డాడీ
అవి నేను ఉద్యోగానికి గాను బరోడాలో శిక్షణ
పొందుతున్న రోజులు. మా శిక్షణా కళాశాల స్వర్ణోత్సవం అప్పుడే జరిగింది. ఆ
అవకాశాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా మా
సంస్థలో పనిచేసే ఉద్యోగులు, ఉన్నతాధికారులు రచించిన చిత్రాలను ప్రదర్శించాలని నిశ్చయించారు.
ప్రదర్శనా నిర్వహణకి ముగ్గురు ట్రైనీలని ఎంపిక చేశారు. ముగ్గురూ వేర్వేరు శాఖలకి
చెందినవారు. ఇద్దరబ్బాయిలు, నేను. మా నాయకుడికి చిత్రలేఖనంలో ప్రవేశముందట. రెండవ
అబ్బాయికి చిత్రలేఖనమంటే ఒక అవగాహన ఉందట. ఏమీ లేని మొద్దుని నేనయ్యాను. అయినా, మా
వాళ్ళిద్దరూ నన్ను దెప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించారు.
వచ్చిన చిత్రాలు
చూస్తే మా ముగ్గురి కళ్ళు జిగేలన్నాయి- అంత బాగున్నాయి. ఉన్న చిత్రాలన్నీ మేము
రెండు గదుల్లో సర్దాలి. మూడు రోజుల ముందుగా ఆ గదులు రెండూ మా చేతికొచ్చాయి.. అన్ని
రోజుల్లోనూ మాకు క్లాసులుండేవి. అందుకని మధ్యాహ్నం భోజన వేళ, సాయంత్రం నుండి అర్థ
రాత్రివరకూ కష్టపడేవాళ్ళం. అత్యంత విలువైన చిత్రాలు పోకుండా చూసుకునేందుకు ఒకరు కాపలా
వుంటే, మిగతా ఇద్దరూ భోంచేసి వచ్చేవారు. మా నాయకుడు ఎప్పుడూ మమ్మల్ని ముందు తిని
రమ్మనేవాడు. చిత్రాలని ఎలా సర్దాలా అని చాలా మెదడుని తుపాను (బ్రెయిన్ స్టార్మింగ్
అన్నమాట)కు గురి చేసి కొన్నింటిని వాటి లక్షణాల బట్టి, మరి కొన్నింటిని వాటి
చిత్రకారుల పేరు మీద సర్దాము. ఒక ఉన్నతాధికారి వంద చిత్రాల సీడీ పంపారు. అయన
చిత్రాలని “ప్రింట్ స్క్రీన్- పేస్టు” కమాండ్ల సాయంతో ఒక ప్రెసెంటేషన్ తాయారు
చేసి, “అన్ లిమిటెడ్ లూప్” సెట్టింగ్ తో వరుసగా నడిచేటట్టు చేశాం. ప్రదర్శన రోజున
మాకు సాయపడడానికి మరి కొందరు వచ్చారు. ఆడపని, మగపని తేడా లేకుండా అబ్బాయిలు గదిని
శుభ్రం చేస్తే, మేం ముగ్గురు అమ్మాయిలం ముగ్గులు పెట్టాము. మా ప్రదర్శన
స్వర్ణోత్సవ వేడుకలకే హైలైట్ గా నిలిచింది. మా నాయకుణ్ణి ఎవరైనా మెచ్చుకుంటే,
వినయంగా, “మేరే ప్యారే బచ్చే బహుత్ మెహనత్ కియే(నా గారాల పిల్లలు చాల కష్టపడ్డారు)”,
అని చెప్తూండేవాడు. మేమిద్దరం అతన్ని “డాడీ, డాడీ”, అని సరదాగా పిలిచే వాళ్ళం.
అతను మాత్రం ఆ మాటలని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తిండి కోసం క్యూలో
నిలబడినప్పుడు అతను గనక ముందుంటే, మా ఇద్దరికీ ముందు తిండి పెట్టేవాడు. “ప్లీజ్,
మేరె బచ్చోన్ కే లియే”, అని మిగతా వారిని బ్రతిమిలాడేవాడు. ఒక రోజు నేను కాంపస్ లో
ఉండే గుడికి వెళ్తూంటే అకస్మాత్తుగా వాన పడింది. మళ్ళీ రూమ్ కి వెళ్ళి గొడుగు
తెచ్చుకునేందుకు బద్ధకించి, నా చున్నీని నెత్తికి చుట్టుకుని నడక సాగించాను. వెనుక
నుండి గొడుగు తీసుకొచ్చాడు మా డాడీ. నేను తడవడం చూసిన మరో ట్రైనీ మా డాడీతో, “మీ
అమ్మాయి తడిసిపోతోంది”, అని చెప్పాడట. చెప్పిన వాడు వెటకారంగా అన్నాడో,
మనస్ఫూర్తిగా అన్నాడో తెలియదుగాని మా డాడీ వెంటనే గొడుగు తీసుకుని వచ్చాడు.
“నువ్వు నిజంగా మా నాన్న గారిలా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావే”, అన్నాను.
“తండ్రితనంలో ఉండే మమకారం అదేలే”, అన్నాడు డాడీ.
తా.క.
ఇప్పటికీ అతణ్ణి
డాడీ అనే పిలుస్తాను. మా తమ్ముడికి పెళ్ళైనప్పుడు ఫ్యామిలీ స్పెషల్ అని చెప్పి
నాకు, డాడీకి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. అదండీ మా “డాడీ” కథ.
*************************
No comments:
Post a Comment