార్య మాట- బంగారు బాట


               “ఛీ, ఛీ టీవీలో హేతువాదమనే బూతువాద ప్రోగ్రాం చూస్తున్నావు బుద్ధి లేదూ... దైవ స్వరూపులైన స్వాములని తప్పులెన్నుతున్నారు... వాళ్ళకెలాగూ కళ్ళు పోవడం ఖాయం. చూసినందుకు నీక్కూడా పోవాలా ఏం?” అని ప్రకాశ రావు భార్య అన్నపూర్ణపై అరిచాడు. “ఎవరి ధోరణి వారిది. హిందూ మతం నాస్తికవాదాన్ని ఆమోదించలేదూ? అలాగే ఆ స్వాములు నిజంగా తపోధనులో, ధనార్థులో తెల్చుకోమంటున్నారు. అందులో తప్పేముందీ?” అని సాగదీసింది అన్నపూర్ణ.


                   “పాపాన పోయే వాళ్ళని సమర్థించి, పాపాన్ని చుట్టుకుంటున్నావ్...”, అని ఇంకా ఏదో చెప్పబోయేలోపు అన్నపూర్ణ, “ఎవరి పాపం వారిది కదా? నేనేగా పాపాన్ని కొనితెచ్చుకునేది? కందకు లేని దురద కత్తిపీటకన్నట్టు, మీరు బాధ పడకండి.... మూర్ఖ భక్తికి, జ్ఞాన భక్తికి తేడా తెలుసుకోవడం తప్పు కాదుగా! అయినా, ఏదో శాస్త్రవేత్తని పెళ్ళి చేసుకున్నాననుకున్నా గాని, శాస్త్రీయ దృక్పథం లేని వాణ్ణి చేసుకున్నాననుకోలేదు”, అంది ఖచ్చితంగా. తేలుకుట్టిన దొంగలా నోరు మూసుకున్నాడు ప్రకాశ రావు. నిజమే, తను ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా ఛాందసత్వంలో కూడా మొదటి స్థానంలోనే ఉంటాడు. ఆ కారణాన అతనికి రావలసిన గుర్తింపు, పేరు- రెండూ రాలేదు. ప్రకాశ రావు మాత్రం, అదేదో జాతకలోపమని అనుకుని, అందరు బాబాలకీ మొక్కేవాడు. అన్నపూర్ణ నచ్చజెప్పబోతే, వినేవాడు కాదు. ఒకరిద్దరు స్వాములు కర్మ ఫలం అనుభవించాల్సిందేనని తేల్చి చెప్తే, వారిని దొంగ బాబాలకింద జమకట్టేవాడు.
             ఒక రోజు పేపర్ తెరిచిన వెంటనే, హెడ్ లైన్ చూసి అవాక్కయ్యాడు. ఇదివరలో అతను లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి సేవించుకున్న పుట్టగొడుగు బాబా భక్తురాలితో లేచిపోయాడని వచ్చిన వార్త. భక్తురాలంటే కూతురితో సమానం కదా! అలాంటిది, ఈ వయసు మళ్ళిన బాబా ఒక యుక్త వయస్కురాలితో ఎంత నీచానికి ఒడిగట్టాడో, అని ప్రకాశ రావు బాధ పడ్డాడు. ఇంకా నయం, అన్నపూర్ణ అక్కడికి రాలేదు. లేకపోతే, ఆ పుట్టగొడుగుగాడి వెకిలికన్ను ఆమెపై పడుంటే? ఆమె వాడికి పడిపోదు, కానీ ప్రకాశ రావుకి ముచ్చెమటలు పట్టేశాయి. ఈ లోగా కాలనీ లో నిలిపిన వినాయకుణ్ణి ప్రార్థించే వాళ్ళు లేచినట్టున్నారు, పాటల ప్రోగ్రాం పెట్టారు. ‘జపం జపం జపం, కొంగ జపం/ తపం, తపం, తపం దొంగ తపం........’ అనే పాట వినిపించింది. కాఫీ తెస్తూ, “దేవుడి పేరులో ఇవేం పాటలండీ..గోల గోల”, అని అన్నపూర్ణ అంది. “గోలైతే అయింది కానీ, నాకు బుద్ధి వచ్చింది. ఇదిగో చూడు....”, అని పేపర్ అందించాడు. ఆ వార్త చదువుతున్న అన్నపూర్ణతో, “నా మూర్ఖత్వంతో పాటు నా పురుషాధిక్య బుద్ధి కూడా పారిపోయిందోయ్! ఇక మీద నాకు భార్య మాటే బంగారు బాట”, అని ముక్తాయించాడు ప్రకాశ రావు.
*****

No comments: