Monday, November 13, 2017

చిట్టి కథకి ముగింపు- నైతిక బాధ్యత

Given Story:
ఫ్లైట్ దిగిన వినయ్ భారత నేలని నమస్కరించాడు.ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది. కుటుంబంతో కంటకాపల్లి పయనమయ్యాడు. నూట ఎనభై కిలోమీటర్లు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఉక్కరిబిక్కిరి చేస్తూ గోలగోలగా జనుల ఘన స్వాగతం. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించిన వినయ్ పల్లెటూళ్ళో స్థిరపడబోతున్నారన్న వార్త తెలిసి ఆశ్చర్యపోతూ ఆసక్తిగా అడిగాడు శుభోదయ విలేకరి.. " అనాధగా ఈ ఊళ్ళో చిన్నప్పుడు తిరుగాడే వాణ్ణి... ఈ ఊరి ప్రజలు నన్ను అక్కున చేర్చుకుని వంతుల వారిగా వారాలబ్బాయిగా అంతులేని ప్రేమ అందించారు.చద్దన్నం పెట్టారు.పప్పు ముద్దన్నం పెట్టారు. చదువుపై నా ఆసక్తి గమనించి చందాలతో బలీయ బంధాన్ని ఏర్పరిచారు.ఇష్టపడి కష్టపడి చదువుకున్న నాకు విదేశాల్లో ఉన్నత పదవులు స్వాగతించాయి. ధనం కీర్తి లభించింది. సంతృప్తి చెందాను. ఇప్పుడు నా వంతుగా పల్లె తల్లి సేవ చేసి రుణం తీర్చుకోవాలని..."
My Conclusion:

నైతిక బాధ్యత
        “అంటే మనం ఇక్కడే ఉండిపోతున్నమా వినయ్?”, గద్దించింది అతని భార్య కుసుమ. “అన్నాను కదా, మాతృ ఋణం తీర్చుకోవాలంటారు, నా తల్లెవరో తెలియదు కనుక కంటకాపల్లి  ఋణం తీర్చుకోవాలని!” అన్నాడు వినయ్, మధ్యాహ్నం ఒక కునుకు తీసే యత్నంలో. “డబ్బిస్తావనుకున్నాను గాని మకాం మార్చేస్తానని నాతో మాట వరుసకైనా అనలేదేం?”అంది కుసుమ. మనిద్దరివీ ఒకేలాంటి ఆలోచనలు గనుక నీకూ ఇష్టముందనుకున్నాను”, అన్నాడు వినయ్.
“మన మున్నాగాడికి రెండేళ్ళు. ఈ పల్లెటూళ్ళో ఏం చదువుతాడు? వాణ్ణి బోర్డింగ్ స్కూల్లో పెట్టాలి. చంటాణ్ణి వదిలి నేనుండలేను”.
“ఉండనక్కరలేదు. మున్నా నేను చదివినట్టే ఈ ఊరి బళ్ళో చదువుతాడు”.
“అంటే, వాడు జీవితాంతం మట్టి పిసుక్కుంటూ ఉండల్సిందేనా?”
“నేనూ ఇక్కడి నుంచేగా వచ్చాను? నేను మట్టి పిసుక్కుంటున్నానా? అయినా, మట్టి పిసుక్కుంటే తప్పేమిటి? మనమందరం మట్టి నుంచే వచ్చాం కదా!”
“సారీ, నేనొప్పుకోను”.
“ఒక్క విషయం. నేను ఈ వూళ్ళో అనాథగా ఉండుంటే నన్ను పెళ్లి చేసుకునేదానివా?
“నో వే”.
“ఈ ఊళ్ళోవాళ్ళ లాలన, పాలనా లేకపోయుంటే నేను గాలికి తిరుగుతూ ఉండేవాణ్ణి. వాళ్ళు అప్పుడు రక్త సంబంధం లేని నన్ను పెంచి పోషించే నైతిక బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఊరు బాగోగులు మెరుగుపరిచే నైతిక బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే అమెరికా వెళ్ళి ఇన్ని డబ్బులు సంపాయించాను”.
కొంత సేపు మౌనం తరువాత, “నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఏమీ అనుకోకు వినయ్”, అని క్షమాపణ చెప్పింది కుసుమ.
******
(కథ కంచికి)


No comments: