యాంత్రిక బంధం
“రబ్బర్ బ్యాండ్ లాగి
కొట్టినట్టు ఏమిటా మాట? కావాలంటే నన్ను కొట్టు. మాటలతో కాదు”, అన్నాడు మహేష్,
భార్య విమలతో. “నేను అనకూడని మాట అనలేదుగా! విడాకులు తీసుకుందాం”, అంది ఆమె.
“మళ్ళీ అదే మాట! సరదాకి కూడా అలాంటి మాట అనకు”, అన్నాడు మహేష్.
“కష్టమైన నిజాన్ని పైకి
అంటే నీకు బాధగా ఉంది. నిజమే, ప్రేమ అనేది భార్య, భర్త, ఇద్దరూ సమానంగా ప్రేమిస్తేనే
పండుతుంది. ఒకరు వదిలేస్తే మరొకరికి దెబ్బ తగులుతుంది. నేను నీకు ఒక యంత్రంతో
సమానం. రోజూ సమయానికి పని జరిగిందా, లేదా అని చూస్తే సరిపోతుందా? భార్య ఓ మనిషి,
దాన్ని ఆప్యాయంగా పలుకరిద్దామని ఎప్పుడైనా అనిపించిందా నీకు? అప్పుడు నాకెన్ని
రబ్బర్ బ్యాండ్ దెబ్బలు తగిలుంటాయో ఎప్పుడైనా ఆలోచించావా? అందుకే ఈ యాంత్రిక బంధం
నుండి విముక్తి కోరుతున్నాను”, అని ఎటో చూస్తూ జవాబిచ్చింది విమల.
కొంత సేపు మౌనం. ఆ సమయంలో తను
భార్యని ఒక యంత్రంలా చూసిన పద్ధతి గుర్తు వచ్చింది. ఆ తరువాత, పశ్చాత్తాపంతో
నిండిన కళ్ళతో, “నీకు యాంత్రిక బంధం నుంచే కదా విముక్తి కావాలి? నేను మనిషినౌతాను,
నిన్ను మనసులో దాచుకుని చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వవా?” అని మహేష్ ప్రాధేయపడ్డాడు.
*****
No comments:
Post a Comment