ఆ రోజు ఆఫీసులో ఒకటే
హడావుడి. ఎంత సౌండ్ ప్రూఫ్ గదిలో ఉన్నా ఆ అరుపులు అవినాష్ చెవిని పడ్డాయి. ఆ
ప్రభుత్వ ఫ్యాక్టరీలో మానవ వనరుల మేనేజర్ గా పని చేస్తున్నాడు గనుక అతను వెంటనే
అప్రమత్తుడై బయటకు నడిచాడు. చూడబోతే, ఓ వంద మంది ఉద్యోగులు, “యాజమాన్యం డౌన్ డౌన్”,
అని నినాదాలు చేశారు. అతణ్ణి చూసిన వెంటనే, “పనికిమాలిన హెచ్చార్ మేనేజర్ ఇంటికి
వెళ్ళాలి”, అని కూడా అరిచారు.
ముప్ఫై అయిదేళ్ళ అవినాష్ హార్లిక్స్ కంపెనీలో మానవ వనరుల శాఖలో
పని చేసి కార్మిక-యాజమాన్య సంబంధాలలో దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు. తన స్నేహితుడు
సుప్రీత్ ఈ ఫ్యాక్టరీకి ఎండీగా ఎంపికవడంతో అతడు పట్టుపడితే, ఇటొచ్చాడు. వచ్చిన
రెండు నెలల్లో కార్మిక సంబంధాలు మెరుగు పరిచాడు. చాలా ఏళ్లుగా పరిష్కారం లేకుండా పడున్న
ఫిర్యాదులను అర్థవంతంగా పరిష్కరించాడు. రెండు దశాబ్దాలుగా లేని వేతన పెంపు తనొచ్చిన
నెల రోజుల్లో అమలు పరిచాడు. ఏ గొడవలూ లేకుండా సజావుగా నడుస్తున్న ఆ ఫ్యాక్టరీలో ఆ రోజు ఆ బిగ్గర అరుపులు అతణ్ణి
కలవరపరిచాయి.
“మీ సమస్యలను యాజమాన్యం ముందుంచుతాను. మీ ప్రతినిధులని లోపలికి
పంపండి”, అని ఆహ్వానించాడు. తను వేతన పెంపు గురించి చర్చించినప్పుడు లోపలికి
వచ్చిన వాళ్ళలో ఒక్కరు కూడా లేరు. అలాంటిది ఆకాశం నుండి ఊడి పడ్డట్టు వీళ్ళెక్కడినుంచి
వచ్చారో అతనికి అర్థం కాలేదు. “మనం పరిచయం చేసుకుందామా?” అని మొదలెట్టాడు అవినాష్.
వాళ్ళు కనీసం రెండు దశాబ్దాల క్రితం రిటైరైన
వాళ్ళట. “మేము ఇక్కడ ఉండే రోజుల్లో మా పేర్లు వింటే యాజమాన్యం వాళ్ళకి చలి జ్వరం
వచ్చేది తెలుసా?” అన్నాడొకాయన తీక్షణంగా చూస్తూ. అవినాష్ అయోమయంగా చూస్తుంటే, “అలాంటిది
ఇప్పుడు మీరు యూనియన్ ని కొనేసి వేషాలు వేస్తారా?” అడిగాడు మరొక పెద్దమనిషి. “చూడండి,
ఇక్కడ యాజమాన్యానికి, కార్మికులకి సత్సంబంధాలుండడానికి కారణం ఇరుపక్షాల వారూ
బాధ్యతాయుతంగా నడుచుకోవడం; సమస్యలు వెంటవెంటనే పరిష్కారమవడం. యాజమాన్యానికి
కార్మికులని కొనాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు”, అన్నాడు అవినాష్. “మరి ఇంకొన్ని డిమాండ్స్ మిగిలాయి”, అన్నాడు
మరొక పెద్దాయన. చెప్పమన్నాడు అవినాష్.
“ఒకటి, మరొక వేతన పెంపు కావాలి. రెండు, ఏడాదికి ఆరు నెలలు బోనస్
కావాలి. మూడు, వారానికి పని గంటలు నలభై ఎనిమిది నుండి నలభైకి తగ్గించాలి”, అన్నాడు
వాళ్ళందరిలోనూ పెద్దతను. మొదటి కోరిక ఉత్తుత్తిగా వెలిబుచ్చినట్టుంది; రెండవది
తీర్చాలంటే ఫ్యాక్టరీని మూసెయ్యాలి; మూడవది భారత పార్లమెంటు చేతుల్లో ఉంది. మామూలు
మనిషికైతే పిచ్చికోపం వచ్చి ఉండేది. హెచ్చార్ మేనేజర్ గనుక, “మా బాగా చెప్పారు....
ఇక దయచేయండి”. అన్నాడు. వాళ్ళు గొంతు పెంచబోతే, “మీ దృష్టిలో కార్మికులకి,
యాజమాన్యానికి సత్సంబంధాలుండకూడదు. మీ తరపు భావజాలంలో కూరుకు పోయారు మీరు. లాక్
అవుట్ వల్ల మీరూ, ఫ్యాక్టరీ- అంతా నష్టపోయారు కదా! అయినా, కొత్త తరం యూనియన్
సభ్యులు అందరూ బాగుపడే దృక్పథంలో నడుస్తుంటే మీకు నచ్చుబాటుకాక, మీ ఉనికిని
చాటుకోవడానికి కొందమంది ఉద్యోగులను పోగు చేసి ఈ అనవసరపు గోల చేశారు. మర్యాదగా
దయచేయండి. లేకపోతే పోలీస్ కి ఫిర్యాదు చెయ్యాల్సి వస్తుంది”, చిన్నదైన, దృఢమైన
గొంతుతో అవినాష్ చెప్పగానే ఆ కూసే మనుషులు నిష్క్రమించారు.
***
No comments:
Post a Comment