Wednesday, January 3, 2018

చిట్టి కథ- keywords- " నా ప్రయత్నం నచ్చకపోతే ప్రోత్సహించకండి...అంతే కానీ వ్యంగ్య విమర్శలతో బాధపెట్టకండి " - మోడరన్ వేటూరి

 మోడరన్ వేటూరి
           
              పద్మాసన ఈ మధ్యనే రాతకోతలు మొదలెట్టింది. ఆత్మవిశ్వాసం ఇంకా కుదరక స్నేహితుడు శివని అభిప్రాయమడిగింది. ఆమె వ్రాసిన మొదటి నాలుగు కవితలు చదవడానికి వారం రోజులకి పైగా తీసుకుని, “భేష్ పద్మా, మోడరన్ వేటూరివౌతావు”, అని కాగితాలు తిరిగిచ్చేశాడు. వేటూరి అంటే భక్త కన్నప్ప, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, లాంటి సినిమాల్లో పాటలు వ్రాసి, అవార్డులు గైకొన్న మహానుభావుడని ఆమెకు తెలుసు. అందుకే, వేటూరి పేరు వినగానే ఎగిరి గంతేసినంత పని చేసి, ఆ రోజు నుండీ అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకీ కవితలు వినిపించడం మొదలుపెట్టింది.  

              కొన్నాళ్ళకి తెలుగు పండితుడైన వాళ్ళ మామయ్య ఊరునుండి వస్తే, తన ప్రతిభ ఆయన ముందు ప్రదర్శించింది. భాషాభిమానం దండిగా ఉన్న ఆయన ఠారుకుని, “పద్మా, కొత్తగా ఏదైనా పని చేపడితే, పెద్ద వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలిరా”, అని మెత్తగా మందలింప జూశారు. “మా పక్క వీధిలో శివ అనే అబ్బాయి ఉన్నాడు మామయ్యా! అతన్ని ’తెలుగు పండితుడు’, అని అందరూ అంటారు. అతను ‘సై’ అన్నాకే ఈ కవితలు అందరికీ వినిపిస్తున్నా మామయ్యా!” అంది ఉత్సాహంగా. “ఏమో ఆ అబ్బాయి నిన్ను ఆటపట్టించి ఉంటాడని నా అనుమానం. నీ ఉత్సాహాన్ని నీరు కార్పిస్తున్నానేమోగాని, నువ్వు ఇంకా సాధన చేసి మంచి కవితలు వ్రాయాలి”, అని ముగించారు.
              హుటాహుటిన శివ దగ్గరకి బయలుదేరింది పద్మ. ఇల్లు సమీపిస్తుండగా, శివ తన తల్లితో చేస్తున్న సంభాషణ ఆమె చెవిన పడింది. “ఆ పిల్ల అంత చెత్త కవిత్వం వ్రాస్తే, సరిదిద్దకుండా ఏమిట్రా ఈ ఎగతాళి? తప్పు కాదూ!” అని తల్లి అన్న మాటలకి జవాబుగా, “చేదు నిజం చెప్పకుండా ‘మోడరన్ వేటూరి’ లా ఉంది కవిత్వం అన్నాను. ఆమె ఆయన పేరు వినగానే కిరాతార్జునీయం వ్రాసిన మనిషి అనుకుని ఉండచ్చు. కానీ నేను మోడరన్ అని ఎందుకు అన్నానో గ్రహించాలిగా! మోడరన్ అంటే ఎక్కువ ఇంగ్లీషు పదాలతో, పాటతో సంబంధం లేని పదాలతో పాటలు వ్రాసినాయన. అంటే, ‘అచ్చిక బుచ్చిక పిచ్చిక మచ్చిక’ లాంటి కవిత్వమన్నమాట! అంటే, రాసి ఎక్కువ వాసి తక్కువ టైపు. కవయిత్రయితే, ఈ పాటి డొంకతిరుగుడు మాటలు అర్థం చేసుకోవద్దూ!అలాగని ఆయన్ని చులకన చేయడం లేదు సుమీ. ఆయన ఇప్పటికీ నా అభిమాన పాటల రచయిత”, అన్నాడు.
             పద్మాసన వెనుదిరుగకుండా కాలింగ్ బెల్ మ్రోగించి, లోపలి వెళ్ళి, శివతో,  “నా ప్రయత్నం నచ్చకపోతే ప్రోత్సహించకండి...అంతే కానీ వ్యంగ్య విమర్శలతో బాధపెట్టకండి...”, అని, వాళ్ళమ్మ గారితో, “ఆంటీ, మీరు మా పండితుడికి బాగానే బుద్ధి చెప్పారు. మంచి కవితలు వ్రాసి మీ ముందుకొస్తా. ఇప్పటికి వెళ్ళొస్తా”, అని అక్కడి నుండి నిష్క్రమించింది. 

No comments: