పెళ్ళైన అయిదేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క
నలుసు, పదేళ్ళ శరణ్యకి బాగా జబ్బు చేసింది. ఒళ్ళంతా నీలంగా మారుతుంటే, ఆసుపత్రికి
తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తే రక్తనాళాల కాన్సర్ అని డాక్టర్ నిర్ధారించారు. అద్దె
ఆటో తోలే అతనికి, నాలుగిళ్ళలో పాచిపని చేసుకునే ఆమెకి, పిల్లని బ్రతికించుకోవడం
ఎలాగో అర్థం కాలేదు.
కాన్సర్ ప్రారంభదశలో ఉందని డాక్టర్ అన్నా, మొత్తం ఖర్చు
నాలుగైదు లక్షలదాకా అవచ్చని ఆయన చెప్పారు. పేద ప్రజలకిచ్చే ఆరోగ్య బీమా డబ్బులు
దీనికి సరిపడవు. పోనీ శరణ్య చదువుకి దాచిన డబ్బు, ఎందుకైనా మంచిదని పోగు చేసిన
బంగారం అన్నీ అమ్మేస్తే, అరవై వేలకన్నా రావు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే అంత డబ్బు
ఎవరిస్తారు? అడిగి భంగపడేకంటే అడక్కపోవడమే మేలనుకున్నారు ఆ దంపతులు. అందుకే, పక్కపక్కనే దగ్గరగా కూర్చుని ఉన్నా ఆమెకూ అతనికీ మధ్య
నిశ్శబ్దపుగోడ నిలబడే ఉంది. ఉండదు మరి?
కొంతసేపటికి, ఆ గోడను కూల్చేస్తూ, “పొద్దుటినుంచీ
ఏమీ ఎంగిలి పడలేదు. మన వీధి చివర ఉండే బండి రాజు దగ్గర నాలుగు పుల్లట్లు కొన్నాను.
ఇంద, తీసుకో”, అన్నాడతను. “నువ్వు కూడా తినలేదు కదా! ఇద్దరం కలిసే తిందాం”, పొట్లం
అందుకుంటూ అందామె. పొట్లం విప్పుతూ ఏదో వార్త చదివిన ఆమె కన్నీళ్ళ పర్యంతమయ్యింది.
భయపడ్డ అతడు వచ్చి, ఆ పేపర్ వార్తని చదివాడు. ‘కాన్సర్ పీడితులైన పేద రోగులకి ఉచిత
చికిత్స’ అని వ్రాసుంది. ఇద్దరూ తిండి మానేసి ఆ వార్త ఆద్యంతం చదివారు. చెన్నైలోని
అడయారు కాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు పేద రోగులకు ఉచిత చికిత్స చేస్తారని, రోగికి
తోడుగా ఉండే వారికోసం బస కూడా తక్కువ ఖర్చుకి ఏర్పాటు చేస్తారని ఉంది.
పుల్లట్లు తిని, చెన్నై వెళ్ళడానికి కొత్త
ఉత్సాహంతో ప్రణాళిక వేసుకున్నారు ఆమె, అతడు.
*****
No comments:
Post a Comment