Thursday, February 15, 2018

చిట్టి కథ - Sentence- "ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది...."- ప్రేమించేది ఎవరిని?

ప్రేమించేది ఎవరిని?
           “సారీ సార్, ఈ మాటు కూడా మీ ఆవిడకు గర్భం కలగలేదు. మీకు ముందే చెప్పాను, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భాన్ని ధరించడం కష్టమని. మీరు మూడు సార్లు ప్రయత్నించారు, దేవుడు దయ తలచలేదు”, అంది డా|| సుమన సాగర్ తో. “నేను ముందు ప్రేమించేది కృష్ణవేణిని. ఆమె కన్న బిడ్డ నాకు ప్రయారిటీ కానేకాదు”, అన్నాడు సాగర్ తొణక్కుండా. “మరో విషయం. ఆవిడకి గర్భసంచీ నిండా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మేనేజ్ చేయవచ్చు. భవిష్యత్తులో ఎలా అవుతుందోనన్న భయంతో హిస్టరెక్టమీ, అంటే గర్భాసంచీని తీసేస్తే నయం. అప్పుడు ఆవిడ తల్లి అయ్యే అదృష్టాన్ని జీవితాంతం కోల్పోతారు”, చల్లగా చెప్పింది డా|| సుమన. ఆ మాట విన్న వెంటనే సాగర్ మొహం చిన్నబోయింది.

           ఇంటికి వెళ్ళాక ముభావంగా ఉండడాన్ని గమనించి కృష్ణవేణి, “సాగర్, నేను అమ్మను కాలేనని నువ్వు ముభావంగా ఉన్నావు కదూ”, అంది బాధగా. “ఊహుఁ,” అని పరధ్యానంగా జవాబిచ్చాడు సాగర్. “నీకు పిల్లల మీద ఉండే ఇష్టం గమనించాను. అందుకే, ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ చేద్దామనుకున్నాను. సారీ, ఇప్పుడు ఈ జన్మకింక తల్లిని కాలేను”, అంది ఏడుస్తూ.
             సాగర్ ఆమెను దగ్గరకు తీసుకుని,  “ఓ నా అమాయకపు ఇల్లాలా! నువ్వు పిల్లల్ని కనలేవు కానీ తల్లివి కాగలవు. కావాలంటే ఎవరైనా అనాథ పిల్లని దత్తత చేసుకుందాం, ఓకే? ముందు కొన్ని విషయాలలో మనిద్దరికీ అవగహన ఉండాలి. పాయింట్ నెంబర్ వన్, నా ప్రయారిటీ రాబోయే బిడ్డ కాదు, కళ్ళెదురుగా ఉండే నువ్వు. పాయింట్ నెంబర్ టూ, నీక్కూడా మరి పిల్లలంటే ఇష్టమే కదా! నువ్వు తాపత్రయ పడుతున్నవనుకుని నీ ఐవీఎఫ్ ఐడియాకి అయిష్టంగా ఒప్పుకున్నాను. నీ ఆపరేషన్ గురించి విన్నప్పటినుండి చాలా బాధ పడ్డాను, ఈ విషయంలో నువ్వెలా ఫీల్ అవుతావో ఏమిటో అని. ప్రేమ ప్రేమని ప్రేమిస్తుంది. అందుకే, నీకిష్టమనుకుని నేను, నాకిష్టమనుకుని నువ్వు, అనవసరంగా భ్రమ పడ్డాం. నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావ్. నీ పరిస్థితికి ఇండైరెక్ట్ గా నేనే కారణం. సారీ డియర్”, అన్నాడు.
                  వాళ్ళిద్దరూ ఎవరిని ప్రేమిస్తున్నారో క్లియర్ గా అర్థం చేసుకున్నాక, ఆనందంలో తేలిపోయారు.

*****************************

No comments: