Saturday, November 11, 2017

చిట్టి కథ- involving a letter- సరదారాయుడు గారి ప్రేమ కథ

Requirement: "చిట్టి కథ రోజు....అయితే ఈసారి వైవిధ్యంగా భావావిష్కరణ చేద్దాం....
" ప్రియమైన మీకు
   ..... ....  .... ...
       .... ..... .... .....
         ప్రేమతో...నేను "
ఈ మధ్యలో అందమైన లేఖ రాయండి. చిట్టి కథ అల్లండి. అంతరంగాన్ని నివేదించండి... లేదా ఎత్తుగడగా వాడండి. కొసమెరుపుగా ముగించండి."
  
సరదారాయుడు గారి ప్రేమ కథ
మత్తెక్కించే మల్లెల వాసన నింపుకుందా కవరు. ఆ పరిమళాల సుగంధంలో తేలిపోతూ, తెరిస్తే కంటపడిందో అందమైన దస్తూరీ. ఆ అక్షరాలన్నీ పేర్చి, కూర్చితే ఒక ఖరీదైన ముత్యాల హారం తయారవుతుంది. ఇదో వింత అనుభూతి. మొదటి సారి తనకో లేఖ వచ్చింది, అదీ మత్తెక్కించే పరిమళంతో! లేఖ చదవనారంభించాడు:

“ప్రియమైన సరదారాయుడు గారికి,
ప్ర్...ప్ర్ అబ్బా నాకు సిగ్గేస్తోందండీ! రెండు వారాల క్రితం మిమ్మల్ని మనూరి అమ్మవారి జాతరలో చూసినప్పటి నుండీ మీ మీద మనసు పారేసుకున్నాను. అరిటాకుపచ్చ రంగు షర్టూ, అరటి పూవు రంగు ప్యాంటూ, ఎండకు మీ నాజూకైన చర్మం కందకుండా కళ్ళద్దాలూ...ఓహో! తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోందండీ! ఇదేదో మామూలు ఆకర్షణ అని ఇన్నాళ్ళూ అనుకున్నాను. కానీ, నేను కళ్ళు తెరిచినా, మూసినా మీరే! మిమ్మల్ని వదలి ఇన్నాళ్ళూ ఎలా గడిపానో తెలియదు కానీ, ఇక మీదట జీవించలేను. ఆఁ, అన్నట్టు అసలు సంగతి మరచేపోయాను. నా గురించి మీకు తెలియదు కదూ! తెలుసుకోవాలని ఉందా? ఈ విషయం ఆలోచిస్తుంటేనే నా చేతులొణుకుతున్నాయి. నన్ను ప్రేమిస్తున్నారు కదూ! మీరు నన్ను ఈ ఆదివారం సాయంత్రం ఆరింటికి మనూరి పార్క్ వద్ద కలుస్తారని ఆశిస్తూ,
మీ
కుసుమకోమలి”.
ఆహాఁ, ఎంత అందమైన పేరు, అని పొంగిపోయాడు సరదారాయుడు. ఆ ఉత్తరాన్నే మళ్ళీ మళ్ళీ చదివి, ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఇంతకీ, తన వూరిలో తనకు తెలియని అమ్మాయి ఎవరన్న ఉత్కంఠ పెరిగిపోయింది. ఇన్నాళ్ళూ అమ్మాయిలకి ప్రేమలేఖలు వ్రాసి టైం వేస్ట్ చేశాడు. ఒకమ్మాయే తనకు ప్రేమ లేఖ రాసిందంటే, తన స్థాయి పెరిగిపోయిందని తెలుసుకున్నాడు. ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి, ఆమెకు నచ్చిన ప్యాంటు, షర్టు వేసుకుని పార్కుకి వెళ్ళాడు. ఎర్ర చీర కట్టుకుని, తెల్లగా, అందంగా ఉన్న అమ్మాయి, “సరదారాయుడు గారూ”, అని పిలిచింది. అతను తనకేమవుతుందో తెలియని తన్మయత్వంలో ఆమె వద్దకు వెళ్ళాడు.
***
మర్నాడు న్యూస్ పేపర్లో స్థానిక వార్తల పేజీలో ఒక హెడ్ లైన్ వచ్చింది, “రోడ్ రోమియో అరెస్ట్: కొంప ముంచిన ప్రేమలేఖ”, అని.

*****

No comments: