Monday, November 20, 2017

చిట్టి కథ- theme- ఒకసారేమయ్యిందంటే- దారి తప్పిన బస్సు

         అవి ఈ సహస్రాబ్దపు తొలి సంవత్సరాలు. నేను ఉద్యోగానికి శిక్షణ పొందుతున్న రోజులవి. మకరసంక్రాంతి సమయంలో శని, ఆదివారాలు కలిసొచ్చి వరుసగా మూడు రోజుల శలవులొచ్చాయి. బరోడా చుట్టుపక్కల ఉండే ట్రైనీలు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ పదిమందిమి మాత్రం మిగిలాం. మాలో కొంతమంది కుటుంబంతో ఉన్నారు- అంటే చంటిపిల్లలతో అన్నమాట. మా ట్రైనీ ఒకబ్బాయి యాహూ సెర్చ్ సాయంతో దూరాభారాల లెక్కలేసి శనివారం డామన్ (దమణ్) వెళ్దామా అని అడిగాడు. మూడు గంటల్లో చేరిపోవచ్చాన్నాడు. పొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరితే, సాయంత్రం ఏడింటికల్లా తిరిగొచ్చేయ్యచ్చన్నాడు. సరే, ఒక ఊరు చూసినట్టుంటుందని అందరం ఒకే అన్నాం.

ఆ రోజు బయల్దేరాక హిందీ అంత్యాక్షరి అందుకున్నాం. మూడు గంటలు ప్రయాణించినా డామన్ అనే పేరు కూడా కనపడలేదు. ఒక చోట బస్సు ఆపి కనుక్కుంటే వాళ్ళకి తెలియదన్నారు. మరో పది కిలోమీటర్లు ముందుకి పోయాక తెలిసినదేమంటే, మేం పూర్తిగా దారి తప్పామని. వెనుదిరిగి డామన్ చేరుకోవడానికి మరో మూడు గంటలు పట్టచ్చు. మేం దాటిన ఊళ్ళన్నీ పల్లెటూళ్ళే! ఎక్కడ మంచి తిండి దొరుకుతుందో కనుక్కోవడానికి మాకెవరికీ గుజరాతీ రాదు. అప్పటికి పన్నెండున్నర దాటింది. కొందరబ్బాయిలు మా నాయకుణ్ణి దెప్పడం మొదలెట్టారు. దారిలో మంచి తిండి దొరుకుతుందో లేదో తెలియదు. మేం తినగలిగేదేదైనా దారిలోనే తినేద్దామని నిర్ణయించుకున్నాం. ఎట్టకేలకి ఒక బేకరీ కనిపించింది. “మిల్క్ బ్రెడ్ ఒంటికి మంచిది కాదు. బ్రౌన్ బ్రెడ్ ఉంటే కొనండర్రా”, అన్నాడు ఒక సహాధ్యాయి. “ఉండవయ్యా, ఆకలితో అలమటించే పరిస్థితిలో నీ జీకే ఎవడిక్కావాలి?” వారించాడు మరో అబ్బాయి. నాలుగు పెద్ద బ్రెడ్లు, ఆరు అమూల్ వెన్న పాకెట్లు(మేముండేది గుజరాత్ కదా!), పది మంచి నీళ్ళ సీసాలతో వెళ్ళినవాళ్ళు తిరిగొచ్చారు. చంటి పిల్లలకి కావలసినవేమైనా ఉంటే, అదృష్ట వశాత్తు దొరికాయి.
        ఒకళ్ళు పేపర్ ప్లేట్లో రెండు బ్రెడ్ ముక్కలు పట్టుకుంటే, మరొకరు చెంచాతో ఎంత వెన్న వస్తే అంత ఆ బ్రెడ్ ముక్కల మధ్య పెట్టిచ్చేవారు. “ఇప్పుడు మనకి శక్తి కావాలి. వెన్న ఎక్కువయ్యిందని గోల చెయ్యద్దు. అంతగా కావాలంటే మనం తిరిగెళ్ళాక మన కాంపస్ చుట్టూ నాలుగు రౌండ్లు కొట్టండి”, అని మా టీమ్ లీడ్ మమ్మల్ని హెచ్చరించాడు కూడా! దారిలో ఒక రేగుపళ్ళ తట్ట కనిపించింది. తట్టతో సహా కోనేశాం. బ్రెడ్, రేగుపళ్ళతో మా మధ్యాహ్న భోజనం పూర్తయ్యింది. డామన్ చేరేసరికి మూడు. అప్పటికి ఎవరికీ ఆకలి వెయ్యలేదు. తిన్నగా బీచ్ వద్దకెళ్ళి రెండు గంటలు గడిపాం. సాయంత్రమయిన కొద్దీ సముద్రం వెనక్కి వెళ్ళడం గ్రహించాం. నేనిదివరలో బొంబాయి ఒకసారి వెళ్ళినా ఈ విషయాన్ని గ్రహించలేదు. తర్వాత, విదేశీ సెంట్లు చౌకబారుగా దొరుకుతాయంటే ఒక కొట్టుకెళ్ళాం. ఏ సెంటు చూసినా ఐదొందలకి తక్కువ లేదు. మేం ముక్కు మీద వేలు వేసుకోకుండా నెమ్మదిగా వెనుదిరిగాం. ఏడు గంటల తిరుగు ప్రయాణం కోసం సన్నద్ధులమయ్యి బస్సెక్కాం. దారిలో ఢాబాలో ఒక గంట ఆపుకుని, కొందరం గుజరాతీ థాలీ, మరి కొందరం పంజాబీ థాలీ తీసుకున్నాం. అర్థరాత్రి లోపు చేరే ప్రసక్తి లేదు. మా బస్సారథి ఎక్కడ తన ఏకాగ్రతని కోల్పోతాడో అన్న భయంతో కొండరబ్బాయిలు ఒకరి తరువాత ఒకరు అతణ్ణి మాటలు, పాటలతో అలరించారు. ఎట్టకేలకి రెండు గంటలకి మా కాంపస్ చేరాం.
        ఈ దారితప్పిన బస్సు పుణ్యమా అని మేమందరం మంచి స్నేహితులమయ్యాం; మా సౌభ్రాతృత్వం ఇప్పటికీ పటిష్టంగా ఉంది.

******************

No comments: