“ప్రతీసారీ నన్ను గంటల
కొద్దీ వెయిట్ చేయిస్తావు నీకిదేం వికృత సంతోషం అద్వితీ?” అన్నాడు అపురూప్. “నీకేం
బాబూ, మగ మహారాజువి. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఎవరూ పట్టించుకోరు. నేనేమో ఆడపిల్లని.
హాయిగా నా బతుకు నేను బతుకుతుంటే ఈ ప్రేమలో పడేశావ్. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో
చెప్పి వెళ్ళే నేను అబద్ధం నేర్చుకుంటున్నాను. కారులో వస్తే ఇంట్లో తెలిసిపోతుందని
స్పెషల్ క్లాస్లున్నాయని ఇంట్లో చెప్పి, నీ కోసం రెండు బస్సులు మారి వస్తున్నాను. నీకు
మంచి ఉద్యోగం వచ్చి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వి అయ్యేదాకా ఇవి భరించలిలే”, అంది అద్వితి.
ఒక రోజు అపురూప్ పై జాలితో కాలేజీ
మధ్యాహ్నానికే ఎగ్గొట్టి, వుడా పార్కులో వాళ్ళు కలుసుకునే బెంచీ దగ్గర కూర్చుంది.
టైం మూడున్నర అయ్యింది. మరో పావుగంట అయ్యాక తన ప్రేమికుడికి సర్ప్రైజ్ ఇద్దామని ఆ
బెంచీ వెనుక ఉండే పొద వెనక్కి జారుకుంది.
ఐదు నిముషాల్లో
ఇద్దరబ్బాయిల మాటలు వినిపించాయి. “అపురూప్, ఐఏఎస్ చదివేవాడివి ఇలా ప్రేమ, దోమ అంటూ
బీచ్ వెంబడి తిరగడం ఏమీ బాగులేదురా!” అన్నాడొక అబ్బాయి. “ఐఏఎస్సా కాకరకాయా! అంతా
ఏప్రిల్ ఫూల్”, అని బిగ్గరగా నవ్వాడు అపురూప్. స్నేహితుడు అతణ్ణి వరించబోతుంటే, “ఈ
మహారాణి గంటల కొద్దీ లేట్ అవుతుందిలే. నో ప్రాబ్లం! ఈమె ఒక కోటీశ్వరుడికి ఏకైక
సంతానం, కానీ దర్పం లేదు. సో, ఈజీగా పడగొట్టాను. ఎప్పుడో ఒకసారి వాళ్ళ నాన్న
దృష్టిలో పడ్డానంటే, ఇంతే సంగతులు. అయితే పెళ్ళి, లేకపోతే, కోట్ల కొద్దీ డబ్బిచ్చి
ఆయన నన్నొదిలించుకుంటాడు. బొమ్మైనా, బోరుసైనా గెలుపు నాదే హ హ హ”, అని సగర్వంగా బాకా ఊదుకున్నాడు అపురూప్.
పొద చాటున ఉండి, ఈ సంభాషణ విన్న అద్వితి కన్నుల్లో
గిర్రున కన్నీళ్ళు తిరిగాయి.
*****
No comments:
Post a Comment