Thursday, November 16, 2017

చిట్టి కథకు ముగింపు- ఇప్పుడే తెలిసింది

Given Story:

అతడు ఇంట్లోకి దూరి అనిల్ జుత్తు పట్టుకుని రెండు చెంపలూ వాయిస్తున్నాడు.... అనిల్ తండ్రి రెండు చేతులూ వాల్చి కలుపుకుని తలదించుకున్నాడు. అనిల్ తల్లి భారతి వంటగదిలో మొహం సగం చీరకొంగుతో కప్పుకొని కన్నీరు కారుస్తూ తొంగి చూస్తోంది....
My conclusion:
ఇప్పుడే తెలిసింది
అతడు మరెవరో కాదు అనిల్ వాళ్ళ తెలుగు మాష్టారు. బాగా చదువుకున్న వాడు. ఈ రోజుల్లో అందరూ మాతృభాషని మరచిపోతున్నారని ఇంజనీరింగ్ చదివాక ఎం.ఏ తెలుగు చదివి, ఆ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరాడు. నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండే రకం.

అంత మంచి మనిషి అనిల్ ని చితకబాదుతున్నాడంటే వీడు ఆయన్ని ఆ సెంటిమెంట్ మీద ఏమైనా దెబ్బ కొట్టాడా, అని  ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కొంత సేపటికి, “నన్ను కొట్టింది చాలు సార్! ఎందుకు కొడుతున్నారో చెప్పండి”, బతిమాలాడు అనిల్. “ఇందాక మైక్ ముందు ఏమన్నావురా? ‘తెలుగు నేర్చుకుంటే ఏం లాభం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతికేయచ్చు’, అన్నావా, లేదా? మైక్ దొరికితే మైకాసురుడివైపోతావురా? ఎంత ధైర్యంరా నీకు, మాతృభాషని అవమానించడానికి? అమ్మను ఎవరైనా అవమానిస్తే ఊరుకుంటామా? అలాగే అమ్మ భాష కూడా! అందుకే నిన్ను చితగ్గొట్టాను”, అని ఊగిపోతూ ముగించాడతడు. భయంతో కూడిన మౌనం పాటించి, “ఇప్పుడు గుర్తొస్తోంది సార్! అది వాద-ప్రతివాద పోటీ సార్. అందులో నా సహచరుడు తెలుగునే సమర్థిస్తానన్నాడు. ఇంక నేను ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థించక తప్పలేదు. అది కేవలం పత్రధారణే సార్, నన్ను నమ్మండి సార్!” అని రోదించాడు అనిల్. “కేవలం పాత్రధారివి ఆ ఆంకర్ భాషేమిటి? ‘టెలుగు నేర్ష్ కుంఠె ఏం లాబం,  ఇంగ్లీష్ మీడియంలో చడువ్ కుంఠె ప్రాపెంషంలో ఎఖ్ఖఢికయ్ నా వెల్లి బాటికెయ్యచ్చు.... ఏంట్రా అది... మాతృభాషని మరచిపోవడం కన్నా ఇలా చంపెయ్యడం ఇంకా ఘోరంరా! మారిషస్, ఫిజీలాంటి దేశాల్లో స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే నీకేం తెగులురా?” అని తిట్టాడు మాష్టారు. “ఏదో కొత్తగా ట్రై చేస్తే ఎక్కువ మార్కులొస్తాయనుకున్నాను. అది పని చేయదని ప్రైజ్ రానప్పుడు, మీ చేత తన్నులు తిన్నప్పుడే కదా తెలిసింది?” అని తన దెబ్బలని చూసుకుంటూ గొణిగాడు అనిల్.
*************************

No comments: