Thursday, February 1, 2018

చిట్టి కథ - Sentence- ఆమె ఆవేశంగా మాట్లాడుతుంటే అతను తలదించుకుని నిశ్శబ్దంగా వింటున్నాడు...చుట్టూ గుమిగూడిన జనం సాక్షిగా...- తల దించుకోక ఏం చేస్తాడు?

తల దించుకోక ఏం చేస్తాడు?
                 ఆమె పేరు భ్రమరాంబ. ఆ రోజే రైల్వేలో ఆర్పీఎఫ్ కాన్స్టేబుల్ గా చేరింది. స్టేషన్ లో ఉద్యోగం. చేతిలో లాఠీ పట్టుకుని అటూ-ఇటూ కలయజూస్తూ తిరుగుతూంటే భలే త్రిల్ ఫీల్ అయింది. అవదు మరి? వాళ్ళ ఊరు నుండి ఒక పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులతో పాస్ అయిన మొట్టమొదటి మహిళ ఆమె.


                    పల్లెటూరిలో ఉండే విలువలు, ఆప్యాయతలు కలిగి ఉన్న మనిషిలా అనిపిస్తుంది ఆమెను చూస్తే. ఒక పెద్దావిడ కర్ర, సామాన్లతో కుస్తీ పడుతుంటే ఆవిడకి సాయం చేసింది. అలాగే ఒక బిచ్చగాడు ప్లాట్ ఫారం మీద తారసపదినప్పుడు, “తాతా, రూల్స్ ప్రకారం ఇక్కడ ఉండకూడదు. బయటికి నడు”, అని మంచి మాటలతో సాగనంపింది. కాస్సేపు అయిన తరువాత ఒక వ్యక్తి ‘నో పార్కింగ్’ వద్ద బైక్ ని నిలుపుకుంటూ కనబడ్డాడు. వెంటనే అక్కడికి వెళ్ళి అతణ్ణి ఫైన్ కట్టమంది. ఆ అబ్బాయి ఆమెకు లంచం పెట్టబోతే, ఫైన్ కట్టించుకోవడమే కాకుండా లంచగొండితనం మీద క్లాస్ పీకింది కూడా. “లంచగొండితనం వల్లనే కదా, మన దేశంలో చట్టాలంటేను, రూల్స్ అంటేను గౌరవం తఘగ్గిపోతోంది. మనలాంటి యువత రూల్స్ ని పాటించకపోతే ఎలా? దేశంలో ఎవరూ రూల్స్ ని లెక్కచేయకుండా ఉంటే మనం ప్రశాంతంగా బతక గలమా? మన డబ్బు కొట్టేసిన దొంగను పట్టుకున్న వాడికి దొంగ లంచమిచ్చి తప్పించుకుంటే బాధ పడమా? ఎదుటివాడికి నీతి చెప్పేముందు మనం వాటిని పాటించాలి కదా!” అని ఆమె ఆవేశంగా మాట్లాడుతుంటే అతను తలదించుకుని నిశ్శబ్దంగా వింటున్నాడు...చుట్టూ గుమిగూడిన జనం సాక్షిగా... తల దించుకోక ఏం చేస్తాడు?


**************

No comments: