డాడీ
అవి నేను ఉద్యోగానికి గాను బరోడాలో శిక్షణ
పొందుతున్న రోజులు. మా శిక్షణా కళాశాల స్వర్ణోత్సవం అప్పుడే జరిగింది. ఆ
అవకాశాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా మా
సంస్థలో పనిచేసే ఉద్యోగులు, ఉన్నతాధికారులు రచించిన చిత్రాలను ప్రదర్శించాలని నిశ్చయించారు.
ప్రదర్శనా నిర్వహణకి ముగ్గురు ట్రైనీలని ఎంపిక చేశారు. ముగ్గురూ వేర్వేరు శాఖలకి
చెందినవారు. ఇద్దరబ్బాయిలు, నేను. మా నాయకుడికి చిత్రలేఖనంలో ప్రవేశముందట. రెండవ
అబ్బాయికి చిత్రలేఖనమంటే ఒక అవగాహన ఉందట. ఏమీ లేని మొద్దుని నేనయ్యాను. అయినా, మా
వాళ్ళిద్దరూ నన్ను దెప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించారు.