Saturday, February 17, 2018

చిట్టి కథ- keywords- "కలలు కన్న దేశంలోకి అడుగుపెట్టాక.... కన్న దేశం కలలలోకి వస్తోందిరా"- మాట రాని మౌనమిది

మాట రాని మౌనమిది
           ఆనందరావు డ్యూటీ ముగించి, ఇంటికి వచ్చి, కాస్సేపు టీవీ చూసి, ఎప్పటిలాగే చపాతీపిండి కలిపి, వాటిని వత్తసాగాడు. ఈ మాటు చుక్కా రొట్టె చేసుకుందామనుకుని, రొట్టెని నిప్పు మీద కాలుస్తున్నప్పుడు చెయ్యి కాల్చుకున్నాడు. ఆ మంట తన గుండెల్లో రగులుతున్న చిచ్చుని బయటపడేలా చేసింది. అమాంతం గతంలోకి వెళ్ళాడు.

            చదువబ్బక ప్లంబింగ్ నేర్చుకున్నాడు. ఫ్లాట్ల కట్టడాల పుణ్యమా అని తనకీ, భార్యాబిడ్డలకీ బాగానే వెళ్ళిపోతోంది. అకస్మాత్తుగా వచ్చిన నోట్ల రద్దు వలన రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. దానిపై ఆధారపడిన వృత్తి పనివాళ్ళని దెబ్బకొట్టింది. నెల గడవడం కష్టమయ్యింది. ఓ మూడు నెల్ల తర్వాత ఓమాన్ లో ప్లంబర్ కావాలన్న ప్రకటన చూశాడు. ఉద్యోగావకాశం చూసి కుటుంబమంతా పొంగిపోయింది. ఉద్యోగం ఖరారు అవడానికో ఆరు నెలలు పట్టింది. అప్పుల బాధ పోయి, సంసారం ఒడ్డున పడుతుందన్న ఆశతో ఓమాన్ లో అడుగుపెట్టాడు. తెలుగు వాళ్ళతో స్నేహం చేశాడు. కానీ, భార్య, పిల్లలు లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఓ సారి భార్యకి ఫోన్ చేసి, "కలలు కన్న దేశంలోకి అడుగుపెట్టాక....కన్న దేశం కలలోకి వస్తోందిరా. ఉన్న దాంట్లో బతికేద్దాం, తిరిగొచ్చెయ్యనా?" అని వాపోయాడు. అటు మౌనం, ఏడ్పులు. పాపం, తిండికి కష్టపడ్డ రోజులు గుర్తొచ్చుంటాయని గ్రహించాడు తను. ఎవరూ ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆమెను ఏడిపించిందని, ఆ మాట రాని మౌనాన్ని అర్థం చేసుకున్నడానందరావు.

************

No comments: