Sunday, October 29, 2017

చిట్టి కథ - guiding sentence- "బస్టాండులో అదాటుగా ఆమె/ అతను...కళ్ళముందు వెలుగు వెల్లువ "- వెల్కమ్ బ్యాక్

వెల్కమ్ బ్యాక్
చేతికి గుడ్డ సంచీ తగిలించుకుని, చెప్పులేసుకుని, ఇంటికి తాళంపెట్టి కలీడ్చుకుంటూ బస్టాండు వైపు నడిచింది వసంత. ఆమె తన బాధ్యతని ఒక మరమనిషిలా నిర్వర్తిస్తోంది. తీసుకునే జీతానికి మాత్రం న్యాయం చేస్తోంది. ఎటొచ్చీ వ్యక్తిగతంగా ఆమె జీవితంలో గుర్తు చేసుకుని పొంగిపోయే క్షణాలు లేవని అనుకుంటూ వెళ్ళేసరికి గజపతినగరం బస్టాండు రానేవచ్చింది. వెంటనే ఒక బస్సు వచ్చింది కానీ అది చీపురుపల్లి వెళ్ళేది. సాలూరు వెళ్ళే బస్సు ఎప్పుడొస్తుందా అని బస్సు రావలసిన దిక్కుకేసి తదేక దృష్టితో చూస్తోంది.

ఇంతలో చీపురుపల్లి బస్సులోంచి, ‘వసూ’, అనే పిలుపు వినబడి ఉలిక్కిపడింది. తనకి చాలా ఇష్టమైన గొంతు. ఆ గొంతుకిష్టమైన పిలుపు. అటు చూస్తే, అతనే, మదన్. బస్సు దిగిన అతను, “ఏమైపోయావు వసూ, నీ కోసం వెతకని చోటంటూ లేదు తెలుసా!” అన్నాడు మదన్. వస్తున్న కళ్ళనీళ్ళని ఆపుకుని, “ఆ చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుకుందాం”, అంది వసంత. నడిచేటప్పుడు రాయి తగిలి పడబోయి మోకాళ్ళమీద కూర్చుంది వసంత. లేవడానికి చేయూతని నిరాకరించి, ఒక చేయి, ఒక మోకాటిని నేల మీద బలంగా నిలిపి, ఎలాగో కష్టపడి లేచింది. “నీకు ఇదేప్పుదయ్యింది?” అనడిగాడు ఆమె వంకర చేయి, కాలుని చూసి. “మనమిద్దరం కలిసి చేసిన ధైర్యానికి పురస్కారం’, అంది నిర్లిప్తంగా. “మన పెద్ద వాళ్ళు మన పెళ్ళికి అంగీకరించకపోతే పారిపోయి పెళ్ళి చేసుకోవాలనుకోవడం తప్పా?” అన్నాడు మదన్ కోపంగా. “కాదు, కానీ అది బెడిసికొడితే ఎలా ఉంటుందో ఊహించలేదు మనం. నా కుడి చేయి, ఎడమ కాలూ మనం వెళ్తున్న టాక్సీ ఆక్సిడెంట్లో వంకర పోయాయి. నిన్ను మీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ నేను నిన్ను మరచిపోవాలని ఆర్డరేసి మరీ వెళ్ళారు. గత్యంతరం లేక నేను ఇంటికి వెళ్తే, ఈ అవమానం భరించలేక అమ్మ- నాన్న ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. అనాథ శరణాలయంలో తలదాచుకుని, దివ్యాంగుల  కోటాలో సాంఘిక సంక్షేమ శాఖలో చిన్న ఉద్యోగం చేస్తూ పొట్ట పోసుకుంటున్నాను. మనమే గనుక ఆ పని చేయ్యకపోయుంటే, నిన్నూ, మా వాళ్ళనీ కూడా పోగొట్టుకుని ఉండేదాన్ని కాదు”, అందామె. అతడు నొచ్చుకుని, “మా వాళ్ళు నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేశారు గాని, నా మనసులోంచి నిన్ను వెలివెయ్యలేకపోయారు. నేను కొంత కోలుకోగానే నీకోసం ఇల్లొదిలి వచ్చాను. ప్రస్తుతానికి నిన్ను వెతకడమే నా గోల్ గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం వెతుక్కుంటా. నన్ను నీ జీవితంలోకి మళ్ళీ రానిస్తావా ప్లీజ్?” అని ప్రాధేయపడ్డాడు. కొంతసేపటి మౌనం తరువాత, “వెల్కమ్ బ్యాక్”, అంది వసంత, ఆ కళ్ళలో వెలుగు వెల్లువ ప్రవహిస్తూండగా.
******

No comments: