Saturday, March 3, 2018

చిట్టి కథ- context- లేని పెద్దరికం


Given context:

     ఆమె ముతక చీరలో నడివయస్సులో పాత ముఖంతో కనిపిస్తున్నా పరిశుభ్రంగా ఉంది.ఖరీదైన వివాహ ప్రాంగణంలో ఆధునిక వాసనల మధ్య ఆమెని ప్రతి ఒక్కరూ గమనించినా తమ తమ హొయల ఒలకపోతలో నిమగ్నమై ఉన్నారు. ఎండాకాలం కావడంతో బయటంతా ఉక్కపోత. చివరగా కూర్చున్న ఆమె కళ్యాణ మండపం వైపు చూస్తూ నిశ్శబ్దంగా కన్నీటిని వర్షిస్తోంది...

My Story:

ఓ పాతికేళ్ళ క్రితం ఇలాగే తన పెళ్ళిజరగాలని ఆశపడింది. అదంతా నరహరిని కలవక మునుపు. తను  సంపన్న దంపతులకు ఏకైక పుత్రిక. పైగా ఆదర్శవాది. అందుకనే, తనకు పోలిన ఆదర్శాలు ఉండే నరహరిని ప్రేమించింది. తన తల్లిదండ్రులను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. “నిన్ను మేం అల్లారు ముద్దుగా పెంచాం. ఆ ప్లాట్ ఫారం గాడు నిన్ను ఎలా చూసుకోగలడు?” అని నాన్న ససేమిరా అన్నారు. ప్రేమించిన వాణ్ణి ‘ప్లాట్ ఫారం గాడు’ అనే పరుషపు మాట వాడినందుకు గాను తను చాలా బాధపడింది. ఇలాంటి చదువుకున్న మూర్ఖులకి కూతురుగా ఉండే కన్నా, ఆదర్శవాది అయిన ఆ ‘ప్లాట్ ఫారం గా’డి భార్యగా జీవించడం మేలని నిశ్చయించుకుని ఇంటి గడప దాటింది. అప్పుడే నరహరి నిజ రూపం తెలుసుకుంది. “నీ ఆస్తిని ఇష్టపడి, నీకు నచ్చే ఆదర్శాల భాషలో మాటలాడి నిన్ను మెప్పించాను. నీ ఆస్తి లేకపోతే, నీ విలువ శూన్యం. నీ దారిన నువ్వు పో”, అని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు. తన తండ్రి చెప్పినట్లు నరహరి నిజంగా ప్లాట్ ఫారం గాడే! తన తొందరపాటుకి సిగ్గుపడి, ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక, విశాల ప్రపంచంలో బ్రతకడానికి ధైర్యం చాలక, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు అటుగా వెళ్తున్న కాటరింగ్ వాళ్ళు ఆమెను కాపాడి, ఆశ్రయమిచ్చారు. ఇప్పుడు, ఇన్నేళ్ళకి ఆ నరహరి, అదే పారిశ్రామికవేత్త నరహరి కూతురి పెళ్ళికి కేటరింగ్ చేసే పని ద్వారా అతణ్ణి చూసే అవకాశం వచ్చింది. చుట్టుపక్కలవాళ్ళు ఎలాగూ ఆమెను గమనించడం లేదు గనుక బూందీ చట్రం తీసుకుని, ఎవరూ చూడకుండా, అతడి నెత్తిమీద ఒకటి గట్టిగా మొట్టింది. హాల్లో ఒకటే కలకలం. ఎవరో, పోలీసులని పిలుద్దామని గట్టిగానే అన్నారు.
నుదుట నెత్తుటిచుక్కలతో ఉన్న నరహరి మాత్రం, “ఆమె ఎవరో నాకు తెలియదు. ఎవరో అనుకుని పొరబడి ఉంటుంది. నాకేమీ కాలేదు కదా! ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం”, అని లేని పెద్దరికం చూపించి, తన పెద్దరికం కాపాడుకోజూశాడు.
*********


No comments: