పండుగ- సంస్కృతి- సంస్కారం
“సుందరం, మీ అల్లుడు చాలా
బుద్ధిమంతుడయ్యా! అమెరికాలో పెరిగిన అబ్బాయైనా, ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో! అందరినీ
తెలుగులో, ‘విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు’, అని పలుకరిస్తూంటే, నా
చిన్నతనం గుర్తు వచ్చిందంటే నమ్ము! చిలుకా- గోరింకల్లా కొత్త జంట భలే
ముచ్చటొస్తోందోయ్,” మెచ్చుకోలుగా అన్నాడు పరంధామం. “నిజమే బాబాయి గారూ! ఈ అమెరికా
వాళ్ళు ఓ పెళ్ళిలో చూసి, మా అమ్మాయిని చేసుకుంటామని ఊదరగొట్టేస్తే నేను, ఉమా కూడా
అలాగే భయపడ్డామనుకోండి! కానీ మా బంధువులబ్బాయి ఒకడీమధ్యే వీళ్ళ ఊరెళ్ళాడు చదువు
కోసం. వాణ్ణి వీళ్ళ గురించి విచారించామన్నాం. వాడు వెంటనే, వాళ్ళ గురించి ఓ
పురాణమే చెప్పాడు. వాళ్ళు ప్రతి పండుగనూ సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారట. ఊళ్ళో
ఉండే తెలుగు వాళ్ళని, ఇతర భారతీయులని పిలిచి సాంప్రదాయ వంటకాలతో విందు
చేసి, సంస్కృతిపరంగా జరిగే కార్యక్రమాలని కుదిరిన మేరకి నిర్వహిస్తారట. అందుకే
ఒప్పుకున్నాం. గొప్ప చెప్పుకుంటే బాగుండదు, మా అల్లుడు మా కోసం కొత్త బట్టలు
తెచ్చాడండీ”, అని ముగించాడు సుందరం.