చిట్టి కథ: ఆమె తడబడింది....కానీ నిలబడింది.
గులకరాయి నేర్పిన గుణపాఠం
ఆమెకు జీవితంపై విరక్తి
పుట్టింది. ప్రేమించిన భర్త ప్రేమగా చూసుకోకపోగా ఇద్దరు టీనేజ్ అబ్బాయిల ఎదురుగా
తనని గొడ్డుని బాదుతున్నట్టు బాదుతున్నాడు. తండ్రిని దారిలోకి తెచ్చుకోలేని నువ్వు
మాకేం నీతులు చేపుతవులే, పో, అనే పుత్రులు.....
మానవత్వం మిగిలున్న మనిషి గనుక భర్త
చేసే అప్పులు తనే తీర్చాలి. ఆ అనుమానపు మొగుడు ఉద్యోగానికి వెళ్ళనిస్తేగా... ఆ
పుత్రరత్నాలకి నూనూగు మీసాల నూత్న యవ్వనమున ‘అచ్చోసిన ఆంబోతులు’, అని అప్పుడే
ఐఎస్ఐ మార్కు పడిపోయింది. ఈ పనికి మాలిన వాళ్ళ ఆగడాలు వింటూ, భరిస్తూ జీవించే
కన్నా మరణమే శరణమనుకుంది. దూరంగా రైలు వేగంగా రావడం చూసి, ఆ అవకాశాన్ని
జారవిడుచుకోకూడదని పరిగెత్తింది. రైలు పట్టాలింక అల్లంత దూరంగా ఉన్నయనగానే, ఓ గులక
రాయి తగిలి ఆమె తడబడింది, బొక్క బోర్లా పడింది. రైలు ఆమె కళ్ళెదురుగానే, తనని
వదిలి వెళ్ళిపోయింది. ‘ఛీ, నా బతుకంటే బోడి గులకరాయికి కూడా లోకువైపోయిందా’, అనే
కోపంతో ఆమె లేచింది. కష్టాల నుండి పారిపోతే అందరికీ లోకువైపోతామనే జీవిత సత్యాన్ని
గ్రహించింది. అందుకే జీవితంలో నిలబడాలనే దృఢ నిశ్చయానికి వచ్చింది. ఇదివరకు కనబడని
దారులు ఇప్పుడు ఆమెకు గోచరించాయి. వాటి వెంట ధైర్యంగా బయలుదేరింది, విజయం
సాధించడానికి.
****
No comments:
Post a Comment