Sunday, July 22, 2018

చిన్న పిల్లని చూసి ....(గల్పిక)

చిన్న పిల్లని చూసి ....(గల్పిక)
              హోరు వాన కలిగించిన రోడ్డు వరదలు దాటుకుని, ఎలాగో ట్రెయిన్ ఎక్కాం నాన్నా, నేనూ! మా ఎదురు సీట్లో భార్యాభర్తలు, వాళ్ళ కూతురూ కూర్చున్నారు. నా దృష్టి చంటిపిల్లైన వాళ్ళమ్మాయి మీద పడింది. ఎంత ముద్దుగా ఉందో! సీరియస్ గా స్మార్ట్ ఫోనులో ఏదో వీడియో చూస్తూ కన్నడంలో వాళ్ళమ్మానాన్నలతో ముద్దు ముద్దుగా మాటలాడుతోంది. రెండేళ్ళు కన్నా ఉండవు. ఎంచక్కా స్మార్ట్ ఫోన్ ని వాడుతోందో! 

ఇంతలో, “రామచంద్ర రావు గారి ఈమెయిలు చూపించు బుజ్జీ”, అన్నారు నాన్న. వెంటనే, నా స్మార్ట్ ఫోనులో ఆ మెయిలు చూపాను. స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని ఎన్ని సార్లు పోరినా, ఆయన మాత్రం ఒప్పుకోకుండా మొండిపట్టు పట్టి కూర్చున్నారు. ఆయనే కొనుక్కుంటే నా మీద ఆధారపడక్కరలేదు కదా! “చిన్నగా ఉంది... దీన్ని పెద్దగా చెయ్యలేమా?” అని అడిగారు నాన్న. ఇదే అదననుకుని, “స్మార్ట్ ఫోన్ ఉంటే మీకు ఈ కష్టం ఉండదు కదా! దీన్ని ఇలా పెద్దగా చేసుకోవచ్చు... వాళ్ళమ్మాయి చూడండి... చంటిదైనా ఎంత బాగా వాడుతోందో! దాన్ని చూసి నేర్చుకోవచ్చు”, అని మెచ్చుకున్నాను. నాన్న మొహం చిన్నబుచ్చుకున్నారు. పదిన్నరకి వాళ్ళు పిల్లని నిద్రపుచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ పిల్ల ఫోన్ వదలందే! వాళ్ళ నాన్న దాని చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు. ఆమె ఆరునొక్కరాగం ఆలపించింది. వాళ్ళ నాన్న ఫోన్ బ్యాక్ కవర్ శబ్దం చేస్తూ కింద పడేశాడు. “చూడు, ఫోన్ ముక్కలై మాయమైపోయింది. పడుక్కో”, అని ఊదరగొట్టేశాడు. పిల్ల నిద్రకుపక్రమించింది. మా నాన్న ఆలోచిస్తూ గమనిస్తున్నారు. ఇంతలో ఆమె పక్కనే ఉన్న మాగజిన్ బాగ్ లోంచి ఫోన్ మోగిన శబ్దం వినబడింది. పిల్ల గోల చేస్తూ లేచి కూర్చుంది. నాన్న నాకేసి తీక్షణంగా చూశారు. ఆ చూపు నాకు అర్థమైంది. ‘ఇదేనా నేను చిన్న పిల్లని చూసి నేర్చుకోవలసింది’, అని.
****************

No comments: