Wednesday, March 28, 2018

చిట్టి కథ- context- ఆదర్శం



Given Story: 
ఆత్మీయ మిత్రుడు అరవింద్ ఇంటికి వచ్చి శుభలేఖ ఇస్తూ "మీరు కుటుంబ సమేతంగా పెళ్ళికి రావాలి...వీలుచేసుకుని ఓ మూడురోజుల ముందు", అని ఆహ్వానించగానే ఉబ్బితబ్బిబ్బయ్యాడు రాజేష్.  మిత్రుడు ఉండేది ప్రక్క ఊరిలోనే. రెండు గంటల ప్రయాణం. బయల్దేరిన మిత్రుడు అరవింద్ కి వీడ్కోలు చెప్పి ఇంట్లోకి వచ్చి శుభలేఖ విప్పి పెద్ద అక్షరాలతో ముద్రించిన వాక్యాన్ని చదివి గతుక్కుమన్నాడు.... "బహుమతులు స్వీకరింపబడవు".
My Conclusion:

ఆదర్శం
రాజేష్ గతంలోకి వెళ్ళాడు. ఎప్పుడూ అరవింద్ తనకి కూతురు పుట్టింది కనుక మైనస్ అని బాధపడుతూ ఉండేవాడు. వాళ్ళ ఆఫీస్లో ఒక నార్త్ ఇండియన్ ఆఫీసర్ ఉండే వారు. ఆయన కూతురికి పెళ్ళైనప్పుడు ఆఫీస్ స్టాఫ్ అంతా ఎంతో కొంత వేసుకుని గిఫ్ట్ ఇద్దామనుకుని, “ఏం కొనిమ్మంటారు, సార్?” అని ఆయన్ని అడిగారు. ఆయన, “మీకు మా పద్ధతులు తెలియదల్లే ఉంది. మాలో రొక్కం రూపంలో బోలెడంత కట్నాలిచ్చుకోవాలి. అందుకని కాష్ లోనే ఇవ్వండి”, అని అన్నారు. బయటికి వచ్చాక అరవింద్, “ఇదేదో మన తెలుగు వాళ్ళూ పాటిస్తే బావుణ్ణు. అందరూ ఏవో బొమ్మలూ, గిమ్మలూ తెస్తారుగాని, ఎంచక్కా కాష్ ఇస్తే వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటాయి”, అన్నాడు. అలాంటిది, ఇవ్వాళ, వాడి కూతురి పెళ్ళికి “బహుమతులు స్వీకరింపబడవు”, అని వ్రాశాడేమిటి?
పెళ్ళికి వెళ్తే మనుషులతో హడావుడిగా ఉంది గాని, ఎటువంటి ఆర్భాటాలూ లేవు. మళ్ళీ ఆశ్చర్యపోయాడు రాజేష్. కొంత సేపటికి నిజం తెలుసుకుని సంతోషపడ్డాడు. పెళ్ళికూతురు ఉద్యోగం చేస్తోంది గాని ఆర్భాటాలు నచ్చని మనిషట. తను దాచుకున్న డబ్బుతోనే పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుందట. గ్రాండ్ గా పెళ్ళిచేద్దామని తండ్రి ఎంత చెప్పినా తన మాట మీద నిలబదిందట. అలాగే, తనకు పోలిన అబ్బాయినే ఎంచుకుందట. పైగా, కుటుంబ సమేతంగా పెళ్ళికి తరలి రావాలంటే మధ్య తరగతి వాళ్ళెవరికైనా బోలెడు ఖర్చుంటుంది కాబట్టి, గిఫ్ట్ కోసం వాళ్ళచేత ఇంకా ఖర్చు పెట్టించడం సబబు కాదని, అందుకే ఇలా రాయించాలని పట్టు పట్టిందట. ఆమె ఆదర్శం తెలుసుకున్నవారెవరికైనా సంతోషంగా ఉండదూ?
********

No comments: