పండుగ- సంస్కృతి- సంస్కారం
“సుందరం, మీ అల్లుడు చాలా
బుద్ధిమంతుడయ్యా! అమెరికాలో పెరిగిన అబ్బాయైనా, ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో! అందరినీ
తెలుగులో, ‘విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు’, అని పలుకరిస్తూంటే, నా
చిన్నతనం గుర్తు వచ్చిందంటే నమ్ము! చిలుకా- గోరింకల్లా కొత్త జంట భలే
ముచ్చటొస్తోందోయ్,” మెచ్చుకోలుగా అన్నాడు పరంధామం. “నిజమే బాబాయి గారూ! ఈ అమెరికా
వాళ్ళు ఓ పెళ్ళిలో చూసి, మా అమ్మాయిని చేసుకుంటామని ఊదరగొట్టేస్తే నేను, ఉమా కూడా
అలాగే భయపడ్డామనుకోండి! కానీ మా బంధువులబ్బాయి ఒకడీమధ్యే వీళ్ళ ఊరెళ్ళాడు చదువు
కోసం. వాణ్ణి వీళ్ళ గురించి విచారించామన్నాం. వాడు వెంటనే, వాళ్ళ గురించి ఓ
పురాణమే చెప్పాడు. వాళ్ళు ప్రతి పండుగనూ సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారట. ఊళ్ళో
ఉండే తెలుగు వాళ్ళని, ఇతర భారతీయులని పిలిచి సాంప్రదాయ వంటకాలతో విందు
చేసి, సంస్కృతిపరంగా జరిగే కార్యక్రమాలని కుదిరిన మేరకి నిర్వహిస్తారట. అందుకే
ఒప్పుకున్నాం. గొప్ప చెప్పుకుంటే బాగుండదు, మా అల్లుడు మా కోసం కొత్త బట్టలు
తెచ్చాడండీ”, అని ముగించాడు సుందరం.
పంచాంగ శ్రవణం పూర్తయ్యాక కవి
సమ్మేళనం జరిగింది. అందులో సుందరం కూతురు ఒక వచన కవిత చదివింది. ప్రకృతి
పచ్చని దుప్పటి కప్పుకునే మాసం, ఎర్రని మామిడి చిగుళ్ళు తిని కోయిలలు మధురమైన
సంగీతాన్ని అందించే మాసం, కొత్త జంటలు ముద్దుగా మధుమాసమని పిలుచుకునే మాసం
చైత్రమాసమని, ఆ మాసానికి నాంది పలికే రోజు ఉగాది అని దాని సారంశం. అందరి మన్ననలూ పొంది ఇంటికి వెళ్ళేసరికి అక్కాబావల్ని
అల్లరి చేసేందుకు పెళ్ళికూతురి తమ్ముడుంటాడని ఆశ పడ్డాడు కొత్తల్లుడు. ఇంజనీరింగ్
చదివే ఆ పిల్లాడికి ఏదో అసైన్మెంటుందని, ఉగాది సాయంత్రానికొచ్చేస్తానని మాట
ఇచ్చాడు. వాణ్ణి ఆశ్చర్యపరుద్దామని పిల్లి నడక నడిచి, మామిడితోరణాలు కట్టిన
సింహద్వారాన్ని నెమ్మదిగా తొయ్యబోతుంటే, సుందరం భార్యకి, కొడుక్కీ మధ్య సంభాషణ
వాళ్ళ చెవిని పడింది: “ఏదో అమెరికా బావగారంటే ఫాషనబుల్ గా ఉంటారనుకున్నాను కానీ
ఈయన పల్లెటూరి బైతల్లే రెడీ అవుతారు. సంస్కృతి, సంప్రదాయం గాడిద గుడ్డూ అని అని
నేతి మిఠాయిలే తప్ప పిజ్జా, బర్గర్లూ తినరు. నేనింట్లో లేనప్పుడు హడావుడిగా
పెళ్ళి కుదిర్చేసి, చేసేశారు. మా ఫ్రెండ్స్ అమెరికా బావల ఫోటోలు చూపిస్తే, అక్కడ
హీరోల్లా ట్రెండీగా ఉన్న అబ్బాయిలు కనిపిస్తారు. మా బావగారని బిళ్ళా గోచీ పంచె,
లాల్చీ వేసుకున్న మనిషిని చూపిస్తే నాకు తలవంపులుగా ఉంది. డిస్కోకి వెళ్ళరు, కవి
సమ్మేళనం కావాలి. ఈ మనిషి బీసీకి చెందిన వాడా, లేక ఇరవైఒకటో శతాబ్దపు మనిషా?” అని
కొడుకు తల్లిని దుయ్యబెడుతున్నాడు. ఆవిడ వాణ్ణి కసురుకుంది. కోపంతో సుందరం
దురుసుగా వెళ్ళబోతుంటే, అల్లుడు వారించాడు. ఆ నిముషంలో ఎక్కడో ఉండి తెలుగు
సంస్కృతికి పెద్దపీట వేసే అల్లుడికి, ఇక్కడే ఉండి విదేశీ వ్యామోహంలో ఉన్న కొడుక్కీ
తేడా తెలిసింది. ఉగాది పచ్చడిలో తీపి అల్లుడైతే, అదే పచ్చట్లో చేదు
కొడుకు. పిల్లలిద్దరికీ ఒకే విధంగా సంస్కారం బోధించినా, కొడుకులో ఈ లోపం ఎలా
వచ్చిందో సుందరానికి అర్థం కాలేదు.
*****
No comments:
Post a Comment