Given Story:
ఐదేళ్ళ సుదీర్ఘ యుద్ధ పోరాట అనంతరం జయరాం కు
విజయం వరించింది. డిఎస్సీలో క్వాలిఫై అయ్యాడు. టీచర్ ఉద్యోగం ఖాయం. ఆనందంతో తల్లీతండ్రీ
కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. పోస్టింగ్ ఆర్డరు అందుకుని నీరుగారి పోయాడు జయరాం. "ఉద్యోగం వదులు
కోవాలేమో". " ఏం "
అడిగారు తండ్రి. " అతి కష్టం మీద
ఉద్యోగం వస్తే వదులుకుంటావా " ఆశ్చర్యంగా అంది తల్లి. "
అలమండ లో ఇద్దరు
టీచర్ల స్కూల్లో పోస్టింగమ్మా" " అయితే ..."
"
అక్కడ హెడ్
మాష్టారు రాంబాబు అమ్మా "....
My Conclusion:
“ఎవరూ, మీ సీనియర్ రాంబాబేనా?” అడిగింది తల్లి. “అవును, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు,
వీడెక్కడ దాపురించాడమ్మా!” బాధపడ్డాడు జయరాం. “అయితే మంచిదే! వాడైతే తెలిసిన వాడు గనుక
మేం నిశ్చింతగా ఉండచ్చు. నువ్వేంట్రా శనీశ్వరం లాంటి పాడు మాటలంటున్నావ్ వాణ్ణి?”
తల్లి వారించబోయింది. “నా డీ యస్సీ ఐదేళ్ళు అవడానికి కారణం వాడేనమ్మా!” అన్నాడు
జయరాం బాధగా.
“మాకు తెలిసి నీకూ, వాడికీ శత్రుత్వం లేదు. ఇదేప్పటి నుండి?
వాడు నీకేం ద్రోహం తలపెట్టాడు?” కోపం, బాధ కలబోసిన గొంతుతో అడిగింది తల్లి. “ఏ
మొహం పెట్టుకుని చెప్తాను? అమ్మా, నాన్నా మీరు నన్నేమీ అనరంటే నా గుండెలోతుల్లో
నిక్షిప్తమైన ఒక రహస్యాన్ని చెప్తాను”, తల దించుకుని అన్నాడు జయరాం. చెప్పమన్నట్టు
సైగ చేసింది తల్లి. “మేం చదివే కాలేజీ దగ్గర ఒక ఉమెన్స్ కాలేజీ ఉంది కదా... అక్కడ
చదివే ప్రియ అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాను. ఆమె లేనిదే నా బ్రతుకు
దుర్భరమనిపించింది. ఓ ఏడాది ఆమెను గమనిస్తూ గడిపాను. మరో ఏడు ఆమెను వెంబడిస్తూ
గడిపాను. మూడో ఏడు ఆమెను పెళ్ళి చేసుకుంటానన్నాను; చీదరించుకుంది. ఆ వయసు వేడిలో
ఆమెను వెంబడిస్తే సినిమాల్లోలా నన్ను పెళ్ళి చేసుకుంటుందని ఆశపడ్డాను. ఆమె ఇంట్లో
చెప్పింది. ఒక బలశాలి వచ్చి నన్ను చావదన్నాడు. “ఒరేయ్, ఆమె ఎవరో కాదు, నేను త్వరలో
పెళ్ళి చేసుకోబోయే మా మరదలు”, అన్నాడు. వాడే రాంబాబు. ఇప్పుడక్కడికెళ్తే, ఆ
అమ్మాయి వాడి భార్యగా దర్శనమిస్తుంది. నేను చేసిన చెత్త పని నన్ను వెక్కిరిస్తుంది.
ఆమెను మరచిపోయి, పరీక్ష పాస్ అవడానికి ఇన్నాళ్ళు పట్టింది. వేరే ఉద్యోగాన్ని
వెతుక్కుంటాను గాని ఆమెను, రాంబాబుని చూస్తూ, అక్కడ పనిచేసే ధైర్యం లేదు”,
పశ్చాత్తాపంతో ముగించాడు జయరాం.
*******************
No comments:
Post a Comment