Monday, June 4, 2018

స్వీయ కవిత- Theme- ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికిన కన్నీటి ధారలు



1.   ఓటమినెదుర్కునేందుకు సంసిద్ధమయ్యానానాడు
మరో అవకాశం కోసం ఆగాలి ఆర్నెల్లు
ఆ ఎదురుచూపులలో ఓ శుభోదయాన వరించె నన్ను విజయమ్ము
ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికెను కన్నీటి ధారలు!


2.   పుత్రుడు విదేశమున ప్రయోజకుడయ్యెనని
ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికెన్ కన్నీటి ధారలు
వాడు తల్లిదండ్రులని లెక్క చేయకపోయినంతనె
ఆ ఉల్లాసపు ధారలయ్యె దుఃఖాశ్రువులు!

3.   ఆటపాటల్లో గెలిచినవానికి ఉబుకును
కన్నీటి ధారలు ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో
ఓడిన వాడికి కూడనుబుకునశ్రుధారలు
దీనర్థము గెలుపోటములు సరిసమానమే యని గదా!

4.   పాఠశాలకు పోయినంతనె
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తురాగా
ఆ మధురస్మృతులు ఉప్పొంగ
ఉల్లాసపు సడిలో ఉబికెన్ కన్నీటి ధారలు!


*****

No comments: