అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?
ఓ ఆడపిల్ల సందిగ్ధం:
నేను కొనుక్కున్న సీడీ
నాక్కావలసిన పాటలు పాడుతుంది
నేను కొనుక్కున్న కారు
నాక్కావలసిన చోటికి తీసుకు వెళ్తుంది
వీటి కన్నా ఖరీదుపెట్టి కొనుక్కోబోయే
భర్తతో సర్దుకుపొమ్మంటుంది మా అమ్మ,
అదేమి చోద్యమోగాని!
చుట్టుపక్కల అమ్మలక్కలు కట్నమిచ్చి ఏం
బావుకున్నారు?
అత్తమామల అవమానాలు
అడబడుచుల ఆరళ్ళు
భర్త చేతి దెబ్బలూ తప్ప!
ఈ కట్న పిశాచి స్త్రీలను స్త్రీలకు
శత్రువును చేసి వికటాట్టహాసం చేస్తుంది!
పురుషాధిక్య సమాజాన్ని కొనసాగిస్తుంది
హెచ్చుతగ్గులు సృష్టిస్తుంది
సమాజాన్ని దిగజారుస్తుంది
నేను కట్నమివ్వకపోతేనో?
నాకు పెళ్ళి కాదు అంతేగా!
పోతేపోనీ, నా సమయం
నా చేతిలో ఉంటుంది
నేను కొనుక్కున్న సీడీ
నాక్కావలసిన పాటలు పాడుతుంది
నేను కొనుక్కున్న కారు
నాక్కావలసిన చోటికి తీసుకు వెళ్తుంది.
అసలు, అందరమ్మాయిలూ పెళ్ళి చేసుకోమని
భీష్మించుకు కూర్చుంటేనో?
అబ్బాయిలకి కట్నాలెవరిస్తారు?
అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?
******************
No comments:
Post a Comment